ఊబకాయంతో స్త్రీలకు క్యాన్సర్
ఊబకాయంతో స్త్రీలకు క్యాన్సర్
అధికబరువు చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్న విషయం కొత్తేమీ కాదు. అయితే ఇది ఏకంగా క్యాన్సర్‌కే దారితీస్తుందని తేల్చిన ఓ పరిశోధన ఇప్పుడు కలవరాన్ని రేపుతోంది. కాస్త బరువే కదా అని అశ్రద్ధ చేసేందుకు వీల్లేని పరిస్థితి కల్పిస్తోంది.
భారీ పరిశోధన
క్యాన్సర్‌కు ఊబకాయానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు అమెరికాలో ఒక భారీ పరిశోధనను చేపట్టారు. ఇందులో భాగంగా 50 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 74000 మహిళల జీవితాలను గమనించారు. వీరంతా 18, 35, 50 ఏళ్ల వయసులో ఎంత బరువు ఉండేవారో కనుక్కొన్నారు. ఫలితం! పదేళ్లపాటు ఊబకాయంతో బాధపడే స్త్రీలు క్యాన్సర్ బారిన పడేందుకు పదిశాతం ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు తేలింది.
నాలుగు రకాల క్యాన్సర్లు
ఈ 74 వేలమంది స్త్రీలను 12 ఏళ్లపాటు గమనించిన తరువాత వారిలో ఏకంగా 6,300 మంది ఏదో ఒక క్యాన్సర్ బారిన పడటాన్ని గమనించారు. వీటిలో గర్భాశయం, వక్షోజం, పేగు, మూత్రపిండాలకు సంబంధించన క్యాన్సర్ అధికంగా కనిపించింది. పైగా ఊబకాయం తగ్గకపోతే కనుక ఇలా క్యాన్సర్ వచ్చే అవకాశం ప్రతి పదేళ్లకీ మరో ఏడు శాతం పెరగడాన్నీ గమనించారు.
కారణం లేకపోలేదు
ఊబకాయం అంటేనే మన జీవనశైలి అస్తవ్యస్తంగా ఉందని చెప్పే సూచన. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే చిరుతిండి, తగినంత వ్యాయామం లేకపోవడం, నిరంతరం కదలకుండా కూర్చుని ఉండటం వంటి అలవాట్లతో ఊబకాయం ఎలాగూ తప్పదు. దీనికి తోడు ఒంట్లో పేరుకునే అధిక కొవ్వు ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లను దెబ్బతీస్తుందట. హార్మోన్లలో ఏర్పడిన ఈ అసంతులత స్త్రీలలో కలిగే వక్షోజ, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. పైగా ఊబకాయంతో శరీరంలో రక్తనాళాలు ఉబ్బిపోతాయి. Inflammationగా పేర్కొనే ఈ పరిస్థితి కూడా క్యాన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని ఊహిస్తున్నారు.
జాగ్రత్త అవసరం
అమెరికా వంటి దేశాలలో పదింట ఏడుగురు మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అనుకుంటే పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకనే చిన్నవయసు నుంచే ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. శరీరం ఎప్పటికప్పుడు తగినంత బరువులో ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల క్యాన్సర్ మాట అటుంచితే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు సైతం దరిచేరకపోవచ్చునని భరోసా ఇస్తున్నారు.
- నిర్జర.