సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవరోజు పారాయణము

 

సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఎనిమిదవరోజు పారాయణము

 

 

వశిష్ట ఉవాచ : ఓ జానక మహారాజా! కార్తీకమాసములో యెవరైతే హరి ముందర నాట్యమును చేస్తారో, వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీప మాలర్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్ల పక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్పించే వాళ్ళు __ స్వర్గ నాయకులౌతారు. ఈ నెలరోజులూ  నియమముగా విష్ణ్వాలయానికి వెళ్ళి, దైవదర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షన్నందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీకమాసములో అసలు విష్ణుమూర్తిగుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కార్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతి దుష్కార్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశినాడు విప్రసహితుడై భక్తీయుతడై గంధ పుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి, పుణ్యానికి మిటి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయములో గాని, కేశవాలయములో గాని __ లక్ష్య ద్వీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నేల్లాళ్ళూ దీపమును పెట్టలేనివాళ్ళు శుద్ధ ద్వాదశీ, చతుర్ధశీ, పూర్ణమ- ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పిటికెందుకు పట్టేటంత సమయమైన దైవసన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే, దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించి పోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.

 

ఎలుక దివ్య పురుషుడగుట

 

 


సరస్వతీ నదీతీరంలో __ అనాదికాలముగా పూజా పునష్కరాలు లేక శిథిలమై పోయిన విష్ణ్వాలయము ఒకటు౦డేది. కార్తీక స్నానార్ధమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి  __ ఆ గుడిని చూచి, తన తఫోధ్యానలకు గాను ఆ యేకాంత ప్రదేశము అనువుగా వుంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు. నీళ్ళు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి __ ప్రత్తి, నూనె,  పన్నెండు ప్రమిదలూ తెచ్చి __ దీపాలను వెలిగించి "నారాయణార్పణమస్తు " అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతి రోజూ యిలా చేస్తుండగా __ కార్తీక శుద్ధ ద్వాదశినాటి రాత్రి, బైట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరుగెడుతున్న ఒక ఎలుక __ ఆ గుడిలోనికి వచ్చి, ఆహారన్వేషణలో విష్ణువిగ్రహానికి ప్రదక్షణముగా తిరిగి, మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన అరిపోయిన వత్తి మాత్రమే వుంది. తడిగావున్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక, అదేదో ఆహారముగా భావించి __ ఆ వత్తిని నోట  కరుచుకుని ప్రక్కనే వెలుగుతూన్న మరోదీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి వున్న  __ ఆ ఆరిపోయిన వత్తికోన వెలుగుతూన్న వత్తి అగ్ని సంపర్కమై వుండడంతో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి __ రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి. రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక  యత్రీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా, అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై __ తన పూర్వపుణ్యవశాన, ఆ మూషికము ఆ రాత్రి అ గుడిలోనే విగతదేహియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది.

 

 

అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి __ ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి "ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడగడంతో  __ ఆ అద్భుత పురుషుడు __"ఓ యతీంద్రా! నేనొక యెలుకను. కేవలం గడ్డిపరకాల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నకుప్పుడీ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడంలేదు.    పూర్వజన్మలో నేనెవరిని? ఏ పాపము వలన అలా యెలుకనయ్యాను? ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను? తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమారాధన పరచగలవాడివి. నా యందు దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి" అని అంజలి ఘటించి ప్రార్ధించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్నీ దర్శించి యిలా చెప్పసాగాడు.


బాహ్లికోపాఖ్యానము

 

 

 


నాయనా! పూర్వము నువ్వు జైమినీగోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు- నిరంతరం సంసార పోషణా పరాయణుడివై స్నానసంధ్యాదుల్ని విసర్జించి, వ్యవసాయమును చేబట్టి, వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తూండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావనా  లాలసతతో శ్రాద్ధభోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా - రాత్రింబవళ్ళు తినడమే పనిగా  బ్రతికావు, చివరకు కాకబలులూ పిశాచబలులను కూడా  భుజిస్తూ- వేదమార్గాన్ని తప్పి  చరించావు. అందగత్తె యైన నీ భార్య కందిపోకండా -  ఇంటి పనులలో  సహాయార్థము ఒక దాసీదానిని నియమించి, బుద్ది వక్రించినవాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ, దానితో  మాట్లాడుతూ, హాస్యాలాడుతూ, నీ పిల్లలకు దాని చేతనే  భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దానిచేతి కూటినే తింటూ అత్యంత హీనంగా  ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు ధనలుబ్దుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి, యెవరికో విక్రయింప చేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్థంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి, పునః  యెలుకవై పుట్టి యీ జీర్ణ దేవాలయంలో వుంటూ బాటసారులు దైవ పరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధద్వాదశి కావడం వలనా- ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ-నీ యెలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది.

 

 



పై విధంగా యతి చెప్పినది విని -  తన గతజన్మ కృతపాపాలకు పశ్చాత్తప్తుడై, ఆ యతి యొక్క, మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి -  కార్తీకశుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణమిలలో మూడురోజులు సరస్వతీనదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి, ఆ పుణ్య ఫలము వలన వివేకవంతుడై - బ్రతికినంత కాలమూ ప్రతీ సంవత్సరము కార్తీక వ్రతాచరణా, తత్పరుడై, మసలి, అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి- కార్తీక  శుద్ధ ద్వాదశినాడు  భాగవత్పరాయణుడై స్నాన దాన పూజా దీప మాలార్పణాదికములను నాచరించేవాడు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు - పాపనిముక్తుడునై - సాయుజ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు.

 


షోడశాధ్యాయము


జనకమహారాజా! దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ  కార్తీకము నెల రోజులూ నియమముగా తారబూలదానమును చేసేవాళ్లు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి పాడ్యమి లగాయితు రోజుకోక్కొక్క దీపము చొప్పున విష్ణుసన్నిధిని వెలిగించే వాళ్లు వైకుంఠగాములవుతారు.  సంతానవాంచితుడు కార్తీక పౌర్ణమినాడు వాంఛ సంకల్ప పూర్వకంగా సూర్యుని సుద్దేశించి స్నానదానాలను  చేయడం వలన సంతాన వంతులవుతారు. విష్ణుసన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు. దుర్మరణాలుగాని, సంతాన విచ్చేదాలు కాని జరగవు.


స్తంభరూపము

 

 

పూర్ణిమనాడు విష్ణుసన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్దిస్తుంది. రాతితోగాని, కొయ్యతోగాని స్తంభం చేయించి దానిని విష్ణ్వాలయమునకు   ముందు పాతి, ఆ మీదట  శాలిధాన్య వ్రీహిధాన్యమును, నువ్వులనుపోసి, దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్లు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలూ నశించిపోతాయి. ఈ దీపమును పెట్టినవాళ్ళకి వైకుంఠపతిత్వము సిద్దిస్తుంది. ఇక  దీపాన్ని దానము  చేయడము వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము ణా వల్లనయ్యే పనికాదు. ఈ స్తంభదీప మహిమకుదాహరణగా ఒక కధను చెబుతాను విను - అని  చెప్పసాగాడు వశిష్ఠుడు.

   
కొయ్య మొద్దుకు-కైవల్యము కలుగుట

 

 

నానా తరుజాల మండితమైన మతంగముని అశ్రమములో ఒక విష్ణ్వాలయము వుండేది. ఎందరెందరో మునులా ఆలయానికి వచ్చి, కార్తీకావ్రతులై ఆ నెల్లాళ్ళూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ ఆర్చిస్తూండేవారు. ఒకానొక కార్తీకమాసములో వ్రతస్ధలములోని ఒక ముని - కార్తీకములో విష్ణుసన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ గనుక, మనము కూడా ఈవిష్ణ్వాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దాము" అని సూచించాడు అందుకు సమ్మతించిన బూషులందరూ, ఆ గుడి యెదుటనే - కొమ్మలూ, కణుపులూ లేని స్థూపాకారపుచెట్టు నొకదానిని చూసి, దానినే స్తంభముగా నియంత్రించి, శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి __ విష్ణర్పణము చేసి, పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే అ స్తంభము ఫటఫటరావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వేలువడంతో విస్మయచకితులైన ఆ ఋషులు 'ఎవరునువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు?

 

 


నీ కథ ఏమిటో చెప్పు' అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. __ ఓమునివరేణ్యలారా! నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా, వేదాశాస్త్ర పఠనమునుగాని, హరి కథా శ్రవణమును గాని, క్షేత్రయాత్రాటనలను  గాని, చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణా ధర్మాన్ని వదలి __ రాజువై పరిపాలన చేస్తూదుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు. ఆచారవంతులు , పుణ్యాత్ములు, ఉత్తములూ  అయిన బ్రాహ్మణులను నీచసనాలపై కూర్చో నియోగించి, నేను ఉన్నతాసనముపై కూర్చునే వాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసే వాణ్ణే కాదు. తప్పనిసరినప్పుడు మాత్రం __ 'ఇంతిస్తాను __ అంతిస్తాను' అని వాగ్ధానం చేసే వాణ్ణీ తప్ప, ద్రవ్యాన్నీ మాత్రము ఇచ్చే వాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చుచేసుకునే వాడిని. తత్ఫలితముగా  దేహాంతాన నరకగతుడనై, అనంతరము __52 వేల మార్లు కుక్కగాను, పది వేల సార్లు కాకిగాను, మరో పదివేల సార్లు తొండగానూ, ఇంకో పదివేల సార్లు విష్ణాశినైన  పురుగుగానూ , కోటి జన్మలు చేట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మేద్దువలెనూ పరిణమించి కాలమును గడుపుతూన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో __ ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి.

 

 

ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా యిలా అన్నారు__ "ఈ కార్తీక వ్రతఫలము యదార్ధమైనది సుమా! ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా! అందునా కార్తీక పూర్ణమినాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దయినా __ మ్రాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము ' ఇలా చెప్పుకుంటూన్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు __"అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేని చేత ముక్తుడూ __ దేనిచేత బద్ధుడూ అవుతున్నాడో , దేనిచేత దేహులకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు" అని ప్రార్ధించదముతో, ఆ తాపసులలో వున్న అంగీకరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

ఏవం శ్రీస్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యే


పంచదశ, షోడశాధ్యాయౌ, (పదిహేను __ పదహారు అధ్యాయములు ) 


8 వ రోజు

 

 

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు :- తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము :- దుర్గ

జపించాల్సిన మంత్రము :- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

ఫలితము :- ధైర్యం, విజయం

 

ఎనిమిదివరోజు (అష్టమదిన) నాటి పారాయణము సమాప్తము