పూరీ జగన్నాథ రథ యాత్ర
పూరీ జగన్నాథ రథ యాత్ర
జగన్నాధ ఆలయాన్ని శ్రీక్షేత్రం, శంఖు క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రమని పిలుస్తారు. సింహద్వారానికి ఇరువైపులా రాజసం ఉట్టిపడే రెండు రాతి సింహాలు, వాటి ముందు ఏక శిలతో చెక్కిన అరుణస్తంబం కనిపిస్తాయి. మొదట్లో ఈ స్తంబం కోణార్క్ లోని సూర్య దేవాలయంలో ఉండేందట. ఖుర్దా దేశపు రాజు దీన్ని ఈ ఆలయానికి తరలించాడట. ముఖ ద్వారానికి కుడి పక్క జగన్నాథుని చిత్రపటం వుంటుంది. దీన్ని ' పతితపావన' అంటారట. 37,000 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుత వాస్తుకట్టడం జగన్నాథుని ఆలయం. 214 అడుగుల 8 అంగుళాల ఎత్తున ప్రస్తుత ఆలయాన్ని అనంతవర్మ చోడగంగదేవ కళింగ శైలిలో పాంచరాత్రాగమ విధానంలో నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవదేవుడిని ఓ రాజకుటుంబీకుడిదిగా భావించి అయనకు కావలసిన గుర్రాలు, నగలు, దుస్తులు ఇలా సకల సదుపాయాలన్నీ అక్కడే వుండేలా ఓ రాజకోటలా ఈ ఆలయాన్ని నిర్మించారు.అంతకుముందు ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నమహారాజు కట్టించాడట. ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదితీరాన ఓ కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమని అజ్ఞాపించాడట.
కానీ దాన్ని మలచడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వచ్చి తాను మలుస్తానని చెప్పాడట. అయితే తాను తలుపులు మూసుకుని విగ్రహాలు చెక్కే సమయంలో ఎవరు రాకుడదని షరతు విధించాడట. ఉత్సుకత ఆపుకోలేని రాజు పదిహేనోరోజున తలుపులు తెరపించడంతో అయన వాటిని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడట. దాంతో అలాగే ప్రతిష్టించారన్నది స్థలపురాణం. గోపురాలతో పెద్ద మండపాలతో దాదాపు 120 గుళ్ళు ప్రాంగణంలో ఉన్నాయి. ప్రధాన ఆలయంతో పాటు జగమోహన, భోగ నాట్యమండపాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణానికి చిట్టచివరిలో 65 మీటర్ల ఎత్తైన రాతి కట్టడంపై గుండ్రని ఆకారంలో నిర్మించిన ప్రధాన ఆలయశిఖరం మెరుస్తూ కనిపించింది. ఇందులోకి వెళ్ళాలంటే 22 మెట్లు ఎక్కాలి. ఆ మార్గాన్ని 'బైసిపహబా' అంటారట.
బలభద్ర, సుబద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటికి తీసుకు వచ్చి భక్తులకి కనువిందు చేస్తారు. ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాడ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్యశిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 ఖండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.
ఆషాడ శుద్ధ పాడ్యమి నాటికి రథనిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని 'నందిఘోష' అంటారు. 45 అడుగుల ఎత్తైన ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెంటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపువస్త్రంతో 'నందిఘోష'ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని 'తాళధ్వజం' అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పధ్నాలుగు చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం ''పద్మధ్వజం అంటారు. దీని ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో 'పద్మధ్వజా'న్ని అలంకరిస్తారు. ప్రతి రథానికీ 250 అడుగుల పొడవూ, ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్ళను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా నిలబెడతారు.
విదియనాడు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళిన పండాలు (పూజారులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే 'మనిమా (జగన్నాథా) ' అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయప్రాంగణంలోని 'ఆనందబజారు', 'అరుణస్తంభం' మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే 'జై బాలరామా, జైజై బలదేవా' అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్టింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. తరువాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం రథం మీద ప్రతిష్టిస్తారు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వస్తుండగా 'జయహో జగన్నాథా' అంటూ భక్తులు జయజయద్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను 'పహాండీ' అంటారు. కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడిని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని 'దైత్యులు' అంటారు.వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని 'నీలమాధవుడి' రూపంలో అర్చించిన 'సవరతెగ' రాజు 'విశ్వావసు' వారసులు, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాలమీద ప్రతిష్టింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా, పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను 'చెరా పహారా' అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరీ కళ్ళాపిజల్లి హారతిచ్చి 'జై జగన్నాథా' అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్ళను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ (ప్రధాన మార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే 'ఘోష యాత్ర' అంటారు.
ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాదుడి గుడి నుంచి మూడుమైళ్ళ దూరంలో ఉండే 'గుండీచా' గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటలు పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి రథాల్లోని మూలవిరాట్లకు బయటే విశ్రాంతిని ఇస్తారు. మర్నాడు ఉదయం మేలతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమిరోజున తిరుగుప్రయాణం మొదలవుతుంది. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు. ఆరోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి రోజున స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్నే 'సునావేష'గా వ్యవహరిస్తారు. ద్వాదశిరోజున విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే.