మహాకవి క్షేత్రయ్య

 

మహాకవి క్షేత్రయ్య

 

తెలుగు సంగీతంలో అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులకు ఎంత ప్రాధాన్యత ఉందో క్షేత్రయ్యకూ అంతే ప్రాధాన్యత ఉంది. కానీ ఇతర సంగీతకారులకూ క్షేత్రయ్యకూ ఒక తేడా ఉంది. క్షేత్రయ్యకు ఎలాంటి అక్షరజ్ఞానమూ లేదు. పండితుల కుటుంబమూ కాదు! కానీ మొవ్వ గోపాలనుని మహత్తు వల్లే ఆయన గొప్ప వాగ్గేయకారునిగా మారాడు.

 

క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. కృష్ణాజిల్లా మొవ్వగ్రామంలో నివసించేవాడు. ఉదయం వేళలలో గోవులను కాసుకోవడం, సాయంత్రం వేళల్లో అక్కడి వేణుగోపాలస్వామిని సేవించుకోవడం... ఇదే ఆయన దినచర్యగా ఉండేది. ఇదంతా 17వ శతాబ్దం నాటి సంగతి. వరదయ్య నివసిస్తున్న మువ్వ సమీపంలోనే కూచిపూడి గ్రామం ఉంది. అక్కడ సిద్ధేంద్ర యోగి అప్పుడప్పుడే కూచిపూడి పేరిట ఒక నాట్యాన్ని ప్రచారంలోకి తీసుకువస్తున్నాడు. ఆ ప్రభావం కూడా క్షేత్రయ్య మీద ఉందని చెబుతారు.

 

క్షేత్రయ్య వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. దాంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. క్షేత్రయ్య భక్తికి మెచ్చిన మొవ్వగోపాలుడు, ఆయన నాలుక మీద బీజాక్షరాలు లిఖించాడనీ... దాంతో అతను అద్భుతమైన పదాలను సృష్టించగలిగాడనీ అంటారు. మరికొన్ని కథనాల ప్రకారం, క్షేత్రయ్య కూచిపూడిని నేర్చుకునే సమయంలో ఒక దేవదాసితో ప్రేమలో పడ్డాడు. ఆమె ప్రోత్సాహంతోనే మొవ్వ గోపాలుని మీద పదాలు రాయాలని నిశ్చయించుకున్నాడు. ఏది ఏమైనా... ఎలాంటి చదువూ లేని క్షేత్రయ్య అనర్గళంగా పదాలను రాయడం ఆ మొవ్వ గోపాలుని మహిమే!

 

క్షేత్రయ్య తన జీవితకాలంలో మూడువేలకు పైగా కీర్తనలు రచించారని చెబుతారు. అయితే వాటిలో ఇప్పుడు కేవలం 300 కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. క్షేత్రయ్య కాలానికి మధురభక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. భగవంతుని ప్రేమికునిగాను, తనను తాను ప్రేయసిగాను తలచి కొలుచుకోవడమే ఈ మధురభక్తి లక్ష్యం. జయదేవుని అష్టపదులు ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇలా మధురభక్తితో చేసే రచనలలో శృంగార రసం కాస్త మోతాదు మించినట్లే తోస్తుంది. కానీ కవి దృష్టిలోంచి చూసినప్పుడు అది కూడా భక్తిభావమే అని స్ఫురిస్తుంది.

 

క్షేత్రయ్య మధురభక్తిలో కీర్తనలు చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలను తిరిగాడు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, కంచి మధుర... ఇలా ప్రసిద్ధ క్షేత్రాలన్నింటినీ దర్శించాడు. ఆ కారణంగానే ఆయనకు క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడిందట. అడుగుపెట్టిన ప్రతిచోటా అతని పాండిత్యానికి తగిన గౌరవమే లభించింది. స్థానిక పండితులతో పాటు పాలకులు కూడా ఆయనను ఆదరించారు. 

 

క్షేత్రయ్య పదాలలో ఆనాటి తెలుగు భాష, జాతీయాలు పుష్కలంగా కనిపిస్తాయి. వాటితో పాటుగా మువ్వ గోపాలుని ప్రస్తావనా వినిపిస్తుంది. మువ్వ గోపాలుడంటే సామాన్యుడా! ముద్గలుడు అనే రుషికి స్వయంభువుగా ఇసుకదిబ్బలలో దొరికినవాడు. తాను ఏ క్షేత్రంలో తిరుగుతున్నా, క్షేత్రయ్య మనసు మొవ్వలోని మువ్వగోపాలుని మీదే లగ్నమై ఉండేది.

 

క్షేత్రయ్య పదాలు పాడుకోవడానికి వీలుగా రాగయుక్తంగా ఉంటాయి. బహుశా కూచిపూడి ప్రభావం వల్లనో ఏమో... అభినయానికి కూడా అనుకూలంగా ఉంటాయి. మనం తరచూ వినే ‘ఎంత చక్కనివాడే నా సామి’ వంటి కీర్తనలు క్షేత్రయ్య కలం నుంచి వెలువడినవే!


- నిర్జర.