సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవరోజు పారాయణము

 

సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఆరవరోజు పారాయణము

 

 

ఏకాదశాధ్యాయము

వసిష్ఠ ఉవాచ : ఓ మహారాజా! కార్తీకమాసములో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో  వాళ్ళకి చాంద్రాయణఫలము కలుగుతుంది. గరికతోనూ, కుశులతోనూ పూజించే వాళ్ళు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి  సమర్పించిన  వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణుసన్నిధిని దీపమాలికను నుంచేవాళ్ళూ, వైకుంఠ పురాణ పాతకులూ, శ్రోతలు  కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ సమయింపచేసేదీ __ ఆయురారోగ్య దాయినీ __ అయిన ఒక కథను వినిపిస్తాను విను.

 

మందరోపాఖ్యానము:

 

 


కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానోక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నీటినీ విసర్జించి, పరులకు కూలిపని చేస్తూ వుండేవాడు. అతనికి పతిమిత్ర, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్నా, సద్గుణ సముచ్చయము చేత 'సుశీల' అని పిలువబడే భార్య వుండేది.   భర్త యెంత దుర్మార్గుడైనా కూడా, అతనియందు రాగమే తప్ప ద్వేషము లేనిదై, పాతివ్రత్య నిష్టాపరురాలయి వుండేది. కొన్నాళ్ళ తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై, ఖడ్గపాణియై- దారులుకాసి బాటసారులను కొట్టి _ వారినుండి ధనము నపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసికొనిపోయి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణచేసేవాడు.

 

 

ఒకసారి - దొంగతనానికై  దారికాసి వున్న మంధరుడు - బాటసారియైన  ఒకానొక బ్రాహ్మణునిని పట్టుకుని _ అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి - ఆ బాపని ద్రవ్యాన్నంతనూ అపహరింపచేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు _ దోచుకొనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణనినీ యిద్దరినీ కూడా చంపివేసి, ఆ ద్రవ్యాన్ని తాను హరించుకు పోబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి - కిరాతకునిపై బడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు  ఖడ్గ౦తోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగదంలో పులీ, కిరతకుడూ కూడా యేకకాలంలోమరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మంధర వ్యాఘ్ర , కిరాతకుల  జీవులు నలుగురూ యమలోకమును చేరి, కాలమాత్రమునే నరకాన్ని పొందారు. యమకింకురులా ఆ నలుగురినీ _ పురుగులూ, ఆమేథ్యమూతో నిండివున్న తప్త రక్తకూపంలో పడవేశాడు.

 

 

ఇక భూలోకములో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్యయైన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జనసాంగత్యముతో జీవించసాగింది.  ఒకనాడు - నిరంతర హరినామ సంకీర్తనా తత్సరుడు, సర్వులయందునా భగవంతుని. దర్శించువాడూ, నిత్యానంద నర్తనుడూ అయిన ఒకానొక యతీశ్వరుడు _ ఈ సుశీల యింటికి వచ్చాడు. ఆమె శ్రద్దా భక్తులతో అతనికి భిక్షవేసి 'అయ్యా! నా భర్త కార్యార్దియై వెళ్ళి వున్నాడు. ఇంటలేడు. నేనేకాకినై అయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను' అని విన్నవించుకుంది. అందులకా యతి 'అమ్మాయీ! ఆవేదనపడకు. ఇది కార్తీక పూర్ణమా మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీయింట పురాణ పఠమాశ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనై నా దగ్గరవుంది. నీవు వత్తిని _ ప్రమిదను సమర్పించినట్ట్లేయితే _ దీపమును వెలిగించవచ్చును' అని సలహా యిచ్చాడు.

 

 

ఆ యటిశ్రేష్టుని మాటలనంగీకరించి సుశీల - తక్షణమే గోమయముతో యిల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి, రెండు వత్తులను చేసి, యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి, ఆ దీప సహితముగా విష్ణువును పూజించి - మనశ్శుద్ది కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల యిండ్లకు వెళ్ళి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమా  తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమ క్రమముగా ఆమె జ్ఞానియై, తదుపరిని కాలధర్మమును చెందినది.

 

 

తత్ క్షణమే శరఖ చక్రాంకితులు, చతుర్భాహులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు_ నందనవన, సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక   ప్రవాళాదూలతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై వున్న దివ్య విమానాన్ని తెచ్చి _ సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల, మార్గమధ్యమములో నరకములో మరిముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూన్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి _ తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది. అందుకు వారు 'అమ్మా! నీ భర్తయైన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి - కూలియై, మరికొన్నాళ్ళు దొంగయై - దుర్మార్గ ప్రవర్తన వలన  యిలా నరకాన్ని అనుభవింస్తున్నాడు. అతనితోబాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకనిని చంపి - అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత  బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు. మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రహ్మణునినీ, నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను యితడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అతఃపూర్వజన్మలో ద్రావిడ బ్రహ్మణుడై యుండి - ద్వాదశినాడు భక్షాభక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తైలాదికభోజనాదుల వలన నరకమును పొంది _ పులిగా పుట్టి _ ఈ కిరాతుకుని తోడి జగడములో అతనితోబాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలివే తల్లీ !" అని చెప్పారు.

 

 

ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి _ ఏపుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్ణువులు కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని ధారబోయడము వలన నీ భర్తా _ పురాణ శ్రవణార్దమై నువ్వు యింటింటికీ వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారాబోయడము వలన మిత్ర ద్రోహియైన ఆ బ్రాహ్మణుడు _ ఆ పురాణ శ్రవణార్దమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చేరిసగముగా ధారపోయడము వలన కిరాత వ్యాఘ్రాలూ నరకము నుంచి ముక్తిని పొందుతారు." అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో - ఆ నలుగురూ నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశింసిస్తూ - మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో చేసే పురాణశ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో.

ఏకాదశోధ్యాయ స్సమాప్త: (పదకొండవ అధ్యాయము)


ద్వాదశాధ్యాయము (వశిష్ట ప్రవచనం)

 

 



పునః వశిష్టుడు జనకునికిలా చెప్పసాగాడు: 'ఓ రాజా! కార్తికమాసములో వచ్చే సోమవార మహత్యమును విని వున్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు, కార్తీకపూర్ణమ _ వెయ్యిరెట్లు, శుక్లపాడ్యమి _ లక్షరెట్లు, శుక్లఏకాదశి__కోటిరెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలనూ అదనముగా ప్రసాదిస్తాయి. మోహము, చేతనైనాసరే శుక్ల ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు (ద్వాదశి) బ్రహ్మణయుక్తులై పారాయణ చేసే వాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానమును చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! సూర్యగ్రహణ సమయంలో గంగాతీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో - అంత పుణ్యమూ కూడా కేవలము కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడము వలన కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాత యోగాలూ, లక్ష అమావాస్యాపర్వాలూ ఏకమైనా కూడా _ ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవవంతు  కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నయినా వుండవచ్చును గాక, కాని _ వాటన్నింటికంటే కూడా  సాక్ష్యాద్విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు.


ద్వాదశీ దానములు

 

 



ఏకాదశినాడు రాత్రి యామముండగా కార్తీకశుద్ధ ద్వాదశినాడు క్షీరసముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రహ్మణునకైనా అన్నదానమును చేస్తారో, వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్నీ, పరములో భోగిశయనామ సేవనాన్నీ పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగు _ అన్నదానం చేయడం సర్వోత్ర్కుష్ణమైనా దానముగా చెప్పబడుతూ వుంది. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై యెన్ని రోమాలైతే వుంటాయో, అన్నివేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానము చేసినవాళ్ళు -సంచితార్దాలన్నీ సమిసిపోయి వైకుంఠాన్ని చెందుతారానడంలో ఎటువంటి వివాదమూ లేదు. పండ్లు తాంబూలము, యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానము చేసేవారు. ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ధద్వాదశినాడు సాలగ్రామాన్నీ బంగారపు తులసీ వృక్షాన్నీ _ దక్షణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు _ చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతూన్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను.


ధర్మవీరోపాఖ్యానము

 



పూర్వము గోదావరీ తీరములో దురాచారవంతుడూ, పరమ పిసినిగొట్టూ అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్దుడు దానధర్మాలు చేయకపోవడమేకాక, తనుకూడా తినకుండా ధనమును ప్రోగుచేసేవాడు. ధనధాన్యాలనే కాదు - కనీసము కనీసము ఎవరికీ మాట సాయమైన చేసేవాడు కాదు. నిత్యమూ పరులను నిందిస్తూ - పరద్రవ్యాసక్తుడై మసలే యీ పిసినిగొట్టు - ధనమును వడ్డీలకు తిప్పుతూ - అంతవరకూ ద్రవ్యాన్ని పెందుకోసాగాడు.


ఒకానొకసారి ఈ లుబ్దుడొక బ్రాహ్మణునికి యిచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి _ తానిచ్చిన బాకీని వడ్డీతోసహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు, బ్రాహ్మణుడు 'ఋణదాతా - నేను నీ బాకీ యెగవేసేవాడిని కాను ఎందుకంటావేమో!


    శ్లో ||  యో జీవితి ఋణీనిత్యం నియమం కల్పమశ్నుతే|
           పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ||


 'ఎవడయితే ఋణం తీర్చకుండానే పోతాడో - వాడు మరుసటి జన్మలో ఋణదాతకు సంతురూపముగా జన్మించి ఆ ఋణాన్ని చెల్లుబెట్టుకోవసి వస్తుంది. అందుచేత యేదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ ఋణమును చెల్లుబెడతాను. అంతవరకూ ఓర్పు వహించి వుండు' అని చెప్పాడు.

 

 


ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్దుడు కనిసి, "నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళాగే సమయం నాకు లేదు. మర్యాదుగా ఇప్పుడే యియ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను" అన్నాడు. యదార్ధముగా ఆ సమయంలో ధనములేదనీ, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేననీ చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి _ బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలకు పడద్రోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వ్రేటు పెట్టాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, క్రోధోన్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి _ హత్యానేరానికిగాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి _ గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమేగాని - గుట్టుగా వున్నంత మాత్రం చేత యెల్లకాలం బ్రతకలేం గదా! అదే విధముగా ఆ కోమటి కూడా, ఆయువుదీరి మృతిచెందాడు. యమకింకరులు వచ్చి, ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనకభూపతీ! 'రురువు' లనే మృగాల చేతా, వాటి శృంగాల చేతా పీడింప చేసే ఒకానొక యాతననే 'రౌరవం ' అంటారు. ఈ కోమటిని ఆరౌరవమనే నరక విభాగములో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు, కింకరులు ఆ ఆజ్ఞ నమలుచేయసాగారు.

 

 

ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన 'ధర్మవీరు' డనే వాడు __ మహాదాతా, పరోపకారియై __పిత్రార్జితమైన అగణిత ధనరాశులలో ప్రజా శ్రేయస్సుకై చెరువులు, నూతులు త్రవ్వించి తోటలు వేయించి __ వంతెనలు కట్టించి __ పేదలకు వివాహొపనయనాదులు చేయిస్తూ  __ యజ్ఞయాగాది క్రతువులనూ __ క్షుత్పీడితులను తరతమ భేద రహితముగా అన్నదానాలను చేస్తూ __ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొకనాడీ ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయానికి త్రిలోకసంచారియైన __ నారదమహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన  మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి "నారదా! దేవర్షులైన  మీరిలా మా భువర్షానికి అందునా నా గృహనికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభూ! నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను" అని వినయ పూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వుముఖము కలవాడై "ధర్మవీరా! నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా యీ మాటల్ని శ్రద్దగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు  అత్యంత ప్రియమైన రోజు, ఆ రోజున చేసిన స్నానదాన జపతపః కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీరా! సూర్యుడు తులారాశిలో వుండగా కార్తీకద్వాదశీ. ప్రాతః స్నాతులై సాలగ్రామదానమును చేసేవారు __ దరిద్రులు గానీ, ధనికులు గానీ, యతులు గానీ, వానప్రస్థులు గానీ, బ్రాహ్మణులు గానీ, క్షత్రియులు గానీ, వైశ్యులుగానీ, శూద్రులు __ స్రీలేగానీ __ వాళ్ళేవళ్ళయినా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్నవాళ్ళే అవుతారు. మరోముఖ్యవిషయమును చెబుతాను విను. నీ తండ్రి మరణించి, యమలోకంలో పడరానిపాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి __ నువ్వు కార్తీక ద్వాదశినాడు సాలగ్రామదానమును చెయ్యి."

 

 

నారదుడు చెప్పినదంతావిని- నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు "నారదమునీంద్రా! నా తండ్రి పేరున __ గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరించబడని నరకయాతన - కేవలం సాలగ్రామమనే పేరు గలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా?  -అయినా ఆ సాలగ్రామమనే రాయి యెందుకుదుపయోగపడుతుంది.? తినదానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది. కాదు. ఏరకంగానూ ఎవరికీ కూడా పనికిరాణి దానిని నీనేందుకు దానము చేయాలి. రాతి దాటకు కీర్తి వుండడు. ఆ దనమును పట్టిన వానికి సుఖమూ వుండడు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను.' అన్నాడు.

 

నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా, ధర్మవీరుడు తన మూర్ఖాత్వాన్ని వదలనూ లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరి కొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులూ, సర్వహీతాత్ములు అయిన   పెద్దల మాటలను పాటించని పాపానికీ __ సాలగ్రామదానము చేయకపోవడము వలనా నరకగతుడై, అనంతరము మూడుమారులు పిలుగాను, మూడుసార్లు కోతిగాను, అయిదుసార్లు ఆబోతుగాను, పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః పదకొండవ జన్మలో కూడా ఒకానొక యాచుకుని పత్రుకగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మవలన పెండ్లి కుమారుడు అనతికాలంలోనే మరణించడంతో __ ఒక్కగానొక్క కూతురుకి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టిచేత తన కూతురి పురాకర్మముగత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై __ ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి __ కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా, జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావాస్తి వలన __ మరణించిన పెండ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు.   

 

 

ఆ దంపతులు యిహజీవితాన్ని ధర్మకామసౌఖ్యాలతో గడిపి, కాలాంతర  స్వర్గమును  చేరి,  పుణ్యఫలానుభవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా  ఒక బ్రాహ్మణునింట శిశువుగాపుట్టి,  పూర్వజన్మలో చేసిన  మహత్త్వపూర్వక సాలగ్రామ దన పుణ్యవిశేషము వలన జ్ఞానియై __ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ  __ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన 'రౌరవ' గతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు.   కాబట్టి జనక మహారాజా! కార్తీకమాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పింస్తాడని ధ్రువపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీకమాసంలో సాలగ్రామదానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఎ మాత్రమూ అతిశయోక్తి లేదు.
        
ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
ఏకాదశ, ద్వాదశాధ్యాయౌ (పదకొండు __ పన్నెండు అధ్యాయములు )

 

6 వ రోజు

నిషిద్ధములు :- ఇష్టమైనవి, ఉసిరి

దానములు :- చిమ్మిలి

పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము :- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా

ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి


ఆరవరోజుపారాయణము సమాప్తము