నవావతార ఆంజనేయ క్షేత్రం-ఒంగోలు

 

నవావతార ఆంజనేయ క్షేత్రం-ఒంగోలు

 

ప్రకాశంజిల్లా,ఒంగోలులోని ముంగమూరు రోడ్డులో శ్రీ పంచముఖ ఆంజనేయ దేవస్థానం ఉంది. ఈ ఆలయంలో నవావతారా ఆంజనేయ విగ్రహాలను తీర్చిదిద్దారు. మనదేశంలో ఆంజనేయస్వామి వారిని  తొమ్మిది అవతారాలలో ప్రతిష్టించిన క్షేత్రం ఇది ఒక్కటేనని చెబుతారు. ఆంజనేయ భక్తులు తమ విరాళాలతో 1983వ సంవత్సరం హనుమాన్ జయంతినాడు ఈ ఆలయ నిర్మాణానికి పనులు ప్రారంభించి, 1984వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన శంకుస్థాపన చేసి త్వరగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

 ఆలయ ముందు భాగంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దేవాలయ ముఖమంటపంపై అష్టలక్షముల మూర్తులు ఉంటాయి. గర్భాలయంలో నల్లరాతితో మలచిన 10 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం సర్వాలంకారభూషితంగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.అయిదు ముఖాలు ,పది బాహువుల , తిరునామం , మీసకట్టుతో గధను ధరించి ఉన్న స్వామి విగ్రహం భక్తులకి దర్శనమిస్తుంది. వానర, నారసింహ , గారుత్మంత, వరాహ, హాయగ్రీవ ముఖాలతో స్వామి అలరారు తుంటాడు.స్వామివారికి ఎడమవైపున సువర్చలదేవి ప్రతిమ ఉంటుంది. కుడివైపు స్వామివారికి  ఉత్సవమూర్తి  ఉంటుంది. నవావిధారుపాలతో ఆంజనేయస్వామి ఇక్కడ  విరాజిల్లుతున్నప్పటికి  ఇక్కడ ప్రధాన స్వరూపం పంచముఖ ఆంజనేయస్వామి. ప్రధాన అర్చవతారమూర్తిగా పంచముఖ ఆంజనేయస్వామి భక్తులు సేవించుకుంటారు. పంచముఖ  ఆంజనేయ స్వామి ఆలయంతో పాటూ నవావిధ ఆంజనేయ మందిరాలు వరుస క్రమంలో ఉంటాయి. పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించిన భక్తులు  ముందు నవవిధ ఆంజనేయ మందిరాలలో మొదటిదైన ప్రసన్నాంజనేయ స్వామి మందిరాన్ని దర్శించుకుంటారు. ప్రసన్నవాదానంతో, అభయహస్తంతో, గదనుధరించి , సుందరరూపంతో ఆంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ తర్వాత వీరంజనేయస్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఎడమభుజాన గదను ధరించి, మరోచేతిని నడుముమీద వేసుకొని  ఉన్న స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ తర్వాత వింశితిభుజ హనుమంతుడ్ని  దర్శించుకుంటారు.  ఇరవై చేతులు ఉన్న ఈ స్వామి ఇరవై చేతులలోనూ ఆయుధాలతో దర్శనమిస్తాడు. ఈ స్వామిని బ్రమహ్మదేవుడు ఉపాసించి అనేక వరాలు పొందాడని ప్రతీతి. తర్వాత అష్టాదశ భుజ మారుతిని భక్తులు దర్శించుకుంటారు. 18 చేతులలో ప్రతి చేతిలోనూ  ఆయుధాలను ధరించి విశ్వరూపదారిగా స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. దుర్వాస మహర్షి ఈ స్వామిని కొలిచి సిద్ధిపొందాడని చెబుటారు. తర్వాత సువర్చలాసమేత  ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఎడమ తొడపై  సువర్చలాదేవిని కూర్చుండపెట్టుకొని అభయముద్రాంకితుడై దర్శనమిస్తాడు. తర్వాత  ద్వాత్రింశద్బుజ మారుతి  భక్తులకు దర్శనమిస్తాడు. 32 చేతులతో ప్రతిచేతిలోనూ ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. చివరిగ వానరాంకుర ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఇది స్వామి సహజరూపం. ఈ స్వామి ఆరాధానం సర్వశుభకారంగా భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్రంలో అనేక ఉపమందిరాలు కలవు. గాయాత్రిదేవి మందిరం, రాఘవేంద్రస్వామి సన్నిధి,శ్రీ సీతారాముల మందిరం ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యపూజాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.

ఈ ఆలయంలో ప్రతినిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో ప్రతినిత్యం నిత్యపూజలతో  పాటూ, ప్రతి మంగళ, శనివారాలలో విశేషపూజలు, స్వామి వారి జన్మనక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రంనాడు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి,వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

 ◆వెంకటేష్ పువ్వాడ