కావేరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి

 

 

కావేరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి!


కావేరి అనగానే తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న నదీజలాల వివాదమే గుర్తుకువస్తుంది. కానీ వేల సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలకు అతీతంగా గుంభనంగా సాగిపోతోంది ఆ నదీమతల్లి. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆ కావేరికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సందర్భంగా కావేరి గురించి కొన్ని విశేషాలు…

 

మన దేశంలోని ముఖ్య నదులన్నింటి జననం వెనుకా ఏదో ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాగే కావేరీనదికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వం కావేరుడనే రుషి ఉండేవాడట. తనకు సంతానం లేకపోవడంతో... ఒక కుమార్తెని అందించమంటూ ఆయన బ్రహ్మను వేడుకున్నాడు. అంతట బ్రహ్మ తన దగ్గర ఉన్న లోపాముద్ర అనే బాలికను, కావేరునికి అందించాడు. కావేరుడు పెంచుకున్నాడు కనుక లోపాముద్రని కావేరిగా పిలవసాగారు.

 

యుక్తవయసు రాగానే కావేరిని అగస్త్య మహామునికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహసమయంలో కావేరి ఒక షరతుని విధించింది. అగస్త్యుడు తనని ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉంటే... తన దారిని తను చూసుకుంటానన్నదే ఆ షరతు. అగస్త్యుడు చాలాకాలం ఆ షరతుకి లోబడే ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తన శిష్యులకి ఏదో బోధిస్తూ కాలాన్ని గమనించుకోలేదు. కాలాతీతం కావడంతో కావేరి అలిగి నదిగా మారిపోయింది.

 

మరో గాథ ప్రకారం కావేరిని అగస్త్యుడు తన కమండలంలో బంధించి ఉంచుతాడు. ఒకరోజు కమండంలో నుంచి కావేరి అరుపులను విన్న వినాయకుడు ఆమెను విడిపించాలని అనుకున్నాడు. అందుకోసం గణేశుడు ఒక కాకి రూపాన్ని ధరించి ఆ కమండలాన్ని ఒంపేశాడు. దాంతో అందులో ఉన్న కావేరి జలరూపంగా బయటకు రాగలిగింది. అప్పటి నుంచి కావేరి జలరూపంలో ప్రవహిస్తోందని నమ్ముతారు.

 

గాథలు ఏవైనా కావేరి నది దక్షిణభారతీయుల పాలిట దాహార్తిని తీర్చే దేవతే! కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలలో ప్రవహిస్తూ కొన్ని లక్షల ఎకరాల పొలాలను సాగునీటిని అందిస్తోంది. వందేళ్ల క్రితం కావేరి మీద నిర్మించిన ‘కృష్ణరాజసాగర్ డ్యాం’ పుణ్యమా అని కర్ణాటక కరువుకి దూరంగా ఉంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా కావేరి నదీ జలాలతో విద్యుత్తుని ఉత్పత్తి చేశారు.

 

కావేరి నదీజలాల విషయాన్ని అలా ఉంచితే, ధార్మికంగా కూడా కావేరి తీరం యావత్తూ పుణ్యక్షేత్రాలకు ఆలవాలంగా తోస్తుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల మీద ఈ కావేరి నది ఉద్భవిస్తుంది. కావేరి జన్మించిన ఆ స్థానంలో నదీస్నానం ఆచరించేందుకు వేలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఈ ప్రాంతాన్ని తలకావేరి అని పిలుస్తారు. తలకావేరితో పాటుగా శ్రీరంగం, తిరుచిరాపల్లి, కుంబకోణం, తిరువాయూరులాంటి అనేక క్షేత్రాలు కావేరి తీరాన ఉన్నాయి.

 

కావేరి నది తమిళనాడులోని పూంపుహార్‌ పట్నం దగ్గర బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈ పట్నాన్ని ‘కావేరి పూంపట్టినం’ అని పిలిచేవారు. ఇది చోళుల రాజధానిగా ఉండేది. చోళులకి కావేరీ నది అంటే చాలా ఇష్టంగా ఉండేదేమో! అందుకనే చోళుల కాలంలో కావేరీ తీరం పొడవునా దాదాపు 300 ఆలయాలను నిర్మించారట. ఇవే కాకుండా ‘పంచరంగ క్షేత్రాలు’ పేరుతో కావేరి తీరాన రంగనాథస్వామి పేరిట ఐదు ఆలయాలు వెలిశాయి. మనకి పంచారామాలు ఎలాగో తమిళవాసులకు పంచరంగ క్షేత్రాలు అలాగన్నమాట. వీటిలోని శ్రీరంగం గురించి అందరికీ తెలిసిందే!

 

మన దేశంలోని ప్రముఖ నదులలలో ఒకటైనందుకున కావేరికి కూడా పుష్కరాలు వస్తాయి. సూర్యడు తులారాశిలోకి ప్రవేశించే ఏడాది ఈ పుష్కరాలను నిర్వహిస్తారు. అలా ఈ ఏడాది సెప్టెంబరు 12న కావేరి పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా- భౌతికంగానూ, ధార్మికంగానూ తమకి దారిచూపుతున్న కావేరి తల్లిని ఆలింగనం చేసుకునేందుకు దక్షిణభారతీయులు సిద్ధపడుతున్నారు.

- నిర్జర.