Read more!

పదుహారవరోజు పారాయణము ప్రథమాధ్యాయము

 

పదుహారవరోజు పారాయణము

ప్రథమాధ్యాయము

 

 

ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్టమానసులయిన శౌనకాది కులపతులు. "హేపురాణకథా కథనచో సురథునీ! 'సూతమునీ! లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మ పురాణాంతరవర్తితయై కలదు కదా. దానిని కూడా విశదపరచవే" అని ప్రార్ధించగా  సురచిర దరస్మేర వదనుడయిన సూతుడు - "మునులారా! వైకుంఠుని లీలా వినోదాలూ, మహిమలూ వినేవారికీ, వినిపించేవారికీ విశేష పుణ్యాన్నిస్తాయేగాని - విసుగుని కలిగించవు. భక్తి ప్రవత్తులతో మీరు కోరాలేగాని గురు ప్రసాదిత శక్త్యనుసారం వక్కాణిస్తాను - వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు విశిష్ఠుల వారెలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో, అదే విధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలన్నీ వివరించబడ్డాయి.
 

పారిజాతాపహరణం

 

 

ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గంనుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి, కృష్ణునికిచ్చి 'ఓ హరీ! నీకున్న పదహారువేల యేనమండుగురు భార్యలలోనూ, నీకత్యంత ప్రియమైన యామెకి ఈ పువ్వునీయవయ్యా' అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే వుంది. నందనందనుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. 'ప్రియమైన భార్యకీయమంటే, తనకీయాలిగాని, ఆ రుక్మిణికీయడమేమి'టని కోపించింది. కృష్ణుడామె కెంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి, తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించి. అత్యంత ప్రియురాలయిన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంతపద్మనాభుడు - తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్ముంతుని నధిరోహించి - ఇంద్రుని అమరావతీ నగరానికి వెళ్ళాడు. స్వర్గసంపదను, భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడంగీకరీంచలేదు. తత్ఫలితంగా __ ఇంద్రోపేంద్రల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకూ, గరుత్మంతునికీ భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమఠోత్సాహంలో వైనతేయుడు తన తుండంముక్కతో గోవులను కొట్టడం వలన __గోవుల యొక్క చెవులు, తోకలు తెగి, రక్తధారాలతో సహా భూమిన పడ్డాయి. వాటిలో తోకలవలన గొబ్భిచెట్లు, చెవుల వలన చీకటిచెట్లు, తాకటం నుంచి మేహధీవృక్షాలూ ఆవిర్భవించాయి.మోక్షాన్ని కోరుకునేవాళ్ళు ఈ మూడుచెట్లకూ దూరంగా వుండాలి. ముట్టుకోకూడదు. అదేవిధంగా, గోవులు తమ కొమ్ములతో కొట్టడంచేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెండ్రుక లోకమూడు రకాల పక్షలు జన్మించాయి. ఇవి మూడు కూడా శుభ్రప్రదమైనవే. గరుడ దర్శనం వలన మానవులు ఏయే శుభాలనయితే పొందుతున్నారో, అటువంటి సర్వశ్రేయస్సులనూ __ ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రాననే పొంద గలుగుతారు.

 

 

 

పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా, స్వర్గసంపదను, భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి, సవినయ పురస్సరంగా పారిజాతద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణియైన సత్రాజితి నివాసంలో ప్రతిష్టించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నులమిన్న తన పెనిమిటియైన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ 'ప్రాణప్రియా! నేనెంతయినా ధన్యురాలిని. నీ పదహారు వేల యనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదుమిక్కిలి ప్రియతమను కావడం వలన, నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి, నీతో బాటు గరుడా రూఢనై బొందెతో స్వర్గసందర్శనం చేయడానికి, కథలుగా చెప్పుకోవడమే తప్ప - ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్ప - (పారిజాత) వృక్షం నా పెరటి మొక్కగా వుండటానికి యేమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే - ఈ నీ ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం యేమిటి? అదీగాక జన్మజన్మకీ నీ జంటను ఎడబాయకుండా వుండాలంటే నేనిప్పుడింకా ఏమేం చెయ్యాలి? అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ - ఓ నారీ లలామా, సత్యభామా! నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఈయరానిదానిని ఆశించినా కూడా - నీ సమస్త వాంఛలనూ నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే' అంటూ ఇలా చెప్పసాగాడు. 

 

సత్యభామ పూర్వజన్మము

 

 

కృతయుగాంతకాలంలో, 'మాయా' అనే నగరంలో దేవశర్మ - అనే వేద పండితుడు వుండేవాడు. అతనికి లేక - లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోనివాడే అయిన 'చంద్రు'డనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు - దేవశర్మ. ఒకనాడీ మామా, జామాతలిద్దరూ కలిసి సమిధలనూ, దుర్భలనూ తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి, అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులూ, ధర్మాత్ములూ నిత్య సూర్యోపాస్తిపరులూ అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి - శైవులుగాని, గాణాపత్యులుగాని, సౌర (సూర్య) వ్రతులు గాని, శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా - నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో - దేవదత్తుని లాగా నేనే వివిధ నామారూపక్రియాదులతో అయిదుగా విభజింపబడి వున్నాను. అందువలన, మరణించిన మామా-అల్లుళ్ళను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్యతేజస్సును  కాంతులతో ఆ ఇరువురి జీవాలూ వైకుంఠంచేరి, విష్ణు సారూప్యాన్ని పొంది - విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి.

ప్రథమోధ్యాయస్సమాప్తః (మొదటి అధ్యాయము సమాప్తము)


ద్వితీయాధ్యాయము

గుణవతి కథ 

 

 

 


పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి యెంతగానో క్రుంగిపోయినది. కాని, పోయిన వారితో తనుకూడా పోలేదు గనుకా, మరణం మాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుకా - వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో వున్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికీ - భర్తకూ ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ, దేహ పోషణార్ధం కూలిపని చేసుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో, హరిభక్తినీ - సత్యాన్నీ శాంతాన్నీ, జితేంద్రియత్వాన్నీ పాటిస్తూ వుండేది. పరమ సదాచారుపరులైన వారింట పుట్టి పెరిగింది కావడంవలన బాల్యంనుంచీ అలవడిన కార్తీక వ్రతాన్నీ - ఏకాదశీవ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది.

 

 


కృష్ణుడు చెబుతున్నాడు: సత్యా! పుణ్యగణ్యాలూ, భుక్తి ముక్తిదాయకాలూ, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలూ అయిన ఆ రెండు వ్రతాలూ నాకు అత్యంత ప్రీతీపాత్రమైన వన్న సంగతి నీకు తెలుసుకదా! కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో వుండగా నిత్యమూ ప్రాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలనూ నేనూ నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలూ దీపారాధనలూ జాగరణ తుపసిపూజ చేసే వాళ్లు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణ్వాలయంలో మార్జనం చేసి, సర్వతోభద్రం - శంఖం - పద్మం మొదలయిన ముగ్గులను పెట్టి, పూజా పునస్కారాలను చేసే వారు జీవన్ముక్తులౌతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెలరోజులలోనూ, కనీసం మూడురోజులయినా ఆచరించినవారు - దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్లవుతున్నారు. ఇక పుట్టింది లగాయితు జీవితాంతమూ చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్లా కాదు.

 

 


అదే విధంగా - ఆనాటి గుణవతి, విష్ణుప్రియంకరాలయి ఏకాదశీ కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి - కొన్నాళ్ళ తరువాత యోభారం వల్ల శుష్కించి, జ్వరపడింది. అయినప్పటికీకూడా - కార్తీకస్నానం మానకూడదనే పట్టుదలతో నదికివెళ్ళి - ఆ చలిలోకూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూవుంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మాద్యాయుధాలు ధరించి విష్ణ్వాభులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులోచేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరిసాన్నిధ్యాన్ని పొందింది.

 

 

అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్ధన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని 'చంద్రుడు' ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీకవ్రతం మీదా నా మీదా మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే - నువ్వుగా - అంటే సత్రాజిత్ కుమార్తవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికంతకూ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణా పుణ్యలేశమే తప్ప ఇతరంకాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా, ఈనాడు నీ ఇంటా - వంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణా పుణ్యాలనూ కూడా 'నారాయణాయేతి సమర్పయామి' అంటూ జగత్పతినైన నాకేధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతంవరకూ కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి వున్నంత వరకూ నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితీ! నువ్వే కాదు. నీ మాదిరిగా ఎవరయితే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులూ నా భక్తగరిష్ఠులూ అయి వుంటారో వారందరూ కూడా నాకు ఇష్టులైసర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాలరీత్యా, నావారుగా, నా సాన్నిధ్యంలోనే వుంటూనే వుంటారు. రాగవతీ! ఒక్క రహస్యం చెబుతాను విను - తపోదాన  యజ్ఞాదికాల నెన్నిటిని నిర్వర్తించినవారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో.

ఉపరివిధంగా - శ్రీకృష్ణప్రోక్తమైన తన పూర్వజన్మ గాధనూ కార్తీక వ్రత పుణ్యఫలాలనూ విని పులకితాంగియైన ఆ పూబోడి తన ప్రియపతియైన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది.


ఏవం శ్రీపద్మ పురాణంతరగత కార్తీకమాహాత్మ్వమందు

ఒకటి రెండు అధ్యాయములు

 

16 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల

దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము  :- స్వాహా అగ్ని 

జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత 


పదనాఱవ (బహుళ పాడ్యమి) నాటి పారాయణము సమాప్తము .