ఈ మాస శివరాత్రి రోజు ఇలా చేస్తే మీలో వచ్చే మార్పుని గమనించి మీరే ఆశ్చర్యపోతారు..
ఈ మాస శివరాత్రి రోజు ఇలా చేస్తే మీలో వచ్చే మార్పుని గమనించి మీరే ఆశ్చర్యపోతారు..
శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః
మాస శివ రాత్రి. ప్రతి నెలా వచ్చే మన శివుని పండుగ. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కృష్ణ పక్షం చతుర్దశి నాడు ఆ భోళా శంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి. చంద్రమా మనసో జాతః అని పెద్దలు చెపుతూ ఉంటారు. అంటే చంద్రుడు మన మనస్సుకు కారకుడు. చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు కేతువు ప్రభావము ఎక్కువగా ఉంటుంది. కోపం, చికాకు, దుడుకుతనము, జీర్ణ శక్తి మందగించడము, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్య లోపం ఇలాంటివి తలెత్తే సమయము. అందుకే ఆ చంద్రుడిని తల పైన పెట్టుకున్న వానిని శరణు వేడతాము.
భోళా శంకరుడు. నాలుగు చుక్కల నీరు పోసి, మూడు దళాలు ఉన్న బిల్వ దళం మనసారా పెడితే సంతోషించి వరాలనిచ్చే వరదుడు. కస్టపడి ఏ పూజ చేయవలసిన పని లేదు. ఏవేవో వస్తువులు సేకరించి పెట్టుకోవలసిన పని లేదు. జీవ యాత్ర చాలించిన జీవిని అందరు వదిలేసినా కూడా నేనున్నాను నీకు తోడు అంటూ స్మశానంలో సదా నివసిస్తూ ఉండే మార్గ బంధువు. లోకాలలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి కాపాడిన పరమాత్ముడు.
అధికార గర్వముతో దుర్వాస మహర్షిని అవమానించిన దేవేంద్రుడు ఆ మహానుభావుని శాప కారణంగా తన సమస్త సంపదలు సముద్రం పాలు అవ్వడం చూస్తూ ఉండి పోయాడు. ఆ తరువాత తిరిగి వాటిని పొందడం కొరకు దానవుల సహకారముతో మందర పర్వతమును కవ్వముగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగరమును మధించినప్పుడు ముందుగా లోకాలన్నిటినీ భస్మం చేస్తుందా అని అనిపించేలా ఉగ్రతతో హాలాహలం పుట్టింది. దేవతలంతా వెళ్లి ఈ తండ్రికి మొరపెడితే ఆయన సాభిప్రాయంగా తన ఇల్లాలైనసర్వమంగళాదేవి వంక చూడగా ఆ తల్లి
మ్రింగెడిది గరళమనియు
మ్రింగెడివాడు విభుండని మేలని ప్రజకున్
మ్రింగుమనియె సర్వమంగళ
మంగళ సూత్రమునెంత మంది నమ్మినదో
అంటూ అప్పటి ఆ ఆదిదంపతుల భావనలను పరమాద్భుతముగా వర్ణించారు పోతనామాత్యులు. అలా అమ్మవారి అనుమతి తీసుకుని ఆ లోకాధారుడు ఆ కాలకూట విషయాన్ని తాను స్వీకరించి లోకాలను కాపాడాడు. క్షీరసాగర మధనం మరలా కొనసాగేలా చూసాడు. తన లోపల ఉన్న లోకాలకు కష్టం కలగకుండా గొంతులోనే నిలుపుకుని శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. ఇంటి పెద్దను శివుడితో పోలుస్తారు. జీవితం లోని ఆటుపోట్లను, కష్ట నష్టములను, అందరు చేసే తప్పులను గొంతులోనే దాచుకుని భార్య సహకారముతో లోకాన్ని చల్లగా నడిపే వాడు ఈ ఆది గృహస్తు. ఈ మాస శివరాత్రికి మన శివయ్యలోని ఈ లక్షణాన్ని మనము అలవరచుకునే ప్రయత్నం చేద్దాము. జీవనాన్ని సఫలం చేసుకుందాము. శివుని ఆశీస్సులు పొంది తరిద్దాము. https://www.youtube.com/watch?v=znNNXFW1Nwc