Read more!

ఉగాదికి ముస్లింల ప్రార్థన

 

ఉగాదికి ముస్లింల ప్రార్థన

 


దైవానికి ప్రత్యేకించి ఓ రూపం అంటూ ఏముంటుంది? క్రైస్తవుల క్రీస్తు అయినా, హిందువుల కృష్ణుడైనా భక్తుల కులమతాలను పట్టించుకోరు కదా! అందుకే భక్తులు కూడా తమ మనసులో కోరికలని తీర్చమంటూ కనిపించిన దైవానికల్లా మొక్కుకుంటారు. దానికి నిదర్శనమే దేవునికడపలో సాగే ముస్లింల ప్రార్థనలు.

 

 

కడప నగరంలో దేవునికడపగా పిల్చుకునే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. తిరుమలకు కాలినడకన వెళ్లే యాత్రికులు ఈ క్షేత్రాన్ని ముందుగా దర్శించుకునేవారు. అందుకే ఈ క్షేత్రానికి దేవుని గడప అనేవారనీ... అదే క్రమేపీ కడపగా మారిందనీ చెబుతారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలాగానే ఇక్కడి వెంకన్న ఆలయం కూడా ఉగాది రోజున కిటకిటలాడిపోతుంది. ఆ సందడిలో పాలుపంచుకునే ముస్లింల భక్తిని చూసితీరాల్సిందే!

 

 

వెంకన్న భార్యలలో ఒకరైన బీబీనాంచారమ్మ ముస్లింల ఆడపడుచే కదా! అందుకనే కడప చుట్టుపక్కల ముస్లింలు వెంకటేశ్వరస్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. ఏటా ఉగాదినాడు తప్పకుండా ఆయనను దర్శించుకుంటారు. అలాగని ఏదో మొక్కుబడిగా గుడికి వస్తారనుకుంటే పొరపాటే! ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఉగాది పచ్చడిలో వేసే బెల్లం, వేపపువ్వు, చెరుకుగడలు, చింతపండు వంటి సరుకులను తీసుకుని ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కూడా వీరి భక్తి ప్రపత్తులు హైందవులకి ఏమాత్రం తీసిపోవు. తాము తెచ్చిన పదార్థాలను స్వామివారికి నివేదించి, కొబ్బరికాయను కొట్టి, హారతిని కళ్లకు అద్దుకుని, శఠారిని స్వీకరించి... తీర్థప్రసాదాలను అందుకుంటారు. ఈ రోజంతా వారు మద్యమాంసాలను ముట్టరు.

 

ఇలా ఉగాది రోజున ముస్లింలు దేవుని సేవించుకునే ఆచారం వందల ఏళ్లుగా నిరాటంకంగా వస్తోందని చెబుతున్నారు. కాలం మారినా... కల్మషాలు రేగినా, ఈ ఆచారం ఇలా సాగుతూనే ఉంటుందని అక్కడి ముస్లిం పెద్దలు భరోసాని అందిస్తున్నారు.

 

- నిర్జర.