రేగుల గౌరీ నోము (Regula Gouree Nomu)

 

రేగుల గౌరీ నోము

(Regula Gouree Nomu)

 


పూర్వం ఒక రాణికి సంతానం లేక ఎన్నెన్నో నోములూ, వ్రతాలూ ఆచరించినా ఫలితం లేకపోయింది. పిల్లల ప్రసక్తి వచ్చినప్పుడల్లా "ఎన్ని నోములూ నోచినా ఆదినారాయణుడికి దయ లేదు" అంటూండేది. ఆ మాట వినీ వినీ విష్ణుమూర్తికి విసుగొచ్చి, ఒకనాటి రాత్రి కలలో కనుపించి "ఓ మాహారాణీ! నువ్వు రేగుల గౌరీ నోము పట్టి, ఉల్లంఘించడం వల్ల సంతానం కలగకపోగా నన్నుఆడిపోసుకోవడం పాపం! వెంటనే ఆ నోముని మళ్ళీ పట్టి, విధి విధానంగా చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పాడు.

మహారాణి వెంటనే మెలకువ వచ్చింది. తన తప్పిందం తెలుసుకున్నదై మర్నాడే మాహారాజుకా సంగతి చెప్పి, అనుమతి పొంది, ఆ నోము పట్టి, లోపాలు లేకుండా పూర్తి చేయగా... ఉద్యాపన జరిగిన సంవత్సరంలోనే, ఆమె గర్భవతియై పండంటి పుత్రుణ్ణి పొందింది.

విధానం

ఒక మంచి రోజు ఓ సద్బ్రాహ్మణునికి తొమ్మిది గిద్దల రేగిపండ్లు, క్రొత్త పంచ, దక్షిణ తాంబూలాలతో సమర్పించి అది మొదలు ఒక సంవత్సరం పాటు ప్రతీరోజూ పై కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటూ వుండాలి. తదుపరి ఉద్యాపనం.

ఉద్యాపనం

ఒక సరికొత్త వెదురు గంపలో, తొమ్మిది తవ్వల రేగిపండ్లు పోసి, వాటిలో తొమ్మిది ప్రమాణాల (యధా శక్తి) బంగారవు రేగి పండు వేసి, ఆపైన కొత్త పంచలచావు తాంబూలం, దక్షిణ వుంచి ఒక పేదవాడికి దాన మివ్వాలి.