వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం
వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం
మనకు నూతన సంవత్సరం ‘ఉగాది’ పండుగతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రావణమాసం చివరి వరకు విశేషమైన పండుగలు ఉండవు. అయితే ‘శ్రీరామనవమి’ ఉగాది తర్వాతే వస్తుంది. నిజానికి శ్రీరాముని మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని మనం ఒక వేడుకగా జరుపుకుంటాం గానీ.., అది పండుగ కాదు. ఎందుకంటే, శ్రీరాముడు పుట్టకముందు ఈ పండుగ లేదు. అలాగే ‘కృష్ణాష్టమి’ కూడా. శ్రీరామ, శ్రీకృష్ణులకు పూర్వం నుంచీ ‘వినాయకచవితి’ పండుగ మాత్రం ఉంది. ఇక శ్రావణ మాసంలో వచ్చే ‘వరలక్ష్మీ వ్రతం’ స్త్రీలకు సంబంధించిన ఓ వ్రతమే కానీ.., పండుగ కాదు. ఎందుకు ఇంత వివరణ అంటే.., కారణం ఉంది. అదేమిటంటే -
సంవత్సరానికి అయనములు రెండు.
ఉత్తరాయణం..., దక్షిణాయనం
దక్షిణాయనం దగ్గరదగ్గరగా...శ్రావణమాసం బహుళపక్షంలో ప్రారంభమవుతుంది. దక్షాణాయనంలో వచ్చే మొదటి పండుగ ‘వినాయకచవితి’. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ మీకో విషయం బాగా అర్థం అవుతుంది. మన పండుగలన్నీ ‘వినాయకచవితి’తో ప్రారంభమై...‘ఉగాది’తో ముగుస్తాయి. వినాయకుడు ఆదిపూజితుడు. మరి ఆయన పండుగ కూడా తొలి పండుగ కావడమే ధర్మం. అందుకే ప్రకృతి అలా నిర్ణయించింది. సృష్టిలో తొలి శబ్దం ‘ఓం’కారం. సంస్కృత భాషలో ‘ఓం’ అనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి ఒంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. ‘ఓం’కారానికి ఆకారం అది. ‘ఓం’కారం అంటే ‘ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది. అది ఆయన బొజ్జ. మధ్యనుంచి వుండే తోక, ఆయన తొండం. దాని పైనున్న అర్థచంద్రరేఖ చవితి చంద్రుడు. వినాయకుడు పుట్టింది భాద్రపద శుద్ధచవితి కదా. దాని మధ్యలోనున్న బిందువు ‘హస్త’ నక్షత్రం. చంద్రుడు హస్త నక్షత్రంతో కలిసి ఉండే మాసం ‘భాద్రపదమాసం’.
అంటే...వినాయకుడు భాద్రపద శుద్ధ చవితినాడు హస్త నక్షత్రంలో పుట్టాడన్నమాట. ఇదీ ‘ఓం కారం’ మనకు చెప్పే రహస్యం. ఇక - సకల విద్యలకూ,మంత్రాలకూ తొలి అక్షరం ‘ఓం’. ఏ మంత్రం ఆరంభించినా, ఓం కారంతో ప్రారంభం కావలసిందే. పిల్లలకు ‘అక్షరాభ్యాసం’ చేసేటప్పుడుకూడా..‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అని తొలిసారిగా వ్రాయిస్తారు. అందుకే..వినాయకుడు సర్వ విద్యలకూ, సకల మంత్రాలకూ అధినాథుడు. తనే ముందుండి ఈ చరాచర జగత్తును నడిపిస్తూంటాడు. విఘ్నాలు రాకుండా కాపాడుతూంటాడు. అందుకే.., ఆయన జన్మదినం ఈ జగత్తుకే పండుగ దినమైంది. వినాయకుడు అల్పసంతోషి. ఆయనను పూజించడానికి పెద్దగా ఆచారాలు పాటించ నక్కరలేదు. మనం అలిసిపోయేలా అభిషేకాలు చేయ నక్కరలేదు. ఖర్చుతో కూడిన నైవేద్యాలు సమర్పించ నక్కరలేదు. భక్తిగా నాలుగు గరిక పరకలు ఏరుకొచ్చి మీదవేసినా.., ఓ రెండు చప్పిడి కుడుములు ముందుంచి తినమని చేతులు తిప్పినా.., పొంగిపోతూ స్వీకరించే దేవుడు ఎవరయ్యా అంటే ‘వినాయకుడు’ ఒక్కడే. పూజించినంత కాలం పూజించి, చివరి రోజున తీసుకెళ్ళి నీటిలో పారేసినా., చిరునవ్వుతో దీవిస్తాడేకానీ, కోపగించి శపించడు. అందుకే ఆయన పిల్లలదగ్గర నుంచి పెద్దల వరకు అభిమాన పాత్రుడయ్యాడు..ఆరాధ్య దైవమయ్యాడు.
అసలు ‘వినాయకుడు’ ఎవరు?
ఆయన పుట్టుకకు కారణం ఏమిటి?
తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ... ఉంటుంది మరి. అయితే -
రేపు ఇదే ‘వెబ్ సైట్’కి... ‘లాగిన్’ అవ్వండి. ‘వినాయకుని’ విశేషాలు చదివి ఆనందించండి.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం