కాశీ యాత్ర – 7
కాశీ యాత్ర – 7
కాశీలో చెయ్యవలసిన, చెయ్యకూడని పనులు
మరి ఇంత మహిమాన్వితమైన కాశీ పట్టణంలో మనం చెయ్యవలసినవి చెయ్య కూడనివి కూడా కొన్ని పనులున్నాయి. అవేమిటో కూడా తెలుసుకుందాము.
కాశీలో ఈ పనులు తప్పక చెయ్యండి..
మహా సంకల్పంతో గంగా స్నానం .. ఇది కాశీ యాత్ర చేస్తున్న అందరూ చెయ్యదగ్గది. గంగలో నీరు అంత స్వఛ్ఛంగా లేకపోతే పడవలో కొంత దూరం లోపలకి ఇసుక దిబ్బలదాకా తీసుకు వెళ్తారు. అక్కడ నీళ్ళు కొంత బాగుంటాయి.
తండ్రి లేనివారు పితృ కర్మలు, దానములు, చెయ్యండి. దీనికోసం స్వర్గస్తులైన తమ దగ్గర బంధువుల పేర్లు, గోత్రాలు ఒక కాగితం మీద రాసి తీసుకు వెళ్ళటం మంచిది.
అస్తి నిమజ్జనం .. చనిపోయినవారి అస్తికలు ప్రయాగలోని త్రివేణీ సంగమంలో, కాశీ గంగలో నిమజ్జనం చేయటం ఆచారం. దీనివలన గంగలో అస్తికలు ఎన్ని సంవత్సరాలు వుంటాయో ఆ జీవులు అన్ని వేల సంవత్సరాలు స్వర్గ లోకంలో నివాసం వుంటారని నమ్మకం.
పంచ తీర్ధ స్నానము .. దీనికి పొద్దున్న 9 గం.ల ప్రాంతంలో బయల్దేరి ఒక పడవ మాట్లాడుకుని అసీ ఘాట్, కేదార ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగా ఘాట్ లలో స్నానాలు ముగించుకుని, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12 గం.లకు మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యండి. ప్రతి రోజూ మధ్యాహ్న 12 గం. లకు విశ్వనాధుడు, సమస్త దేవతలు స్నానం చేయటానికి మణికర్ణికకు చేరుకుంటారని పురాణ పచనం. అందుకే ఆ సమయంలో మణికర్ణికలో చేసే స్నానం బహు పుణ్యప్రదం అంటారు. మణికర్ణిక ఘాట్ లో స్నానం చేశాక పైన గట్టుమీద వున్న చక్రతీర్ధంలో స్నానం చేసి, తిరిగి మణికర్ణికలో చేయాలంటారు.
కాశీలో వున్నన్ని రోజులూ వీలయినన్ని దేవాలయాల దర్శనం, గంగా స్నానం చెయ్యండి. కాశీ విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు గంగానదినుంచి నీరు, విభూతి, పాలు మొదలగు అభిషేక, పూజా ద్రవ్యాలు దోవలో అమ్ముతారు .. తీసుకు వెళ్ళి మీ చేతులతో మీరే స్వయంగా స్వామికి సమర్పించండి. కాశీలాంటి పుణ్య క్షేత్రాలలో చేసే దానాలు అనేక రెట్ల ఎక్కువ ఫలితాలనిస్తాయంటారు. కనుక వీలయినంత దానం చేయండి. వాటికి కావలసిన చిల్లర కూడా వెంట తీసుకు వెళ్ళండి.
విశ్వనాధ దర్శనానికి వెళ్ళే దారిలో ముందు సాక్షి గణపతిని దర్శించాలి. మరి ఆయనేగా మనం కాశీ వచ్చినట్లు సాక్ష్యం చెప్పేది. తర్వాత డుంఢి గణపతిని, ఆ తర్వాత విశ్వనాధ మందిర ద్వారం ముందు వున్న కాలభైరవుడిని దర్శించాలి. తర్వాత విశ్వనాధుని వెనుక వున్న ముక్తి మండపం, జ్ఞానవాపి బావి తప్పక దర్శించండి.
ఇక్కడ అనేక ఆలయాలు. ముఖ్యమైనవి ముందు చూడండి. తర్వాత అవకాశంబట్టి మిగతావి చూడండి.ఏ దేవతా దర్శనం చేసినా రోడ్డుమీద చికాకులతో మనసు పాడు చేసుకోకుండా, మీరు వచ్చినది కాశీ యాత్రకి అనే ఒక్క విషయం గుర్తు పెట్టుకుని ప్రశాంతంగా దర్శించుకోండి.
అన్నింటికన్నా ముఖ్యం. అడుగడుగునా కాళ్ళకి అడ్డంపడే బట్టల వ్యాపారస్తుల దళారులను తప్పించుకోవటానికి సిధ్ధం అయి వెళ్ళండి. ఒకసారి ఆ మాయలో పడితే మీరు కాశీ వెళ్ళింది బట్టల మూట తెచ్చుకోవటానికే అన్నట్లుంటుంది.
సంకల్పం చెప్పటానికి బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే చింతించవద్దు. సంకల్పం ఒక కాగితం మీద రాసుకు వెళ్ళి మీరే చెప్పుకోండి.
మరి చెయ్యకూడని పనులు కూడా వున్నాయి. అవ్వేమిటో తెలుసుకుందామా..గంగా నదికి, దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకండి. ఒక వేళ వేసుకెళ్తే గంగానది ఒడ్డున మెట్లపైనే వదిలెయ్యండి. చాలామంది క్షేత్రమంతా పుణ్యక్షేత్రమని చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఆరోగ్యరీత్యా కొంతమందికి తప్పదుమరి.
గంగాస్నానం చేసేటప్పుడు సబ్బులు షాంపూలు వాడద్దు. గంగలో వున్న మట్టితో ఒళ్ళు రుద్దుకోవచ్చు. గంగలో పళ్ళుతోముకోవద్దు. తడి జుట్టు విదిలించవద్దు. ఆనీరు వేరేవారిమీద పడటం మంచిదికాదు. తడి బట్టలు ఒడ్డుకి వచ్చి జాగ్రత్తగా, నీళ్ళు ఎవరిమీదా పడకుండా పిండుకోండి.
కాశీ హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. సాక్షాత్తూ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణా దేవుల నివాస స్ధలం. శక్తి స్వరూపిణి అయిన విశాలాక్షి వెలసిన శక్తి పీఠం. అంతే కాదు. సకల దేవతల నివాస స్ధలం. పూర్వం అత్యంత శోభాయమానంగా వెలుగొందిన ఈ క్షేత్రం కాలగతిలో, అనేక ముష్కరుల దండయాత్రల పాల్పడటంవల్ల ధ్వంసమయింది. ఇప్పటి కాశీ ఇరుకు సందులు, వాటిలోనే తిరుగాడే పశువులు, వాటి పేడలు, అడుగడుగునా అడ్డుపడే దళారులతో మన ఓపికని పరీక్షిస్తూవుంటుంది. వాటిని తప్పుకుపొండి కానీ విమర్శించవద్దు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే కాశీ సకల దేవతల ఆవాసం. మన దేవతల ఆవాసాన్ని మనం విమర్శించకూడదుకదా. అయితే యాత్రీకులకు సౌకర్యాలు కల్పించటానికి అక్కడివారు శ్రధ్ధ తీసుకోవాలి.
కాశీనుంచి గంగ తెచ్చుకోకూడదు. ప్రయాగలోని త్రివేణీ సంగమంనుంచి మాత్రమే గంగని ఇంటికి తీసుకు వెళ్ళాలి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)