Prema Pandem – Part 3

 

చప్పట్లు ఆగిన తరువాత నాలుగు క్షణాల నిశ్శబ్దం. తరువాత కవిసింహం గొంతు మైకులో ఖంగున మోగింది. “ఆకలి కడుపుల్లో నకనకలు …. నా గుండెల్లో ఆలోచనల లుకలుకలు.. ఆగాడు కవిసింహం. హాల్లోని కొందరు ఆహా.. ఒహో.. అన్నారు. స్టేజి మీద కవులందరూ బుర్రకాయలు వూపి “బాగుంది.. బాగుంది..” అన్నారు. కవిసింహం తృప్తిగా నవ్వి.. తన కవితాగానం సాగించాడు. “ఆకలి కడుపుల్లో నకనకలు.. నా గుండెల్లో ఆలోచనల లుకలుకలు.. కడుపు నిండిన వారి పకపకలు.. చెరువులో కప్పల బెకబెకలు..” రాంబాబు పక్కనున్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. స్టేజి మీద ఉన్న వాళ్ళు మళ్ళి బుర్రకాయలు ఊపారు. “ఆకలి.. ఆకలి.. ఆకలి.. ప్రభుత్వం చూపిస్తుంది మింగమని రోకలి.” పిడికిళ్ళు బిగించి ఆవేశంగా అన్నాడు కవిసింహం.

కిసుక్కున నవ్వాడు రాంబాబు. “కవిసింహం గారికి ఆకలి వేస్తునట్టు ఉంది… ఆయన కవిత్వం నిండా ఆకలే..” నవ్వుతూ పక్కనున్నాయనతో అన్నాడు రాంబాబు. పక్కనాయన నవ్వలేదు సరికదా రాంబాబు వంక సీరియస్ గా చూశాడు. తను వేసిన జోక్ అతను వినలేదని అనుకున్నాడు రాంబాబు.అందుకే రిపీట్ చేశాడు. “పాపం కవిసింహం గాడికి (ఇందాక గారు అన్నవాడు కాస్తా ఈ సారి గాడు అన్నాడు) బాగా ఆకలేస్తున్నట్టుందీ ఆకలాట ఆకలి..హి ఆకలి…” అయినా రాంబాబు పక్కనున్న అతను నవ్వలేదు. అంతేకాదు.. రాంబాబు వంక సీరియస్ గా చూస్తూ ప్రశ్నించాడు. “అతను ఎవరని అనుకుంటున్నావ్?” “ఆయనా కవిసింహం! అలానే కదూ ఎనౌన్స్ చేసింది?” అయోమయంగా చూస్తూ అన్నాడు రాంబాబు. “ఆయన కవిసింహమే! ఆయనకు మేము ఏమవుతామో తెలుసా?” రెట్టించి అడిగాడు అతను.

రాంబాబు గతుక్కుమన్నాడు “నేను కవిసింహం తమ్ముడిని.. ఆయన అన్నయ్య, ఆ అబ్బాయి కొడుకు.. ఆవిడేమో కవిసింహం భార్య.. అంటే నాకు వదిన , ఆ పక్కన ఉన్నది ఆవిడ గారి చెల్లెలు” మొహం చిట్లించి చెప్పాడు అతను. “ఓ … గ్లాడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ” ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు రాంబాబు. వాళ్ళెం మాట్లాడలేదు. చాలా బాగా రాస్తారు కవిసింహం గారు ” మళ్ళీ తనే అన్నాడు ప్లేజ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు అతని కామెంట్ కి సంతోషించలేదు పై పెచ్చు రాంబాబుని చురచురా చూశారు. ఇంకా తను మాట్లాడకుండా ఉండడమే ఉత్తమమని నోర్మూస్కున్నాడు రాంబాబు. కానీ అక్కడ కూర్చుని వుంటే అతనికి ముళ్ళమీద కూర్చున్నట్టు వుంది. క్షనానికోసారి వాళ్ళు పక్కకి తిరిగి రాంబాబు వంక కోపంగా చూడసాగారు. ఇంకా అక్కడుంటే లాభం లేదని రాంబాబు మెల్లిగా లేచి రెండు వరసల వెనకాల ఓ మూల కూర్చున్నాడు.

కవి సింహం కవిత ముగించి తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడు. వ్యాఖ్యాత మళ్ళీ మైకు పీక పట్టుకుని గొంతు సవరించుకుని తర్వాత రెండుసార్లు దగ్గి గొంతు విప్పాడు. “ఇప్పడు ప్రముఖ కవి “అగ్గిబరాటా” తన విప్లవ కవితను మీ ఎదలు వేడెక్కేలా వినిపిస్తారు” ఆటను పక్కకి తప్పుకున్నాడు. విప్లవ కవి “అగ్గిబరాటా” తన కవితను ఆవేశంగా చావడం మొదలుపెట్టాడు. “చంపేస్తా.. నరికేస్తా… పోదిచేస్తా… ఎవడ్రా వాడు అందర్నీ దోచేస్తున్నాడు? ఎవడ్రా వీడు అంతా మింగేస్తున్నాడు…” అగ్గిబరాటా ఓ క్షణం ఆగి ప్రేక్షకుల వంక చూశాడు. ఆటను అలా ఎందుకు అగాడో… ఎందుకు తమ వైపు చూస్తున్నాడో ప్రేక్షకులకి అర్థం అయ్యింది. టపాటపా చప్పట్లు కొట్టారు. అగ్గిబరాటా వెనక్కి తిరిగి మిగతా కవులవంక చూశాడు. వాళ్ళంతా “బాగుంది… బాగుంది…” అంటూ బుర్రకాయలు వూపారు. “ఈ కవులందరూ అగ్రిమెంట్ కుడుర్చుకున్నారనుకుంటా… ఒకరు చదివితే మిగతా వాళ్ళంతా బాగుంది.. బాగుంది… అంటూ బుర్రకాయలు వూపాలని!” రాంబాబు కిసుక్కున నవ్వాడు. రాంబాబు ముందు వరసలో వున్నవాళ్ళు వెనక్కి తిరిగి కోపంగా చూశారు.