కాలు పెడితేనే మోక్షాన్ని ప్రసాదించే మధురాంతకం

 

 

 

కాలు పెడితేనే మోక్షాన్ని ప్రసాదించే మధురాంతకం

 

                                                                      
చెన్నైకి 50 కి.మీ. ల దూరంలో కాంచీపురం జిల్లాలో వున్న మధురాంతకం వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.  ఈ క్షేత్రంలో కాలు పెడితేనే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.  

 

పూర్వం ఇక్కడ బకుళ వనాలు వుండేవిట.  ఆ కారణంగా ఈ ప్రాంతానికి బకుళారణ్యం అనే పేరు వచ్చింది.  ఇక్కడ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతానికి వ్యవసాయానికి నీరందించే ఒక పెద్ద చెరువు వుంది.  ఆ చెరువు కట్టకు దిగువగా వున్నది సీతా, లక్ష్మణ సమేతంగా కొలువైన శ్రీ రామచంద్రుని ఆలయం.  శ్రీ రామచంద్రుని క్షణమైనా వదలని భక్తాగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి ఇక్కడ శ్రీ రామచంద్రుని చెంత కనబడడు.  కారణం సీతాదేవిని చెర విడిపించి లంకనుంచి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తున్న సమయంలో శ్రీ రామచంద్రుడు ఇక్కడ వెలిశాడు.  ఆ సమయంలో ఆంజనేయస్వామి భరతుడికి శ్రీరామ ఆగమన వార్త తెలుపటానికి వెళ్తాడు.  అందుకే ఆయన అక్కడ లేడు.  ఆయన తిరిగి వచ్చాక ఇక్కడ వున్న పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరిణి వడ్డునుంచే ఆలయంలో ప్రతిష్టింపబడ్డ సీతా రామచంద్రుల విగ్రహాలు చూశాడు ఆ అసలైన భక్తుడు.  ఆయన ప్రతి అణువులో శ్రీరామచంద్రుని దర్శించగలడు.  ఈ సన్నివేశానికి గుర్తుగా పుష్కరిణి ఒడ్డున ఆంజనేయ స్వామి ఆలయం నెలకొల్పబడింది.

 

ఇక్కడ మూడు వరసల ఉత్సవ విగ్రహాలు వుంటాయి.  మొదటివి శ్రీమన్నారాయణునిచేత ప్రసాదింపబడిన కరుణాకర మూర్తివి, రెండవ వరుసలో శ్రీ రామానుజుడు పూజించిన విగ్రహాలు, తరువాత వరుసలో తర్వాత ప్రతిష్టింపబడిన విగ్రహాలు.  అందుకే ఈయన్ని పెరియ పెరియ పెరియ స్వామి అంటారు.

 

 

ఈ కధకన్నా ముందు కృతయుగంలో బ్రహ్మ పుత్రులు శ్రీమన్నారాయణుడిని తమకు మోక్షం ప్రసాదించమని కోరారు.  అప్పుడు స్వామి తన విగ్రహాన్నిచ్చి, బకుళారణ్యంలో విభాండక మహర్షి ఆశ్రమంలో మోక్షంకోసం తపస్సు చెయ్యమన్నాడు.   ఆ ప్రదేశమే ప్రస్తుతం కోదండ రాముడు నెలకొన్న మధురాంతకం.  శ్రీమన్నారాయణునిచే బ్రహ్మపుత్రులకు ఇవ్వబడ్డ విగ్రహం కరుణాకరమూర్తి.  వారు శ్రీమన్నారాయణుని ఆదేశం ప్రకారం విభాండక మహర్షి  ఆశ్రమంలో శ్రీ కరుణాకరమూర్తిని స్ధాపించి, తపస్సుచేసి మోక్షం పొందారు.శ్రీ రామచంద్రుడు తన వనవాస సమయంలో విభాండకాశ్రమానికి వచ్చి శ్రీ కరుణాకరుని అర్చించాడు.  అక్కడ కొంతకాలం వున్న తర్వాత రాముడు సీతాన్వేషణలో బయల్దేరినప్పుడు విభాండక మహర్షి శ్రీ రామునితో,  రామా, సీతని తీసుకుని నువ్వు అయోధ్యకి తిరిగి వెళ్ళేటప్పుడు తిరిగి రమ్మంటాడు.  రాముడూ అంగీకరిస్తాడు.

 

రావణ వధానంతరం, సీతా సమేతంగా, తన పరివారంతో  శ్రీరాముడు తిరిగి అయోధ్యకి వెళ్తుండగా, ఈ ప్రదేశానికి వచ్చేసరికి పుష్పక విమానం కదలదు.  కారణం తెలుసుకున్న శ్రీరాముడు, విభాండక మహర్షి దర్శనార్ధం పుష్పక విమానం దిగుతూ, సీతాదేవి చెయ్యి పట్టుకుని ఆవిడ విమానం దిగటానికి సహాయం చేస్తాడు.  దీనిని రూఢిపరుస్తున్నట్లు ఆలయంలో మూల విగ్రహాలలో శ్రీ రాముడు సీతాదేవి చెయ్యి పట్టుకుని వుంటాడు.  శ్రీరాముడు సీత చెయ్యి పట్టుకున్న ఈ అద్భుత దర్శనం ఇక్కడ మాత్రమే లభ్యమవుతుంది.

 

వైష్ణవ మత ప్రబోధకుడు శ్రీ రామానుజాచార్యులవారికి ఈ క్షేత్రంతోగల సంబంధంవల్లకూడా ఈ క్షేత్రం వైష్ణవులకు అతి ముఖ్య పుణ్యక్షేత్రమయింది.  శ్రీ రామానుజాచార్యులవారు శ్రీ పెరంబదూరులో జన్మించినా, ఆయన ఆధ్యాత్మిక రంగంలో అడుగిడినదిక్కడే.  ఆయన పెరియనంబి దగ్గర దీక్ష తీసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీరంగం వెళ్తూ, దోవలో ఇక్కడ అనుకోకుండా ఆయనని కలిశారు.  రామానుజుడు తన కోరిక తెలుపగా పెరియనంబి రామానుజుణ్ణి అక్కడ వున్న వకుళ వృక్షం దగ్గరకు తీసుకెళ్ళి ఆయనకి పంచ సంస్కారాలను ప్రబోధించాడు.

 

 

1937 సం. లో కలకత్తాకు చెందిన సేఠ్ మగన్ లాల్ ఆలయాన్ని పునరుధ్ధరిస్తుండగా ఆలయం బయట గోడదగ్గర భూమిలోవున్న ఒక గుహని చూశారు.   ఇంకా తవ్విచూడగా భూమికి 20 అడుగుల లోపల ఒక మండపంలో నవనీత కృష్ణుడి చిన్న రాగి విగ్రహం, శంఖం, చక్రం, పూజ సామాను అన్నీ రాగితో చేయబడ్డవి కనిపించాయి.  పెరియనంబి రామానుజులవారికి దీక్ష ఇవ్వటానికి వీటిని వాడారని ప్రజలనుకున్నారు.

 

150 సంవత్సరాల క్రితం అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో వున్న ఈ ప్రాంతానికి (అప్పట్లో చెంగల్ పట్ జిల్లాలో వుండేది) లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టరుగా వున్నాడు.  ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అని, కేవలం క్రీస్తు రూపంలో చర్చ్ లో మాత్రమే లేడని నమ్మేవాడు.  చాలాకాలంనుంచి ఆ ఆలయానికి ఎగువవున వాన నీరు నిలువ చెయ్యటానికి ఒక పెద్ద చెరువు వుండేది. వాన నీరంతా   ఈ చెరువులో చేరి అనేక వందల ఎకరాల సేద్యానికి వుపయోగపడేది.  కానీ వాన ఎక్కువ కురిసినప్పుడు ప్రతి సంవత్సరం ఈ చెరువు గట్టు తెగి వరదలు వచ్చి పొలాలకి, ప్రజలకి, నష్టం జరిగేది.  లియనార్ ప్లేస్ ప్రజల శ్రేయసల్సుగురించి ప్రతి సంవత్సరం ఎంతో ధనం వెచ్చించి ఆ చెరువుకట్టను మరమ్మత్తు చేయించేవాడు.  మళ్ళీ వర్షాలతో అది కొట్టుకుపోయేది. 

 

1798లో ఆయన అక్కడ బసచేశాడు.  ఉదయం వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు  దేవాలయానికి వెళ్తున్న కొందరు బ్రాహ్మణులను కలుసుకున్నాడు.  వారితో మాటల్లో వారు అమ్మవారికి ఒక ఆలయం, స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించాలనుకున్నారు కానీ ద్రవ్యలోపంవల్ల చెయ్యలేకపోయినట్లు తెలుసుకున్నారు.  ఆయన వాళ్ళతో ప్రతి ఏడూ తెగుతున్న చెరువుకట్టని రక్షించి మిమ్మల్ని ఆదుకోని దేవుడికోసం డబ్బు ఖర్చుపెట్టేబదులు, ఆ డబ్బు చెరువుకట్ట మరమ్మత్తుకుపయోగించవచ్చుగా అని అన్నాడు.  వారు తమ దేవుడిమీద  అచంచల విశ్వాసంతో, నిర్మల మనసుతో ప్రార్ధిస్తే తమ కోర్కె నెరవేరుతుందన్నారు.  అప్పుడు ప్లేస్ నేను మీ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.  నేను చెరువుకట్ట పునర్మిర్మిస్తున్నా.  ఈ ఏడాది వర్షాలకి ఆ కట్ట తెగకుండావుంటే మీ అమ్మవారికి నేను గుడి నిర్మిస్తానన్నాడు.

 

ప్రతి సంవత్సరంకన్నా ఆ సంవత్సరం ఇంకా ఎక్కువగా వర్షాలు వచ్చాయి.  ఏ క్షణమైనా కట్ట తెగవచ్చని తెలుసుకున్న ప్లేస్ మధురాంతకంవచ్చి అక్కడే విడిదిచేశాడు.  రెండు రోజులు విపరీతమైన కుంభవృష్టితో ఎవరూ బయటకిరాలేదు.  మూడోరోజు రాత్రి వర్షం తగ్గుముఖం పట్టటంతో తోటి ఉద్యోగస్తులతో చెరువుకట్టని తనిఖీ చెయ్యటానికి వెళ్ళాడు ప్లేస్.  చెరువుకట్ట తెగి, వరదలతో భీభత్సంగా వున్న దృశ్యం చూస్తాననుకుని వెళ్ళిన ప్లేస్ అక్కడ ఒక అద్భుత దృశ్యం చూశాడు. 

 

అక్కడ ఆయనకి ధనుర్ధారులైన రామ లక్ష్మణుల దర్శనం లభించింది.  కోదండరాముడు తన బాణాలతో చెరువుకి పడ్డ గండిని పూడుస్తూ కనిపించాడు.  ఆ మహాద్భుత దృశ్యం చూసిన ప్లేస్ మోకాళ్ళమీద కూలబడి ప్రార్ధనలు చేశాడు.  ఆయన ఆనుచరులు, అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం బాగుండక అలా కూలబడ్డారని తలచి సహాయం చెయ్యటానికి వెళ్ళారు.  ఆయన రామ లక్ష్మణులను చూసిన ఆనందంతో ఆ దృశ్యం వాళ్ళకీ చూపించబోయాడు.  కానీ ఆ ఆదృష్టం అందరికీ కలుగలేదు.  రామ లక్ష్మణుల దర్శనం అయిన ప్లేస్ అదృష్టవంతుడు.  ప్లేస్ తన వాగ్దానం ప్రకారం స్వ పర్యవేక్షణలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు.   దీనికి గుర్తుగా ఆ వూరి ప్రజల చేత శిలమీద చెక్కించబడ్డ ఈ గాధ తమిళ, తెలుగు భాషలలో ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తుంది.

 

ఈ ప్రసిధ్ధ ఆలయంలో శ్రీ రామనవమికి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి.  జూన్, జూలై నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆలయాన్ని చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలు వున్నాయి.  దర్శన సమయాలు ఉదయం 7-30నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4-30 నుండి రాత్రి 8-30 వరకు.                          

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)