లక్ష్మీదేవికి అంకితం – ఈ ధనత్రయోదశి!

 

లక్ష్మీదేవికి అంకితం – ఈ ధనత్రయోదశి!

 

 

మనుషులకు భౌతికమైన సుఖాలను అందించేంది సంపద. సంపద అనగానే తరగనంత ధనం అనుకుంటారు. కానీ, కనీస అవసరాలకు లోటు లేకుండా ఉండటం కూడా సంపదే! అందుకే సంపదకు భాగ్యం అన్న పర్యాయపదం కూడా ఉంది. అలాంటి సంపదను మనకు నిరంతరాయంగా ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి. ఆ తల్లిన కొలుచుకునే రోజు ఈనాటి `ధనత్రయోదశి`!

దీపావళికి ముందు వచ్చే త్రయోదశి తిథినాడు వస్తుంది కాబట్టి ఈ పండుగను ధనత్రయోదశి అని కానీ ధన్‌తేరస్‌ అని కానీ అంటారు. ఒకరకంగా దీపావళి పండుగ ధనత్రయోదశితోనే మొదలవుతుంది. క్షీరసాగరమధనంలో లక్ష్మీదేవి ఈరోజే ఆవిర్భవించిందని ఒక నమ్మిక. అందుకనే కొందరు లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన ఆభరణాలను ఈ రోజు పాలతో కడుగుతారు. ఇక ఈ రోజున వెండి, బంగారు వస్తువులు తీసుకుంటే శుభమన్న ప్రచారం కూడా ఒకటి మొదలైంది. కానీ తప్పనిసరిగా వస్తువులు తీసుకోవాలని కానీ, ఇంత మొత్తంలో తీసుకోవాలని కానీ శాస్త్రంలో ఎక్కడా లేదు. ఏదన్నా విలువైన వస్తువు కొనుక్కునే ఆసక్తి, స్తోమత ఉన్నవారికి ఇది శుభప్రదమైన రోజు మాత్రమే!

ధనత్రయోదశికి సంబంధించిన మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిషులు, అతను వివాహం జరిగిన నాలుగో రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడని తేల్చి చెప్పారట. యుక్తవయసు వచ్చిన తరువాత అతని వివాహం జరగనే జరిగింది! కొత్తగా అత్తవారింట్లోకి అడుగుపెట్టిన పెళ్లికూతరు, ఈ వార్తని విని అవాక్కైపోయింది. తన భర్తను ఎలా దక్కించుకోవాలో ఆమెకు పాలుపోలేదు. చివరికి ఆ నాలుగో రోజు రానేవచ్చింది. ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలనుకుంది ఆ పెళ్లికూతురు. తనతో పాటు తెచ్చుకున్న రాశుల కొద్దీ ఆభరణాలను తమ కోట గుమ్మం ముందు రాశులుగా పోసింది. అటుపై కోటలోనివారందరినీ పోగేసి వారందరినీ ఏవో కథలు చెబుతూ మెలకువగా ఉంచింది. రాజకుమారుడికి మృత్యుఘడియలు రానేవచ్చాయి. యముడు, పామురూపంలో కోటలోకి ప్రవేశించేందుకు బయల్దేరాడు. కానీ గుమ్మం దగ్గర ఉన్న బంగారు కాంతులను చూసేసరికి అతని కళ్లు బైర్లుకమ్మిపోయాయి. ఎలాగొలా ఆ గుట్ట దిగివెళ్దామని చూస్తే అంతా మెలకువగా కనిపించారు. ఇక చేసేదేమీ లేక వెనుదిరిగాడు యముడు. సమయస్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదుర్కోవచ్చన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది.

ఉత్తరాదిన ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు. ఈ రోజున తమ ఇంటిని చూసేందుకు సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి వస్తుందని వారి నమ్మకం. అందుకనే ఇళ్లను శుచిగా, శుభ్రంగా ఉంచుకుంటారు. ఆ దేవిని ఆహ్వానిస్తూ సాయంవేళ ఇంటి ముందర రంగురంగుల ముగ్గులను వేస్తారు. దీపాలను వెలిగించి ఆమెకు దారి చూపుతారు. ఇక ఆమెను స్తుతించి, పూజించి, ఆరతులిచ్చి తమ ఇంట్లో శాశ్వతంగా నిలిచిపొమ్మని వేడుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని మనసారా వేడుకున్నవారికి దారిద్ర్యమనేదే ఉండదని భక్తుల నమ్మకం!

- నిర్జర.