మహాభలేశ్వరుడు వెలసిన కథనం తెలుసా?

 

మహాభలేశ్వరుడు వెలసిన కథనం తెలుసా?

పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రాలలో గోకర్ణక్షేత్రం ఒకటి. అక్కడ పరమేశ్వరుడు మహాభలేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి కథనం ఏమిటంటే….

త్రేతాయుగంలో రావణబ్రహ్మ లంకానగరాన్ని పాలిస్తుండేవాడు. అతని తల్లి కైకసి, ఆమె ప్రతిరోజూ మృణ్మయ లింగాన్ని పూజిస్తూ ఉండేది. అది చూసిన రావణుడు ఒకరోజున "ఏంటిది ఈ రావణబ్రహ్మ  తల్లి మట్టి లింగాన్ని పూజించటమా? ఎంత అవమానము? నేను కైలాసానికి పాయి ఈశ్వరుణ్ణి, పత్ని, పుత్ర, పరివార సమేతంగా లంకకు తీసుకువస్తాను". అని కైలాసానికి వెళ్ళి ఆ పర్వతాన్ని పెళ్ళగించటం మొదలుపెట్టాడు. ఆ కుదుపుకు పర్వతం కంపించిపోయింది. పర్వతము మీదనున్న పార్వతీదేవి ఈశ్వరుని వైపు చూసింది ఏమిది? అన్నట్లు.

ఈశ్వరుడు సమాధానంగా "రావణుని పని" అంటూ కాలితో పర్వతాన్ని అదిమాడు. ఆ దెబ్బతో రావణబ్రహ్మ పర్వతం క్రింద పడి నలిగిపోయి, శివుని ప్రార్ధించి బయటపడ్డాడు. తరువాత తన ప్రేగులతో వీణవాయించి శివుని మెప్పించారు. ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఏం వరం కావాలో కోరుకో" అన్నాడు. 

దానికి ఆ పది తలకాయల రావణుడు "భగవంతుడు ఒక చోట, భక్తుడు ఒక చోట ఉండటం సరికాదు. కాబట్టి నువ్వు సపరివారంగా లంకకు రావలసింది" అన్నాడు. 

దానికి శంకరుడు "వత్సా! నీవు చెప్పినది సరియైనదే. కాని నేను లంకకు రావటం కష్టమైన పని. అందుచేత నా ఆత్మ లింగాన్ని ఇస్తాను తీసుకువెళ్ళు. అయితే త్రోవలో ఈ లింగాన్ని ఎక్కడా క్రింద పెట్టవద్దు" అన్నాడు. 

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు.

రావణబ్రహ్మ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తీసుకుపోతున్నాడని విని గణపతిని పంపించాడు. రావణుడు కాలాతీతం కాకుండా త్రికాలముల యందు సంధ్యావందనము చేస్తాడు. సాయంసంధ్య కావస్తోంది. ఆత్మలింగాన్ని నేలమీద ఉంచకూడదు. ఏం చెయ్యాలి? అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో దూరాన ఒక బాలుడు కనిపించాడు. రావణుడు ఆ బాలుని పిలిచి పేరు అడిగాడు. 'గణేశభట్టు' అన్నాడు ఆ బాలుడు. 

"నీ తల్లితండ్రులెవరు?" అన్నాడు రావణుడు.

గణపతి - "మా నాన్న పేరు 'శివయ్య', అమ్మ పేరు 'గౌరమ్మ'' అన్నాడు.

రావణుడు : "మీ నాన్న ఏం చేస్తాడు??".

గణపతి : "ఎప్పుడూ రామ మంత్రాన్ని జపిస్తుంటాడు." అని బదులిచ్చాడు.

రావణుడు : "సరే! నీకు కావలసినన్ని అప్పచ్చులు పెడతాను. నేను నది దగ్గర సంధ్య వార్చుకుని వచ్చేదాకా ఈ శివలింగాన్ని పట్టుకో" అని అడిగాడు.

గణపతి:  "కుదరదు, నాకు వేరే పనుంది, వెళ్ళాలి.." అన్నాడు.

 రావణుడు:  మంచివాడివి కదా! త్వరగా వచ్చేస్తాను. ఒక్క క్షణం.

 గణపతి : నువ్వింతగా అడుగుతున్నావు కదా! సరే లింగాన్ని పట్టుకుంటాను. త్వరగా వచ్చేయి. నేను మూడుసార్లు నిన్ను పిలుస్తాను. నువ్వు వెంటనే రావాలి. లేకపోతే ఈ లింగాన్ని క్రింద పెట్టి వెళ్ళిపోతాను.

 రావణుడు : బాబ్బాబు! అంత పని మాత్రం చెయ్యకు. నేను వెంటనే వచ్చేస్తాను. అని రావణుడు నదీ తీరానికి వెళ్ళాడు. 

మొదటిసారి పిలిచాడు గణపతి. వచ్చేస్తున్నా అని చెయ్యి ఊపి అర్ఘ్యం వదులుతున్నాడు రావణుడు, రెండోసారి పిలిచాడు గణపతి. చెయ్యి ఊపాడు రావణుడు. మూడోసారి పిలిచాడు గణపతి. రావణుడు త్వరగా పరుగు మీద వచ్చేశాడు. ఈ లోపునే లింగాన్ని క్రింద పెట్టేశాడు గణపతి. చాలా విచారించాడు రావణుడు. లింగాన్ని తియ్యటానికి ప్రయత్నించాడు. అది కదిలిరాలేదు. పాతాళం దాకా పాతుకుపోయింది. చేతులతో పీకటానికి ప్రయత్నించాడు. లింగం జరిగిపోయి ఆవుచెవిలా తయారయ్యింది. ఇక లాభం లేదని శివుని గురించి తపస్సు చేశాడు రావణుడు. పరమేశ్వరుడు రావణబ్రహ్మ కోరికలు తీర్చాడు. రావణుడు లంకానగరానికి వెళ్ళిపోయాడు.

ఆత్మలింగము భూమిలో పాతుకుపోయిన చోటనే 'గోకర్ణక్షేత్రము' అంటారు. ఈ క్షేత్రము భూకైలాసంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ ఈశ్వరుడు 'మహాబలేశ్వరుడు' అనే పేరుతో పిలువబడతాడు. భూకైలాస్ అనే సినిమాలో ఈ సంఘటనను చాలా బాగా చూపించారు. ఇదీ మహాభళేశ్వరుడి కథ.

                                          ◆నిశ్శబ్ద.