ప్రదక్షిణ ఎందుకు!
ప్రదక్షిణ ఎందుకు!
ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకు ప్రదక్షిణ చేసే ఆచారం ఒకటి ఉంది. ఇతర మతాలలో కాస్త అరుదుగా కనిపించే ఈ ఆచారానికి హిందూ ధర్మంలో మాత్రం అధికమైన ప్రాధాన్యతే ఉంది. ప్రదక్షిణ లేకుండా గుడి లోపలికి ప్రవేశిస్తే మనసులో ఏదో వెలితి కలిగేంతటి ప్రాముఖ్యత ఉంది. ఇంతకీ ఈ ప్రదక్షిణ వెనుకనున్న ఆంతర్యం...
- మనకంటే పెద్దవారు, మహాత్ములు కనిపించినప్పుడు నమస్కారం చేయడం ఒక ఎత్తైతే.. వారి గౌరవార్థం ప్రదక్షిణ చేయడం ఒక ఎత్తు. భగవంతుని కూడా మనం గురువుగా, మహాత్మునిగా ఆరాధాస్తాం కనుక ఆయన ఆశీస్సులను కోరుతూ ప్రదక్షిణను సాగిస్తాము. ఈ సూక్ష్మాన్ని తెలిసినవాడు కాబట్టే వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూనే ప్రదక్షిణాలు చేసి ముల్లోకాలనూ దర్శించినంత భాగ్యాన్ని పొందాడు.
- గుడి లోపలికి ప్రవేశించిన మనిషి రకరకాల ఆలోచనలతో ఉంటాడు. లౌకిక వ్యవహారాలు ఇంకా అతని మనసుని ఆక్రమించుకునే ఉంటాయి. అలాంటి మనిషి నేరుగా గర్భగుడిలోకి అడుగుపెట్టేసి భగవంతుని దర్శించుకుంటే అది యాంత్రికంగా సాగిపోతుంది. అందుకని భగవంతుని సన్నిధిలోకి చేరేందుకు అవసరమయ్యే భక్తి భావనలను ప్రేరేపించేందుకు ప్రదక్షిణల సమయం ఉపయోగపడుతుంది.
- మనిషి వలయాకారంలో నడిచేటప్పుడు అతని ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. అలాంటి సమయంలోనే లౌకికమైన విషయాలను పక్కనపెట్టి భగవన్నామాన్ని స్మరిస్తూ సాగితే... మనసు ప్రశాంతతను సాధిస్తుంది.
- ధార్మిక జీవనంలో భగవంతుడే కేంద్ర బిందువు. ఆయన చుట్టూ తిరగడం అంటే... ‘మేము నిన్ను ఆశ్రయించుకునే ఉన్నాము’ అన్న సందేశాన్ని భౌతికంగా అందించడమే!
- ప్రదక్షిణ అంటేనే దైవాన్ని గౌరవించడం. అందుకనే దైవం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేని పూజాదికాల వంటి సందర్భంలో ‘ఆత్మ ప్రదక్షిణ’ చేసుకోమని చెబుతుంటారు పెద్దలు. ఎందుకంటే మనలోనూ దైవం ఉందన్నది ఒక నమ్మకం కదా!
- ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపునే ఉండాలి. కుడి శుభానికీ, రుజువర్తనకీ, స్వచ్ఛతకూ ప్రతీక. పైగా ప్రదక్షిణ చేసేందుకు కూడా సులువు.
- ఏదో క్రతువులాగా ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్లిపోయేవారే కాదు... తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేందుకు, కోరికలను ఈడేర్చుకునేందుకు ప్రదక్షిణను కూడా ఒక మార్గంగా భావించేవారూ ఉంటారు. కొందరు సహస్రనామాలు చదువుకుంటూ ముందుకుసాగితే మరికొందరు స్థిరచిత్తంతో పదుల కొద్దీ ప్రదక్షిణలు చేస్తారు.కొందరు పాద ప్రదక్షిణతో ముగిస్తే మరికొందరు పొర్లుదండాలు సాగిస్తారు.
- ప్రదక్షిణ మనసుకే కాదు, శరీరానికి కూడా వ్యాయామమే! నడకను మించిన ఆరోగ్యదాయకమైన వ్యాయామం మరేముంటుంది? శరీరం అలసినప్పుడు మనసూ కుదుటపడుతుంది. అందుకే డిప్రెషన్‌తో కుంగిపోయేవారిని ఏదో ఒక వ్యాయామం చేయమని సూచిస్తూ ఉంటారు పెద్దలు. అంటే ప్రదక్షిణతో అటు పుణ్యమూ ఇటు పురుషార్థమూ ఏకకాలంలో సాధ్యమవుతాయన్నమాట!
- నిర్జర.