బాబా బోధనలు ఆదర్శ జీవనాని కి సాధనలు

 

బాబా బోధనలు ఆదర్శ జీవనాని కి సాధనలు

సకల సుగుణాల సమ్మోహన స్వరూపం శ్రీ సాయిబాబా. బాబా జ్ఞాన వికాసాల పెన్నిధి. బాబా సన్నిధి మనలో వికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శన మాత్రంతోనే మనోవికారాలు, మనః చాంచల్యాలు పాటాపంచలైపోతాయి.
సాయి తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, ఋజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. ఎవరికీ అర్థంకాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు, హితోక్తులతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు.

సాయి రూపాన్ని ధ్యానిస్తే మదిలో కలిగే వికారాలు తొలగిపోతాయి. అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుతమూర్తి సాయి. ప్రేమ తత్త్వమే సాయి తత్త్వం. బాబాకు ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు లేవు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించడానికి, ఆదర్శ జీవనానికి బాటలు వేసి, జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవరూపంలో అవతరించిన దైవం సాయిబాబా.

పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేటలా అలముకున్న సాయి తత్త్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తూ ఉంటుంది. బాబా తన చక్కని, సరళమైన భోధనలతో ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్దరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. మనిషి ఎలా నడుచుకోవాలి? ఏది మంచి? ఏది చెడు? అనేది వివేచించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా.

బాబా తన భోధనల ద్వారా మనుషుల్ని సాధన మార్గంలో ఒక్కొక మెట్టు పైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి దారి చూపించారు. మహిమలతో కాదు మానవత్వంతో బతకాలని చాటిచూపారు. సాధారణ జీవితం గడిపి మన జీవితాల్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడనని చెప్పుకున్న నినయ భూషణుడు.

బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం! బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన! బాబా లీలలు దుష్ట బుద్దులు, ఆవ లక్షణాలను రూపుమాపుతాయి. బాబా మహిమలు మనో వికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయబర్చే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది.

నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. ఎవరికీ అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. బాబా చూపింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి.

యోగీశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్ళడం వల్ల అవి ఎప్పటికి సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే షిర్డీ సాయి స్వరూపమై వెలుగొందుతోంది.