ముగ్గుతో ప్రతి రోజూ పండుగే!

 


ముగ్గుతో ప్రతి రోజూ పండుగే!

 

 

పండుగలు వస్తాయి, వెళ్లిపోతాయి. కానీ కొన్ని సంప్రదాయాలను మాత్రం పండుగలు పబ్బాలతో సంబంధం లేకుండా నిత్యం పాటిస్తూనే ఉంటాము. వాటిలో ముఖ్యమైనది ముగ్గు వేయడం. ఇంట్లో ఏదన్నా అశుభం జరిగితేనో, ఇంటిల్లపాదీ ఊరికి వెళ్తేనో తప్ప, ఇంటి ముందర ముగ్గు వేయడం మానరు తెలుగువారు. మన ఇళ్లలోని ఆడవారు అలవోకగా వేసే ముగ్గు వెనుక వందల ఏళ్ల నుంచి నిలిచి ఉన్న సంస్కృతి కనిపిస్తుంది. ఆ సంస్కృతి వెనుక పదుల కొద్దీ కారణాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని.

- బియ్యపు పిండితో ముగ్గుని వేయడం వల్ల మన చుట్టూ తిరిగే పిచుకలు, ఉడతలు, చీమలు వంటి చిన్నచిన్న ప్రాణులకు ఆహారాన్ని కల్పించినట్లు అవుతుంది. గృహస్థు తన నిత్య జీవితంలో తెలిసీ తెలియకుండా ఎన్నో ప్రాణులకు హాని కలిగిస్తూ ఉంటాడు. తనకు తోచిన రీతిలో వాటికి తిరిగి ఆహారాన్ని అందించడం వల్ల అలాంటి పాపాలకు పరిహారం లభిస్తుంది.

- కొందరు ముగ్గు వేయడానికి రాతిపిండిని వాడతారు. సున్నపు రాళ్లతోనో, నత్తగుల్లలతోనో తయారుచేసే ఈ పిండితో ముగ్గు వేసినా మనకి ప్రయోజనమే! ఈ పిండి ఘాటుకి సూక్ష్మక్రిములు ఇంటి బయటే నిలిచిపోతాయి. ముగ్గుపిండికి కార్బన్‌ డై అక్సైడ్‌ వంటి మలినాలను పీల్చుకునే గుణం ఉంటుంది.

 

 

- ముగ్గు వేయడం వల్ల ఇంటికి నిండుదనం వస్తుంది. తరచూ ఇంటి లోపలికీ బయటకీ తిరిగే మనకి ముగ్గుని దాటుకుని వెళ్తున్నప్పుడల్లా మనసు నిండుగా ఉంటుంది. ఇంటి ముందర నుంచి వెళ్లేవాళ్లకి కూడా ఇల్లు కళకళలాడుతూ కనిపిస్తుంది.

- ముగ్గులని మన ప్రాచీన ఖగోళశాస్త్రంగా భావించేవారు కూడా లేకపోలేదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలకీ, గ్రహాలకీ, రాశులకీ సూచనగా ముగ్గులు వేయడం మొదలు పెట్టి ఉంటారన్నది కొందరి నమ్మకం. ముగ్గులు ఖగోళానికి సూచన అయినా కాకపోయినా, ఆకాశంలోని తారలు తప్పకుండా నేల మీద ముగ్గులు వేసేందుకు ఒక ప్రేరణగా నిలిచి ఉంటాయి.

- ముగ్గులు అప్పటి సందర్భానికి ఒక సూచనగా కూడా ఉంటాయి. సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నదానికి గుర్తుగా సంక్రాంతి రథం ముగ్గు వేస్తారు. యజ్ఞవాటికలకి ఒక విధంగా, వధూవరుల దగ్గర ఒక విధంగా ముగ్గులు వేస్తారు. ఇక ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మను ఉంచితే ధనుర్మాసం ప్రవేశించిందని అర్థం.

- గణితాన్ని సృజనతో అనుసంధానించే గొప్ప కళ ముగ్గు. లెక్క ప్రకారం చుక్కలు పెట్టి, వాటిని కలుపుకుంటూ వేసే ముగ్గుకి ఎలాంటి కొలబద్దలూ, కంపాస్‌లూ అవసరం లేదు. ఒక ముగ్గులో ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎన్ని గీతలు గీయాలి అనే అంశాలతో మన పూర్వీకులు కావల్సినంత సంఖ్యా జ్ఞానాన్ని అలవర్చుకుని ఉంటారు.

 

 

- ముగ్గు వేసే విధానం ఒక మనిషిలోని సృజనశక్తినే కాదు, వారి మనస్తత్వాన్ని కూడా చెబుతుంది. మన పెద్దలు ఒక అమ్మాయి ముగ్గు వేసే విధానాన్ని బట్టి ఆమె మనస్తత్వాన్ని ఊహించేవారు. ముగ్గుని సన్నటి గీతలతో వేస్తే ఆమె పొదుపరి అనీ, ముగ్గుని వీలైనంతగా అలంకరిస్తే ఆమె అలంకార ప్రియురాలనీ అనుకునేవారు. అయితే ఒకరిలోని సృజనని వ్యక్తపరిచేందుకు ముగ్గు కూడా ఒక సాధనమే అని మాత్రం ఎవరైనా ఒప్పుకోక తప్పదు.

- ముగ్గులు దుష్టశక్తులను తరిమివేసే యంత్రాలు అని భావించేవారు కూడా లేకపోలేదు. తాంత్రికులు కూడా ముగ్గు లేకుండా సాధన చేయరు. ఆ దుష్టశక్తుల సంగతేమో కానీ, అందమైన ముగ్గుని చూసినప్పుడు మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయనడంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు!

- నిర్జర.