ఇంతకీ ఈ ఖండోబా ఎవరు!

 

 

ఇంతకీ ఈ ఖండోబా ఎవరు!

 


బాబా సచ్చరిత్ర చదివిన వారందరికీ అందులో ఖండోబా ఆలయం ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అసలు బాబా షిరిడీలోకి ప్రవేశించే ఘట్టమే ఖండోబా ఆలయంతో మొదలవుతుంది. అందుకే షిరిడీకి వెళ్లినవారంతా పనిలోపనిగా ఖండోబాని దర్శించుకుని వస్తుంటారు. కానీ ఈ ఖండోబా ఎవరు అన్న స్పష్టత చాలా తక్కువమందికే ఉంటుంది. మహారాష్ట్రుల జీవితాల్లో ఖండోబా పాత్రని గుర్తిస్తే ఇదే ఖండోబాకు మరోమారు శిరసు వంచి నమస్కరించాలని అనిపిస్తుంది.

 

ఖండోబా అంటే!

ఖండోబా అంటే దుష్టులను ఖండించే తండ్రి అన్న అర్థం వస్తుంది. ఆ పేరుని సార్థకం చేసేలా ఒక చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు మల్లా, మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ ప్రసాదితమైన వరాలతో లోకాలను పట్టిపీడించసాగారట. వారి నుంచి కాపాడమంటూ దేవతలంతా బ్రహ్మ, విష్ణువులకు మొక్కినా లాభం లేకపోవడంతో చివరికి శివుని చెంతకు చేరారట. దేవతల ఆర్తనాదాలను విన్న పరమేశ్వరుడు, మార్తాండ భైరవునిగా రూపుదాల్చి ఆ ఇద్దరు రాక్షసులనీ ఖండించాడట. అలా శివుడు, ఖండోబాగా మారాడు.

 

వేయేళ్ల దైవం

కర్ణాటక, మహారాష్ట్ర సాహిత్యంలో ఈ ఖండోబా ప్రస్తావన దాదాపు వేయి సంవత్సరాలుగా కనిపిస్తూనే ఉంది. ఇక 15 శతాబ్దికి వచ్చేసరికి ఖండోబా ఆరాధన ఎంత విస్త్రృతంగా ప్రచారం పొందిందంటే... మహారాష్ట్రలో చాలామంది శివుని, ఖండోబా రూపంలోనే పూజిస్తుంటారు. ఇక చాలామందికి ఖండోబా కులదైవం కూడా. శివుని అవతారం, సూర్యుని తేజం కలిసిన దైవం ఖండోబా అని కూడా కొందరి నమ్మకం. ఇక శివుని కుమారుడైన కార్తికేయుడే ఖండోబా అని భావించేవారూ లేకపోలేదు.

 

ఐదుగురు భార్యలు!

ఖండోబాకు ఒకరు, ఇద్దరు కాదు ఐదుగురు భార్యలు. అయితే వారిలో ఒకొక్కరూ ఒకో జాతికి చెందినవారు. వారిలో ఒక భార్య ముస్లిం అని కూడా నమ్ముతారు. ఖండోబా ఇలా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారనే నమ్మిక... ఆయనను అన్ని వర్గాలకూ చేరువ చేసింది. జాతి పట్టింపులేమీ లేకుండా అందరూ ఆయనను తమవానిగా భావించేవారు. కొందరు ముస్లింలు సైతం ఆయనను ఆరాధించేవారు. అయితే ఖండోబా తొలి ఇద్దరు భార్యలు ఆయనతో పాటుగా గుళ్లలో కనిపిస్తూ ఉంటారు. వారే మాల్సా, బనాయి. వీరిరువురూ పార్వతీదేవి, గంగమ్మతల్లికి ప్రతిరూపాలు అని భక్తుల విశ్వాసం. ఖండోబా గురించి ఉన్న జానపద సాహిత్యంలో ఆయన వారిని వివాహం చేసుకోవడం కోసం దారితీసిన ప్రేమాయణాలు, సవతుల మధ్య సాగే జగడాలు ముఖ్య ఘట్టాలుగా కనిపిస్తాయి.

 

తెలుగునాట!

తెలుగువారు మల్లన్నగా కొలుచుకునే దైవమే ఖండోబా అని భావించేవారు లేకపోలేదు. మల్ల అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మల్లన్న అయ్యాడని ఒక భావన. అందుకే కొమురవెల్లిలో వెలిసిన దైవాన్ని తెలుగువారు మల్లన్నగా కొలుచుకుంటే మహారాష్ట్రీయులు ఖండోబాగా భావిస్తారు. ఎవరు ఎలా కొలుచుకున్నా ఖండోబా, భక్తుల పాలిట భోళా శంకరుడే అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. చిటికెడు పసుకుకీ, కాసిని శాకాలకీ, కొన్ని బొబ్బట్లకీ (పూరణ్‌ పోలి) సంతసించి... సంకల్పాలను సిద్ధింపచేస్తాడనటంలో మరోమాట రాదు.

 

మహారాష్ట్రలో ఊరూరా ఈ ఖండోబా ఆలయాలు ఉన్నప్పటికీ పూణేకు సమీపాన ఉన్న జేజురి అనే ప్రాంతంలో ఉన్న ఖండోబాకు ప్రాచుర్యం ఎక్కువ. జేజురి రాజధానిగా ఆయన ప్రపంచాన్ని పాలించేవాడనీ, అక్కడే ఆయన తన ఇద్దరు భార్యలతో కలిసి ఉండేవాడనీ ఐతిహ్యం. ఇక కర్ణాటకలోనూ ‘మైలారా’ పేరుతోనూ ఖండోబా ఎన్నో దేవాలయాలలో పూజలందుకుంటున్నాడు.

 

- నిర్జర.