నామకరణ సంస్కారం
నామకరణ సంస్కారం
“నామాఖిలస్య వ్యవహార హేతుః
శుభావహం కర్మసు భాగ్య హేతుః
నామ్నేవ కీర్తిః లభతే మనుష్య
స్తతః ప్రశస్తం ఖలు నామ కర్మ”
అని వీరమిత్రోదయ సంస్కార ప్రకాశికలో బృహస్పతి పేర్కొనటం జరిగింది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించటానికి పేరే కారణ మవుతుంది. తనదైన ప్రత్యేక నామం లేక సంజ్ఞ లేక పేరు లేక పోతే సమాజంలో వ్యవహరించటం కష్టం. పేరు వ్యవహారానికి వీలుగా ఉండటమే కాదు, శుభాలను, అదృష్టాన్ని కలిగిస్తుంది. కీర్తికి కారణ మౌతుంది. ఒకప్పుడు గురువులు లేదా వంశ పురోహితులు జీవుడి లక్షణాన్ని బట్టి నామ కరణం చేసే వారు. తరువాతి కాలంలో తల్లి తండ్రులు కాని, ఇంటిలోని పెద్దలు కాని తమ అభిరుచులు, ఆదర్శాలు, ఇష్టాల ననుసరించి పేరు పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. పేరును బట్టి పెట్టిన వారి సంస్కారం వ్యక్తమౌతుంది. అంతే కాదు పేరుని బట్టి వ్యక్తి జీవితం ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఈ నాడు కనపడుతోంది. అందుకే పేరు మార్చుకోవటం, పేరులోని అక్షరాలను కొంచెం మార్చుకోవటం, కొంచెం అటూ ఇటూ చేయటం, ఆంగ్లంలో వ్రాసేప్పుడు అక్షర క్రమం(spelling)లో మార్పు చేయటం గమనించ వచ్చు. (అక్షర క్రమం మార్చటం ఆంగ్లలో మాత్రమే చేస్తారు. అంటే ఇది మన పద్ధతి కాదు అని అర్థం చేసుకోవచ్చు.)
“ఆయుర్వర్చోభి వృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తదా
నామకరణ ఫలంత్వే తత్సముద్దిష్టమ్ మనీషిభిః ”
శిశువుకి ఆనందం, ఆయుస్సు, తేజస్సు, కీర్తి కలగటం కోసం నామకరణ సంస్కారాన్ని చేయాలట!
పేరుకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన శాస్త్రకారులు పేరు పెట్టటం అనే కార్యక్రమాన్ని నామకరణ సంస్కారంగా రూపొందించారు. నామకరణ విధి విధానానికి సంబంధించి గృహ్య సూత్రాలలో విపులంగా చర్చించ బడింది. పారస్కర గృహ్య సూత్రం పురుషుల పేరులో రెండు లేక నాలుగు అక్షరాలుండాలని, స్త్రీల పేరులో బేసి సంఖ్య (మూడు, ఐదు- ప్రధానంగా మూడు) లో అక్షరాలుండాలని తెలుపుతుంది. పైగా మగ పిల్లల పేర్లలో ఘోష సంజ్ఞ ఉన్న అక్షరాలు ( ఊది పలికే ఠ, మొదలైనవి) ఉండాలని ఉన్నది. పేరు పెట్టటంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేరు వినగానే ఆ వ్యక్తి స్త్రీయో, పురుషుడో తెలియాలి. కొండలు, నదులు, అరణ్యాలు, ఋషులు, గోత్రాలు, చెట్లు, రాక్షసులు మొదలైన వాటిని సూచించే పేర్లు పెట్ట కూడదని సూచించటం జరిగింది.
నామకరణ కార్యక్రమాన్నే బాలసారె అంటారు. వ్యవహారంలో అది బాలసారెగా మారింది. బాలకు అంటే శిశువుకి అందరు బహుమానాలు (సారె) ఇస్తారు ఆ రోజు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా శిశువు పుట్టిన పదకొండవ రోజున చేస్తారు. ఆ రోజున ఎలాగూ పురుటి స్నానం కనుక పుణ్యాహవచనం చేస్తారు. పురోహితుడు వస్తాడు. ఇంట్లో కొద్ది హడావుడి ఉంటుంది. అప్పుడు కుదరక పోతే బేసి సంఖ్య రోజున చేయ వచ్చు. 21వ రోజు అయితే ముహూర్తం, తిథి వార నక్షత్రాలు చూడనక్కరలేదు. 16వ రోజు కూడా చేయ వచ్చు. నెల లోపు వీలు కానప్పుడు మూడవ నెల చేసుకుంటారు. కాలామృత కారుడు బిడ్డ పుట్టిన 11వ రోజుతో జాతాశౌచం పూర్తి అవుతుంది కనుక ఆ రోజే నామకరణ సంస్కారం చేయాలని జ్యోతిష పరంగా తెలియ చేశాడు. “జాతానంతర మేవ నామ కరణం ఏకాదశాహే స్ఫుటం” . శిశువుకి చెందినవిగా చాంద్ర మాన, వేదోక్త, విష్ణు, సూర్య, స్త్రీ దేవతా, ఋతు, మాస నామాలని కూడా ప్రకటించాలి. కాని సాధారణంగా సంవత్సర, మాస, నక్షత్ర , వ్యవహార నామాలని వ్రాయటమే అలవాటుగా వస్తోంది.
తమకు తగిన సమయాన్ని నిర్ణయించుకున్న తరువాత ఆరోజు తల్లి తండ్రులు, శిశువు అభ్యంగన స్నానం చేయాలి.ఇల్లు శుభ్రం చేసి. మామిడాకుల తోరణాలు కట్టాలి. తూర్పు ముఖంగా పీటల మీద కూర్చుని, కలశ స్థాపన చేసి, పసుపుతో చేసిన గణపతిని, షష్ఠి దేవతను పూజించాలి. ఒక వేళ అంతకు ముందు జాతకర్మ (ఆవు నెయ్యి, తేనె, ఆవు పాలలో ముంచిన బంగారు కడ్డీని నాలుకపై రాయటం) చేసి ఉండక పోతే అప్పుడు చేయాలి. నాందీ కర్మ చేసిన తర్వాత పళ్ళెంలో బియ్యం పోసి , దానిలో బంగారు ఉంగరంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకి మూడు గీతలు గీసి, ముందుగా శ్రీకారం వ్రాసి, ఒక్కొక్క గడిలో సంవత్సర, మాస, నక్షత్ర,, వ్యవహార నామాలు వ్రాయాలి. కొంత మంది నక్షత్ర నామాన్నే వ్యవహార నామంగా చేసుకుంటారు. “సభాసకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం” అని చెప్పి వ్యవహార నామాన్ని మూడు మార్లు బిడ్డ చెవిలో చెప్పాలి. ఈ సమయంలోనే పెద్దలందరూ పిల్ల వాడిని అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. శిశువుకి బహుమానాలు ఇచ్చే సమయం ఇదే. వసంతం (ఎర్ర నీళ్ళు) తో దిష్టి తీసి, కర్పూర హారతి ఇస్తారు. పురోహితుడు మొలతాడు కట్టిస్తాడు. ఒక వేళ నామ కరణం ఆలస్యంగా నయినా, 11వ రోజున పుణ్యాహ వచనం, మొలత్రాడు కట్టటం తప్పని సరిగా చేస్తారు.
నామకరణ సమయంలో చదివే మంత్రాలు తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధాన్ని స్థాపించేవిగా ఉంటాయి. “ఆత్మావై పుత్రనామాసి” , “అంగాదంగాత్సంభవసి” మొదలైనవి.
పేరు పెట్టటం పూర్తి అయిన తరువాత స్త్రీలు బిడ్డను ఊయలలో వేస్తారు. ఈ కార్య క్రమం మాత్రం ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటుంది. ఊయల క్రింది నుండి ఇద్దరు ముత్తైదువలు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అందుకోవటం, నూతిలో చేద వేయించటం, బిడ్డ చెవిలో ముమ్మారు పేరుని ఉచ్చరించటం వంటివి. పేరుకి ఉన్న శక్తిని అనుసరించి బిడ్డ పేరుగల వాడు, పేరెన్నిక గలవాడు, అవుతాడు.
....Dr Anantha Lakshm