నవరాత్రుల మూడవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి.. కలిగే ఫలితాలేంటి...

 

నవరాత్రుల మూడవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి? కలిగే ఫలితాలేంటి...

దేవినవరాత్రులలో మూడవరోజు  అమ్మవారి రూపం చాలాప్రత్యేకం. మంగళవారం 17 అక్టోబర్ 2023న దుర్గా దేవి  చంద్రఘంట దేవి రూపంలో దర్శనమిస్తుంది. చంద్రఘంటా దేవి రూపం చాలా ప్రశాంతమైనది.  అమ్మవారు పులిపై స్వారీ చేస్తూ దర్శనమిస్తుంది. అమ్మవారి  శరీరం బంగారంలా ప్రకాశవంతంగా ఉంటుంది. అమ్మ నుదిటిపై గంట ఆకారంలో చంద్రుడు ఉంటాడు.  అందుకే ఈ అమ్మను  చంద్రఘంట అని పిలుస్తారు. 10 చేతులతో ఉన్న అమ్మవారికి ఒక్కొక్క చేతిలో వివిధ ఆయుధాలు ధరించి ఉంటుంది. తెల్లని పూల దండ అమ్మవారి మెడలో ఉంటుంది.  యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా అమ్మవారి భంగిమ ఉంటుంది.నిరంకుశ రాక్షసులు, దుష్టశక్తులు   అమ్మవారి భయంకరమైన గంట  శబ్దంతో ఎల్లప్పుడూ వణుకుతూ ఉంటారు. దుష్టులను అణచివేయడానికి వారిని నాశనం చేయడానికి సిద్దంగా ఉన్న రూపమే అయినా చూపరులకు మాత్రం ఈ అమ్మ  సౌమ్యత,  శాంతితో కనిపిస్తుంది. అందువల్ల ఈ అమ్మ తన భక్తులపై తొందరగా కరుణ చూపిస్తుంది.  ఇక అమ్మవారి వాహనం సింహం. అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధించేవారు కూడా  సింహంలా ధైర్యవంతులుగా,  నిర్భయుడు మారతారు.   కష్టకాలంలో ఈ అమ్మను ధ్యానించిన వెంటనే వారి రక్షణ కోసం అమ్మవారి గంట శబ్దం మోగడం ప్రారంభిస్తుందని చెబుతారు.


చంద్రఘంటాదేవిని పూజించడం ద్వారా  దీర్ఘాయువు, ఆరోగ్యం, ఆనందం,  ఐశ్వర్యానికి నోచుకుంటారు.  చంద్రఘంటాదేవి  అనుగ్రహంతో సాధకుని పాపాలు, అడ్డంకులు అన్నీ నశిస్తాయి. భక్తునిలో శౌర్యం, నిర్భయతతో పాటు సౌమ్యత, వినయం కూడా పెంపొందడం అమ్మవారి  ఆరాధన వల్ల లభించే గొప్ప అదృష్టం. ఈ అమ్మను పూజించేవారి ముఖంలోనూ, కళ్లలోనూ కాంతి పెరుగుతుంది. వీరు మాట్లాడే మాటలు దైవిక స్వరంతో కూడి  మాధుర్యంతో నిండి ఉంటుంది. కోపము, చిన్న చిన్న విషయాలకు చలించడం,  ఒత్తిడి, వేడి స్వభావం  ఉన్నవారు చంద్రఘంటాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

పూజ ఎలాగంటే..

చంద్రఘంటాదేవికి  స్వచ్ఛమైన నీటితో,  పంచామృతంతో స్నానం చేయించాలి. వివిధ రకాల పూలు, అక్షతలు, కుంకుమ, సింధూరాన్ని అమ్మవారికి సమర్పించాలి. కుంకుమపువ్వు,  పాలతో చేసిన స్వీట్లు లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.   అమ్మవారికి తెల్ల తామర, ఎర్ర మందార, గులాబీల దండను సమర్పించి మంత్రాన్ని జపించాలి.  

“యా దేవీ సర్వభూతేషు మా చంద్రఘంటా రూపన్ సంస్థితా నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై."

అమ్మవారి బీజ మంత్రం జపించినా చాలా మంచిది. బీజమంత్రం..  "ఐం శ్రీం శక్తి నమః ।"

                         *నిశ్శబ్ద.