శివునికి బిల్వదళం అంటే ఎందుకంత ఇష్టం!

 

శివునికి బిల్వదళం అంటే ఎందుకంత ఇష్టం!

 

 

కార్తీకమాసం అంటే శివారాధన గుర్తుకి వస్తుంది. శివునికి ఇష్టమైన మారేడు దళంతో శివారాధన సంపూర్ణమవుతుంది. మూడు కొసలుగా చీలిన బిల్వపత్రాన్ని చూడగానే శివుని త్రిశూలమూ, త్రినేత్రమూ గుర్తుకువస్తాయి. యజ్ఞయాగాలతోనూ, కన్యాదానాలతోనూ సమానమైన బిల్వార్చన చేస్తే మూడు జన్మలలోనూ చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయంటుంది బిల్వాష్టకం. శివునికి అంత ప్రీతికరమైనది కాబట్టే బిల్వవృక్షం శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తుంది.


తెలుగులో మారేడుగా పిలుచుకునే బిల్వవృక్షం మన దేశంలోనే ఆవిర్భవించిందని చెబుతారు. ఇప్పటికీ మారేడు చెట్లు దక్షిణాసియాలోనే విరివిగా పెరుగుతాయి. కరువుకాటకాలనీ, ఉష్ణోగ్రతలలోని విపరీతమైన మార్పులునీ తట్టుకుని మొండిగా ఎదగడం మారేడు ప్రత్యేకత. అలా శివతత్వంలోని నిశ్చలత్వం మారేడు జీవితంలోనూ కనిపిస్తుంది. చెట్టు నుంచి కోసిన తరువాత కూడా దాదాపు వారం రోజులవరకూ ఈ దళాలు పాడవకుండా ఉంటాయి. శివలింగం సన్నిధి చెంత ఉండే ఈ బిల్వదళాలు  గర్భాలయాన్ని పరిమళభరితం చేయడమే కాకుండా తమ ఔషధి తత్వాలతో భక్తులకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి.  


ఆయుర్వేదపరంగా మారేడు ఒక గొప్ప ఔషధం. శరీర దుర్వాసన వంటి సాధారణ వ్యాధులు మొదలుకొని మొలలు వంటి తీవ్ర సమస్యల వరకు మారేడుని వైద్యులు సూచిస్తారు. ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులలో మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. అతిసారాన్ని కలిగించే రోటావైరస్ వంటి క్రిములను మారేడు సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇక చక్కర వ్యాధిని నియంత్రించే గుణం కూడా దీనికి ఉంది. బహుశా అందుకేనేమో మారేడుకి `అతిమంగల్యము, మహాఫలము, మృత్యువంచనము` వంటి పర్యాయపదాలు ఉన్నాయి.


మారేడు కేవలం శివునికే కాదు, సకల దేవతలకూ ప్రీతికరమే! మారేడుని సాక్షాత్తు లక్ష్మీదేవి సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే మారేడు కాయకు శ్రీఫలం అని కూడ పేరు! శ్రీఫలాన్ని పూజాగదిలో ఉంచుకుంటే సకల ఐశ్వర్యాలూ కలుగుతాయని కొందరి నమ్మకం. ఇక వినాయక చవితి రోజున జరిగే పూజలో `ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి!` అంటూ బిల్వదళంతో ఆ లంబోదరుని కొలుచుకుంటాము. అలా భక్తులకూ, దేవతలకూ కూడా ఇష్టమైన మారేడు దళాలతో… ఈ కార్తీకమాసాన శివపూజలు నిర్విఘ్నంగా సాగుతాయి.

 

- నిర్జర.