కాశీ కబుర్లు - 23 ప్రయాగలో దర్శనీయ స్ధలాలు-3

 

కాశీ కబుర్లు - 23 ప్రయాగలో దర్శనీయ స్ధలాలు-3

 

బడా హనుమాన్ మందిర్: పాతాళపుర మందిర్ నుంచి దానికి అతి సమీపంలో వున్న బడా హనుమాన్ మందిర్ కి వెళ్ళాము.  ఇక్కడ ఆంజనేయస్వామి అతి పెద్ద విగ్రహం.  నేలమీద పడుకున్నట్లు వుంటుంది.    ఈ విగ్రహం మొగలు చక్రవర్తి అక్బరు సమయంలో స్ధాపించబడినదని కొందరంటే, కొందరు  పూర్వం ఒక శైవ భక్తుని కలలో విగ్రహం ఇక్కడవున్నట్లు కనబడటంతో దానిని కనుగొని ఆలయం కట్టించారని అంటారు.  ఏది ఏమైనా ఈ ఆలయం చాలా పురాతనమైనది.  ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా పెద్దది.

ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకోబెట్టినట్లు వుంటుంది.  ఇదివరకు ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని (ముస్లింలని కొందరు, బ్రిటిష్ వారని కొందరు అంటారు) ప్రయత్నించారుట.  విగ్రహాన్ని తవ్వటానికి ప్రయత్నించినకొద్దీ భూమిలో ఇంకా గుంటలాగా ఏర్పడి విగ్రహం ఇంకా స్ధిరంగా కాసాగింది.  అందుకని అలాగే వదిలేశారు.  ఇప్పుడు విగ్రహం గుంటలో వున్నట్లు వుంటుంది.  చుట్టూ కట్టిన ప్లాట్ ఫారమ్ మీదనుంచి భక్తులు స్వామిని దర్శించి అర్చిస్తారు.  కొందరు గంగనీరు తీసుకు వెళ్ళి పోస్తున్నారు, అలాగే పూవులు వగైరాలను సమర్పిస్తున్నారు.

ఇంకొక విశేషమేమిటంటే వర్షాకాలంలో గంగానదికి వరదలొచ్చినప్పుడు గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందిట.   చూసేవాళ్ళకి ఆంజనేయస్వామి గంగానదిలో స్నానం చేస్తున్నట్లు వుంటుంది.

ఆలయంలో అక్కడి మహంత్ అనుమతితో ఫోటో తీసుకోవచ్చని బోర్డు చూసి ప్రయత్నించాను.  మహంత్ ఆఫీసులో లేరు.  వేరే ఒకాయన అక్కడ చరిత్ర ఏదో చెప్పారు కానీ నా కర్ధమయింది ఆంజనేయ స్వామి యుధ్ధానంతరం ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు, అందుకనే విగ్రహం అలా పడుకున్నట్లుంటుంది అని.   అడిగిన వెంటనే ఫోటోకి అనుమతి ఇవ్వక పోయినా ఆయనకి తెలిసిన విషయాలు చెప్పారు..అర్ధం చేసుకోలేక పోవటం నా దురదృష్టం.  ఆయనకి ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము చూడవలసినవి ఇంకా చాలా వున్నాయిగా మరి.

 

       

 


శంకర విమాన మండపం: బడే హనుమాన్ మందిర్ నుంచి శంకర విమాన మండపం లేదా శంకర మఠం  వెళ్ళాం.  చాలా దగ్గరలోనే వుంది.  ఈ విమాన మండపం ఇక్కడ నిర్మింపబడటానికి కారణం ఒక కధ చెప్తారు.  కంచి పీఠానికి 68వ అధిపతి అయిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒకసారి  ప్రయాగలో వున్న సమయంలో,  ఆది గురువు శ్రీ శంకరాచార్యులవారు కుమారిల భట్టు అనే విద్వాంసుని కలిసి తన అద్వైత సిధ్ధాంతాలతో ఆయనమీద విజయం పొందిన ప్రదేశంలో ఆ విజయ సూచకంగా ఒక విజయ స్తంబాన్ని స్ధాపించాలని సంకల్పించారు.  1986 లో ప్రతిష్టింపబడిన ఈ మందిరం ఎత్తు 130 అడుగులు.  ఈ మందిర నిర్మాణానికి 16 సంవత్సరాల సమయం పట్టింది.  ఒక కోటి రూపాయలు ఖర్చయినాయి.  ద్రవిడ శైలిలో నిర్మింపబడిన ఈ మండపంలో శ్రీ కామాక్షీ అమ్మవారు, శ్రీ వెంకటేశ్వరస్వామి, శంకరుడు, శంకరాచార్యుల విగ్రహాలు ప్రతిష్టింపబడి వూజలందుకుంటున్నాయి.  ఇవే కాక ఇంకా అనేక దేవీ దేవతా మూర్తుల విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.


వచ్చే వారం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయంగురించి తెలుసుకుందాము.

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)