పదహారు కుడుముల తద్ది (Padahaaru Kudumula taddi)

 

పదహారు కుడుముల తద్ది

(Padahaaru Kudumula taddi)

 

ఐశ్వర్యం కోసం ఈ నోము నోచుకుంటారు.

విధానం

ప్రతీ సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి) నాడు తలస్నానం చేసి, 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు, పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ, రవిక ఉంచి, పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది.

ఉద్యాపనం

పదహారు సంవత్సరాలు పై విధంగా చేసి, పదహారవ సంవత్సరం 116 మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. అయితే దీనిని చాలామంది అనుసరించడం లేదు. కేవలం ఒక సంవత్సరం చేసే నోముగా ఉంది.

కథ

పార్వతీ పరమేశ్వరలు ఒకసారి భూలోక సంచారం చేస్తుండగా, అడవిలో ఒక రాచకన్య కనిపించింది. ఆ కన్య తల్లిదండ్రులు రాజ్యాన్ని కోల్పోయి అడవులు పట్టారని తెలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు. వారి ఐశ్వర్యం వారికి తిరిగి రప్పించాలను కుని ఆ రాచకన్య వద్దకు వెళ్లి ఒక నోము చెప్పారు. అదే పదహారు కుడుముల తద్ది. ఆ నోము నోచుకుంటే కష్టాలు తొలగుతాయని చెప్పి అదృశ్యమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. ఆ నోము నోచిన రాచకన్యకు కష్టాలు తొలగినాయి. అప్పటినుంచి ఆమె ఆ నోము ప్రతి సంవత్సరం నోయగా, క్రమంగా వ్యాప్తిలోకి వచ్చింది.