Read more!

రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? 1

 

రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? - 1

 

మనము నిత్యమూ ఆ పరమ శివుని దివ్య మంగళ లింగ రూపమునకు అభిషేకాదులు భక్తితో నిర్వహిస్తూ ఉంటాము. నమక చమకములతో, ఉదాత్తానుదాత్త స్వరితాలతో భక్తి పారవశ్యంతో కొలుస్తూ ఉంటాము. ఐతే మనం చేసే అభిషేకంలో చెప్పే మంత్రార్థం మాత్రం తెలియకుండా అభిషేకము చేయడంకంటే ఆ మంత్రార్థము తెలిసి అభిషేకము చేసినట్లైతే  ఒక్క శాతం ఫలము పొందే స్థానంలో వంద శాతం ఫలాన్ని పొందగలం.
యదధీత మవిజ్ఞాతం నిగదేనైవ శబ్ధ్యతే
అనాగ్నావివ శుష్కేంధౌ నతజ్జలతి కర్హిచిత్.

తాత్పర్యము:- చదివిన దానికి తప్పక ఆర్థము తెలుసుకొన వలయును. జప మంత్రములకు జప కాలములో   అర్థభావన చేయవలయును. అర్థము తెలియని అక్షర జపము వలన అగ్ని లేని ఎండు కట్టెలు వలె అది జ్వలించదు. అనే ఆర్యుల అభిప్రాయంలో ఎంతో ఔచిత్యం ఉంది. ఐతే, మంత్రములో అక్షర దోషములు అనేకం ఉండే అవకాశము లేకపోలేదు. అలాంటి దోషాలు ఉన్నట్లయితే, వాటిని మీరు గుర్తించినట్లయితే మా దృష్టికి తీసుకొని రావడంతో పాటు దోష రహితంగా ఉండే అక్షర సూచన కూడా చేయ వలసిందిగా మీకు మనవి.
రుద్రము - నమకము

అనువాకము 1.
1వ మంత్రము.

నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.

ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.

2వ మంత్రము.

యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః.
శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ.

ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.

3వ మంత్రము.

యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశినీ.
తయాన స్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి.

ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.

4వ మంత్రము.

యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే 
శివాం గిరిత్ర తాం కురు మాహిగ్ ంసీః పురుషం జగత్.

ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.


5వ మంత్రము.

శివేనవచసాత్వా గిరిశాచ్ఛావదామసి.
యధానస్సర్వమి జ్జగదయక్ష్మగ్ ంసుమనా అసత్.

మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!

6వ మంత్రము.

అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్.
అహీగ్ శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః

మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!

7వ మంత్రము.

అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళః.
యేచేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాస్సహస్రశోవైషాగ్ ంహేడఈమహే.  

ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను.  అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను.   కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును,  వ్యాపించి యున్నారో  వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు.  సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును   ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.

8వ మంత్రము.

అసౌయో உవసర్పతి నీలగ్రీవో విలోహితః.
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః.
ఉతైనంవిశ్వాభూతాని సదృష్టో మృడయాతినః.
   

ఏ రుద్రుఁడు కాల కూటమను విషము దాల్చుటచే నీలగ్రీవము కలిగి యుండెనో,  అట్టి ఈతఁడు విశేషమైన రక్త వర్ణము కలవాడై, మండల వర్తియై, ఉదయాస్తమయ సంపాదకుడై ప్రవర్తించుచున్నాఁడు. అంతే కాదు. వేద శాస్త్ర సంస్కార హీను లైన గోపాలురు కూడ ఈ ఆదిత్య రూపుఁడై మండలమున గల రుద్రుని చూచుచున్నారు.  నీరమును గొనివచ్చు వనితలును ఈ రుద్రుని చూచుచున్నారు. అంతే కాదు ఆదిత్య రూపుఁడగు ఈ రుద్రుని గోవులు, బఱ్ఱెలు మున్నగు సకల ప్రాణులును చూచుచున్నవి. వేద శాస్త్రజ్ఞుల చేతను, వేదశాస్త్రములు తెలియని వారిచేతను, పశుపక్ష్యాదుల చేతను చూడ బడువాఁడైన రుద్రుఁడు మమ్ములను సుఖ వంతులనుగా చేయును గాక.

9వ మంత్రము.

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అధోయే అస్య సత్వానో உహంతేభ్యోకరం నమః.

తాత్పర్యము.
ఇంద్ర మూర్తి ధారణచే వేయి కన్నులవాఁడైన శివునకు నమస్కార మగును గాక.  ఫర్జన్య  రూప ధారియై, వృష్టి కర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతే కాదు. ఏవి ఈ రుద్రుని యొక్క భృత్య రూపములైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.

10వ మంత్రము.

ప్రముంచధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం
యాశ్చతే హస్త ఇషవః. పరాతా భగవోవప.

ఓ భగవంతుఁడా! నీవు పూజా వంతుఁడవు. మహదైశ్వర్య  సంపన్నుఁడవు. ఓ రుద్రా! నీవు నీ ధనుస్సున రెండు చివరలకు కట్టిన త్రాటిని విడువుము. విప్పివేయుము. నీ చేతనున్న బాణములను విడిచిపెట్టుము. మాపై విడువకు తండ్రీ!

11వ మంత్రము.
అవతత్యధనుస్త్వగ్  సహస్రాక్ష శతేషుధే.
నిశీర్య శల్యానాంముఖా శివోనస్సుమనాభవ
.

ఇంద్ర రూపుఁడవైన ఓ రుద్రుఁడా! వందల కొలదీ అమ్ములపొదులు కలవాఁడా! ధనుస్సును దించి, బాణముల యొక్క ముఖములను అంప పొదులలో నుంచి, మా పట్ల అనుగ్రహ యుక్తుఁడవై శాంతుఁడవు  కమ్ము.

12వ మంత్రము.

విజ్యంధనుఃకపర్దినో  విశల్యోబాణవాగ్ ం ఉత
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః.

జటాజూటము గల శివుని యొక్క ధనుస్సు విగతమైన వింటి త్రాడు కలది యగు గాక. అంతే కాదు. నీ యొక్క బాణములు గల అంప పొది బాణములు లేనిది అగు గాక. ఈ రుద్రుని యొక్క బాణములు అంప పొదిలో నుండుటచే చంపుట కసమర్ధములు అగుగాక. ఈ రుద్రుని యొక్క అంప పొది బాణ వహన మనెడి చిన్న పని చేయుటకు మాత్రమే సమర్ధము అగు గాక. కత్తులు దాచు ఒర కత్తులు మోయుటకు మాత్రమే సమర్ధమగు గాక.

13వ మంత్రము.

యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవతే ధనుః
తయాస్మాన్ విశ్వతస్త్వమ యక్ష్మయా పరిబ్భుజ.

అందరి కోరికలను అధికముగా తీర్చే ఓ శివుఁడా! ఏ నీ ఆయుధము ఖడ్గాది రూపమున కలదో, నీ యొక్క చేతియందు ఏ ధనుస్సు కలదో, నీవు ఉపద్రవములు కావింపని ఆ ఆయుధముచే, ఆ ధనుస్సుచే, మమ్ములను అంతటను అన్ని విధములా పరిపాలింపుము.

14వ మంత్రము.

నమస్తే అస్త్యాయుథా యా உనాతతా యధృష్ణవే
ఉభాభ్యాముతతేనమో బాహుభ్యాం తవ ధన్వనే.

ఓ రుద్రుఁడా! ధనుస్సున బంధింప బడని కారణమున ప్రసరింపఁ జేయఁ బడినట్టియు, స్వరూపము చేతనే చంప సమర్ధమైనట్టి నీ యొక్క ఆయుధమునకు నమస్కార మగు గాక. అంతే కాదు నీయొక్క రెండు భుజములకు నమస్కారము అగు గాక. నీ యొక్క ధనుస్సునకు నమస్కార మగు గాక.

15వ మంత్రము.

పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః.
అధోయ ఇషుధిస్తవా உஉరే అస్మన్నిధేహితం.

ఓ శివుఁడా! నీధనుస్సునకు బాణాది రూపమైన ఆయుధము మమ్ములను అన్ని విధముల విడుచును గాక. అంతే కాదు. నీ యొక్క ఏ అంప పొది కలదో దానిని మా కంటె దూరముగా ఉంచుము.
అనువాకము 1 సమాప్తము.

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయశ్రీమన్మహా దేవాయ నమః.
భగవంతుఁడైన విశ్వేశ్వరునకు, మహా దేవునకు, త్ర్యంబకునకు, త్రిపురాంతకునకు, కాలాగ్ని యైన రుద్రునకు, నీల కంఠునకు, మృత్యుంజయునకు, సర్వేశ్వరునకు, సదా శివునకు, శ్రీమన్మహాదేవునకు నమస్కారము.

అనువాకము 2.

యజుస్సు 1.  (13పదములు కల వచనరూప మంత్రమునే యజుస్సు అంటారు)

నమో హిరణ్య బాహవే సేనాన్యేదిశాంచపతయే నమః.

బంగారు నగలు గల బాహువు లందుఁ గల యట్టియు, యుద్ధ రంగమున సేనను జేర్చు సేనానాయకుడగునట్టియు,  దిక్కులను పాలించునట్టి వాడును  రుద్రునకు నమస్కారము.

యజుస్సు 2.

నమో వృక్షేభ్యో హరి కేశేభ్యః పశూనాంపతయేనమః.
హరిత వర్ణమైన కేశములు పర్ణ రూపమునఁ గల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము అగు గాక. పశువులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక.

యజుస్సు 3.

నమస్సస్పింజరాయత్విషీమతే పథీనాంపతయేనమః.

సస్పి(లేత గడ్డి)వలె పసుపు, ఎఱుపు, రంగుల కలయిక గల మహా దేవునకు నమస్కార మగు గాక. కాంతి గల రుద్రునకు నమస్కార మగును గాక. శాస్త్రము లందు చెప్ప బడిన దక్షిణోత్తర తృతీయ మార్గములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 4.

నమో బభ్లుశాయ  వివ్యాధినే உ న్నానాంపతయేనమః.

వాహనమైన ఎద్దుపై కూర్చుండు నట్టియు, శత్రువులను విశేషముగ పీడించు శివునకు నమస్కార మగును గాక. అన్నములైన ఓషధులను పాలించు ప్రభువగు రుద్రునకు నమస్కారము.

యజుస్సు 5.

నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపతయేనమః.

నల్లని జుత్తు గల, మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతము గల రుద్రునకు నమస్కారము. పరిపూర్ణ గుణులైన పురుషులకు స్వామియైన రుద్రునకు నమస్కార మగును గాక.

యజుస్సు 6.

నమో భవస్య హేత్యై జగతాంపతయేనమః.

సంసార భేదకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక. లోకములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కారమగును గాక.


యజుస్సు 7.

నమోరుద్రాయా  உஉతతావినేక్షేత్రాణాంపతయేనమః.

విస్తరింప బడిన ధనుస్సులతో రక్షించునట్టి రుద్రునకు నమస్కార మగు గాక. క్షేత్రములకు (శరీరములకు-పుణ్యక్షేత్రములకు) పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు  8.

నమస్సూతాయాஉహంత్యా య వనానాంపతయేనమః.

సారథి యైనట్టియు, శత్రువులను సంహరింప శక్యుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక. అరణ్యములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 9.

నమోరోహితాయస్థపతయేవృక్షాణాం పతయే నమః.

లోహిత వర్ణుఁ డైనట్టియు, ప్రభు వైనట్టి రుద్రునకు నమస్కారము. చెట్లకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.

యజుస్సు 10.

నమో మంత్రిణే  వాణిజాయకక్షాణాంపతయేనమః.

రాజ సభలో మంత్రాలోచన కుశలుఁ డైనట్టియు, మంత్రి రూపమున వణిజులకు స్వామి యైనట్టి రుద్రునకు నమస్కారము. వనము లందలి గుల్మ లతాదులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.

యజుస్సు 11.

నమో భువంతయే వారివస్కృతా,యౌషాధీనాం పతయే నమః.

భూమిని విస్తరింప జేయు రుద్రునకు నమస్కార మగుఁ గాక. ధనము చేకూర్చునట్టి (సేవచేయుభక్తులకుచెందినట్టి) రుద్రునకు నమస్కార మగుఁ గాక. ఓషధులకు ప్రభువగు రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 12.

నమ ఉచ్చైర్ఘోషాయా క్రందయతే పత్తీనాంపతయేనమః.

యుద్ధ సమయమున మహోన్నత ధ్వనిగా కల శివునకు నమస్కారము. శత్రువుల నేడిపించు శివునకు నమస్కార మగు గాక. పాదచారులైన యోధులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 13.

నమః కృత్స్నవీతాయధావతే సత్వనాంపతయేనమః.

చుట్టునూ ఆవరింపబడిన సకల సైన్యము గల రుద్రునకు నమస్కారము. పరుగులిడుచున్నశత్రుసైన్యముల వెనుకనేగు రుద్రునకు నమస్కారమగుగాక. సాత్వికులై శరణాగతులైనవారి పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుగాక.

అనువాకము 2 సమాప్తము.

అనువాకము 3.

యజుస్సు 1.

నమస్సహమానాయనివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః.

విరోధులను అభిభవించు (పరాభవించు) రుద్రునకు నమస్కారము
మిక్కిలి విరోధులను బాధించు రుద్రునకు నమస్కారము. అంతటను సంపూర్ణముగా బాధించు శూర సేనలకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 2.

నమః కకుభాయ నిషంగిణే స్తేనానాంపతయేనమః.   

కకుభ (అర్జునవృక్షము వలె ప్రథానుఁడైనట్టి) సదృశమైన, ఖడ్గము చేతఁ గల శివునకు నమస్కారము. గుప్త చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.

యజుస్సు 3.

నమోనిషంగిణ ఇషుధిమతే తస్కరాణాంపతయే నమః.

ధనుస్సును సంధించుటకు చేత బాణము కలిగినట్టియు, పృష్ఠ భాగమున కట్టఁ బడిన అమ్ముల పొది కలిగినట్టి శివునకు నమస్కారము. ప్రకట చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.

యజుస్సు 4.

నమో వంచతే పరి వంచతే స్తాయూనాంపతయే నమః.

యజమానికి ఆప్తుఁడై అతని క్రయ విక్రయాది వ్యవహారము లందు మెలగుచు, ఎచ్చట నైనను, ఏమాత్ర మైనను అతని ద్రవ్యమును అపహరించుట యనెడి వంచన మొనరించు వాని స్వరూపముతో నుండు శివునకు నమస్కారము. పైన చెప్పినట్లు యజమానిని బాగుగా మోసగించు శివునకు నమస్కారము. రాత్రి యందు పగటి యందు అన్యులకు తెలియనీయక యజమాని సొత్తు నపహరించు వారికి పాలకుఁడైన శివునకు నమస్కారము.

యజుస్సు 5.

నమోనిచేరవే పరిచరాయారణ్యానాంపతయేనమః.

నిరంతరము సంచార శీలము కలవాఁడు, బాగుగా సంచరించునట్టి శివునకు నమస్కారము. నిరంతరము అరణ్యమునందుండు వారి ప్రభువైనట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 6.

నమస్సృకావిభ్యో జిఘాగ్ ం సద్భ్యో ముష్ణతాంపతయేనమః.

వజ్రమును బోలిన స్వశరీరమును రక్షించువారు సృకావినులు. వజ్రము వంటి తమ శరీరము రక్షించు వారికి నమస్కారము. కృషికులై స్వామి ధాన్యము అపహరించు వారికి ప్రభువైన శివునకు నమస్కారము.

యజుస్సు 7.

నమో உసిమద్భ్యో నక్తంచరద్భ్యః   ప్రకృంతానాంపతయేనమః.

ఖడ్గము కల చోరులకు నమస్కారము. రాత్రి సంచరించువారై వీధులలో పోవు వారిని పీడించు చోరులకు నమస్కారము. కుత్తుకలు కత్తిరించి అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.

యజుస్సు 8.

నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమః.
శిరస్సును కాపాడు తలపాగా కలిగినట్టి పర్వతముల సంచరించు నట్టి శివునకు నమస్కారము. భూమిని అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.

యజుస్సు 9.

నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవోనమః.

బాణములు కలిగినట్టి మీకు నమస్కారము. ధనుస్సులు కలిగినట్టి మీకు నమస్కారము.

యజుస్సు 10.

నమ అతన్వానేభ్యః.ప్రతిదధానేభ్యశ్చవోనమః.

ధనుస్సున త్రాటిని ఆరోపించు మీకు నమస్కారము. ధనుస్సున బాణమును సంధించు మీకు నమస్కారము.

యజుస్సు 11.

నమ అయచ్ఛద్భ్యో  విసృజద్భ్యశ్చవోనమః.


వింటి త్రాటిని ఆకర్షించునట్టి మీకు నమస్కారము. ధనుస్సు నుండి బాణములను విడుచు నట్టి మీకు నమస్కారము.

యజుస్సు 12.

నమో உస్యద్భ్యో విధ్యద్బ్యశ్చవోనమః.

లక్ష్యము వరకు బాణము విడుచునట్టియు, లక్ష్యము నందు బాణము ప్రవేశ పెట్టు మీకు నమస్కారము.

యజుస్సు 13.

నమ ఆసీనేభ్యశ్శయానేభ్యశ్చవోనమః.

కూర్చుండునట్టియును, నిద్రించునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 14.
నమస్స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవోనమః.

నిద్రించునట్టి మీకు నమస్కారము. మీల్కొని యుండునట్టి మీకు నమస్కారము.

యజుస్సు 15.
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవోనమః.
నిశ్చలముగా నుండునట్టి మీకు నమస్కారము. పరుగెత్తునట్టి మీకు నమస్కారము.

యజుస్సు 16.
నమస్సభాభ్యస్సభాపతిభ్యశ్చవోనమః.
సంఘముగా నున్న వారికి నమస్కారము. సంఘముగా నున్నవారికి ప్రభు వగు మీకు నమస్కారము.

యజుస్సు 17.
నమో అశ్వేభ్యో உ శ్వపతిభ్యశ్చవోనమః.
అశ్వ విగ్రహులకు నమస్కారము.  తనదగు ధనము లేని వానికి నమస్కారము. ఎవరి నుండియు ఏమియును గ్రహింపకుండుటచే రేపటికవసరమగు ధనము లేనివారికి నమస్కారము. అశ్వాధ్యక్షులును మహాశ్రీ గల వారును అగు మీకు నమస్కారము.
అనువాకము 3 సమాప్తము.

అనువాకము 4.
యజుస్సు 1
.
నమ అవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చవోనమః.
సంపూర్ణముగా వేధించుటకు సమర్థులైన స్త్రీలకు నమస్కారము. విశేషముగా పీడించుటకు సమర్థులైన స్త్రీలగు మీకు నమస్కారము.

యజుస్సు 2.
నమ ఉగణాభ్యస్తృగ్ హతీభ్యశ్చవోనమః.
ఉత్కృష్ట గుణ రూపలైన సమస్త మాతృకలు మున్నగు స్త్రీలకు నమస్కారము. పరులను హింసించుటకు సమర్థులైన దుర్గ మున్నగు భయంకర దేవతలకు నమస్కారము.

యజుస్సు 3.
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవోనమః.
విషయాసక్తులకు నమస్కారము. విషయాసక్తులను రక్షించు మీకు నమస్కారము.

యజుస్సు 4.
నమోవ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవోనమః.
నానా జాతుల సంఘములకు నమస్కారము. సంఘాధిపతులైన మీకు నమస్కారము.

యజుస్సు 5.
నమో గణేభ్యో గణపతిభ్యశ్చవోనమః.
దేవానుచర గణములకు నమస్కారము. దేవానుచర గణములకు ప్రభువైన మీకు నమస్కారము.

యజుస్సు 6.
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవోనమః.
వికృత రూపులైన నగ్న ముండాదులకు నమస్కారము. తురంగ గజ వక్త్రాది నానా రూపములను దాల్చు భృత్యులును అగు మీకు నమస్కారము.

యజుస్సు 7.
నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవోనమః.
అణిమా ద్యష్టైశ్వర్యములతో కూడుకొన్నవారికి నమస్కరము. అష్టైశ్వర్యములు లేని మీకు నమస్కారము.

యజుస్సు 8.
నమో రథిభ్యో உరథేభ్యశ్చవోనమః.
శరీర రథము నధిష్టించిన పరమాత్మకును, రథులైన యోధులకును, జీవులకును నమస్కారము.  రథము లేని సామాన్య జీవులకును, శరీర రథము లేని అప్రాణులున్నగు మీకును నమస్కారము.

యజుస్సు 9.
నమోరథేభ్యో రథపతిభ్యశ్చవోనమః.
రథ రూపులకు నమస్కారము. రథములకు ప్రభువులైనట్టి మీకు నమస్కారము.

యజుస్సు 10.
నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చవోనమః.
రథ గజ తురగ పదాతి రూప సేనలకు నమస్కారము. సేనా నాయకులైనట్టి మీకు నమస్కారము.

యజుస్సు 11.
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చవోనమః.
రథ శిక్షకులును, రథములను గ్రహించు సారథులును అగు మీకు నమస్కారము.

యజుస్సు 12.
నమస్తక్షభ్యోరథకారేభ్యశ్చవోనమః.
దేవాధిష్టానులైన శిల్పి విశేషులకు నమస్కారము.  చక్కగా రథములను నిర్మించు శిల్పులగు మీకు నమస్కారము.

యజుస్సు 13.
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవోనమః.
కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము.

యజుస్సు 14.
నమః పుంజష్టేభ్యో నిషాదేభ్యశ్చవోనమః.
పక్షి పుంజములను సంహరించు వారికి నమస్కారము. మత్స్య ఘాతుకులైనట్టి మీకు నమస్కారము.

యజుస్సు 15.
నమ ఇషుకృద్భ్యో  ధన్వకృద్భ్యశ్చవోనమః.
చక్కని శరీరములను చేయునట్టి మీకు నమస్కారము. చక్కని ధనుస్సులను చేయునట్టి మీకు నమస్కారము.

యజుస్సు 16.
నమోమృగయుభ్యశ్శ్వనిభ్యశ్చవోనమః.
మృగములను చంపెడి వ్యాధులకు నమస్కారము. కుక్కల మెడలయందు గట్టబడిన పాశములను దాల్చెడి మీకు నమస్కారము.
యజుస్సు 17.
నమశ్శ్వభ్యశ్శ్వపతిభ్యశ్చవోనమః.
శ్వాన రూపధారులకు నమస్కారము. శునక స్వాములైన మీకు నమస్కారము.
అనువాకము 4 సమాప్తము.

 

కంటిన్యూ పార్ట్ - 2 ....