మానవత్వమే సాయితత్వం

 

 మానవత్వమే సాయితత్వం

 

మహిమలతో కాదు.. మానవత్వంతో బతకాలన్నదే సాయితత్వం చాటే సత్యం. బాబా ఎప్పుడూ తన గొప్పతనాన్ని మహిమాన్విత శక్తిని ప్రదర్శించలేదు. భక్తుల చెవిలో మంత్రాలు ఊదలేదు. చేతులకు తాయత్తులు కట్టలేదు. చివరకు జ్యోతిష్యం, గ్రహదోషాలు వంటి వాటిని కూడా బాబా మూఢనమ్మకాలుగానే భావించారు. తన భక్తులను వాటి జోలికి పోనివ్వలేదు. అందుకే యోగీశ్వరుల పరంపరలో సాయిబాబా విశిష్టమైనవారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మహిమలు ప్రదర్చించబోయినా వారిని వారించి దారిలో పెట్టారు. మహిమల కంటే మానవత్వాన్ని ప్రదర్శించడం ఉత్తమమని బోధించేవారు.

బాబా భక్తజన బాంధవుడు, భక్త సులభుడు. పిలిస్తే పలికే దైవం. బాబాకు దేహాభిమానం లేదు. భక్తులను మనసారా ప్రేమించారు. గురువులు రెండు రకాలు ఒకరు నియత గురువులు. అంటే నియమింపబడిన వారని అర్ధం. రెండు అనియత గురువులు, సమయానుకూలంగా తమంతట తామే వచ్చి మన అంతరంగాలను శుద్ధి చేసి, సద్గుణాలను పెంపొందించి మోక్షమార్గాన నడిపించే వారిని అనియత గురువులు అంటారు.

సర్వవిధాలా ప్రపంచజ్ఞానాన్ని బోధించే గురువులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వీణ, చిరుతలు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ, ఆధ్యాత్మిక ఆడంబరాన్ని చాటేవారు కొందరు. గురువులమని చెప్పుకుంటూ డాబుసరి కబుర్లతో కాలం గడిపేవారు మరికొందరు. భక్తుల చెవిలో మంత్రాలు ఊదుతామని డబ్బులు గుంజేవారు ఇంకొందరు. కానీ, ప్రస్తుతం మనమున్న సహజ స్థితిలోనే మనల్ని ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకుపోయే వారే నిజమైన గురువులు. వారే సద్గురువులు. శ్రీ సాయి అటువంటి సద్గురువు, బాబా మహిమ వర్ణనాతీతం.

చూపు మాత్రంగానే బాబా భక్తుల భూత, భవిష్యత్, వర్తమానాలను గ్రహించేవారు. అవన్నీ బాబాకు కరతలామలకం. ప్రతి జీవిలోనూ బాబా దైవాన్ని చూసేవారు. శత్రువులు, స్నేహితుల పట్ల సమభావంతోనే ఉండేవారు. నిరభిమానం, సమానత్వం బాబాలో మూర్తీభవించి కనిపించేవి. బాబాకు కలిమిలేములు సమానం. బాబా మానవదేహం ధరించినా ఇల్లు వాకిలి పట్ల అభిమానం, వ్యామోహం ఉండేవి కావు. శరీరధారిగా కనిపించే సాయిబాబా, నిజానికి నిశ్శరీరులు. జీవన్ముక్తులు.

నిజమైన స్వచ్చమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు. ప్రేమలో నుంచీ వస్తుంది. హృదయం దాని ఆస్థానం. ఈ లెక్కన చూస్తే షిర్డీ వాసులు పుణ్యాత్ములు. తాము తింటున్నా, తాగుతున్నా, పనిపాటలు చేసుకుంటున్నా సాయి నామస్మరణను మరిచేవారు కాదు. బాబా మహిమలను కీర్తిస్తూ, తమ పనులు తాము చేసుకునేవారు. బాబాపట్ల షిర్డీ స్త్రీల ప్రేమను, బాబా పట్ల వారి భక్తిని, బాబా వారిపై కురిపించిన అవ్యాజమైన కరుణను గురించి వర్ణించడానికి అక్షరాలు చాలవు. షిర్డీ వాసులు అక్షర జ్ఞానం లేని పామరులే అయినా అద్భుత ప్రేమతో వారు బాబాను గెలుచుకున్నారు. బాబా పాదస్పర్శతో షిర్డీలోని చెట్టు చేమా, మట్టి పుట్టా అన్నీ పులకించాయి. ఆ నేల బాబా పాద ధూళి తాకి పునీతమైంది.