శివుని ఉగ్ర స్వరూపం వీరభద్రుడు
శివుని ఉగ్ర స్వరూపం వీరభద్రుడు
మన దేశంలో చాలాచోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలామంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామదేవత అనుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఈయనను పరమశివుని కుమారునిగా భావిస్తారు. ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు? శివునితో ఈయనకు ఉన్న అనుబంధం ఏమిటి?
దక్షయజ్ఞం
శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్షయజ్ఞాన్ని తలుచుకోవలసిందే! దక్షునికి మొదటినుంచీ పరమేశ్వరుని పొడ గిట్టేది కాదు. కానీ ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది. ఆమెను శివునికి తప్ప వేరెవ్వరికైనా కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు, శివుని తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు. కానీ అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి, తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి. ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలకించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది.
ఘోర అవమానం
శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ, అతనని ఎలాగైనా అవమానించాలన్న సంకత్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి సమస్త దేవతలనూ ఆహ్వానించాడు- ఒక్క శివుని తప్ప! శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు. కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగవైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలుపంచుకోవాలన్న కోరిక కలిగింది. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది. అక్కడ శివుడు ఊహించిందే జరిగింది. దక్షుడు శివుని అనరాని మాటలూ అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది.
వీరభద్రుని అవతారం
సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి. దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించిడమే ఆలస్యం... ప్రమథగణాలతో కలిసి వారిరువురూ విధ్వంసాన్ని సృష్టించారు.
దక్షుని రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతాఇంతా కాదు. అడ్డువచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది. చంద్రుడు, అగ్ని, పూషుడు... ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రడు, నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ ఆ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆశ్చర్యం! వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షుని మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
ఇదీ వీరభద్రుని విజయగాథ! శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ, దక్షిణభారతంలో మాత్రం గ్రామగ్రామానా ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. కోరిన వరాలను తీర్చే కల్పతరువుగా, అడ్డంకులను తొలగించే నాథునిగా, నిరాడంబరమైన పూజకు లొంగిపోయే భోళా శంకరునిగా... భక్తుల మనసుని నిలిచి ఉంటాడు.
- నిర్జర.