ఆ వంశంలో చనిపోయినవారు ఎలుకలుగా పుడతారు
ఆ వంశంలో చనిపోయినవారు ఎలుకలుగా పుడతారు
కర్నీమాత గుడి! ఈ పేరు వింటే ఉత్తరాదిలో ఎవరూ పెద్దగా గుర్తపట్టకపోవచ్చు. కానీ ఎలుకల దేవాలయం అంటే చాలు ఠక్కున భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ఒకటా రెండా దాదాపు ఇరవై వేలకు పైగా ఎలుకలు నిత్యం ఆ ఆలయంలో కనపిస్తాయి మరి. ఇంతకీ ఆ ఆలయం ఏమిటో.. అక్కడ కనిపించే ఎలుకలు కథ ఏమిటో మీరే చూడండి...
రాజస్థాన్లోని బికనీర్కు 30 కిలోమీటర్ల దూరంలో దేశ్కోనే అనే గ్రామం ఉంది. అక్కడే మనం చెప్పుకొంటున్న వింత ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత పేరు ‘కర్నీ మాత’. ఈ కర్నీ మాతని సాక్షాత్తు దుర్గాదేవి అవతారంగా చెప్పుకొంటారు. ఓ 500 ఏళ్ల క్రితం ఈమె రాజస్థాన్లోని ‘చరణ్’ అనే ఓ క్షత్రియ వంశంలో జన్మించారు. కర్నీదేవి చిన్నప్పటి నుంచే వైరాగ్యభావనతో ఉండేవారు. పెద్దలు ఆమె పెళ్లి చేసినప్పటికీ, ఆమెకి సంసారం పట్ల ఎలాంటి ఆసక్తీ కలగలేదు. తనకి ఈ సంసారం పట్ల ఎలాంటి అనురక్తీ లేదని తన భర్తకు కరాఖండిగా చెప్పేశారు. పైగా ఆయనకు ఓ మారుమనువు కూడా చేసి దేశాటనకు బయల్దేరారు.
కర్నీదేవి దేశాటన చేసే ప్రతిచోటా ఆమె ఏదో ఒక మహిమ చూపిస్తుండేవారు. దాంతో ఆమె పేరు దేశం నలుమూలలా మార్మోగిపోయింది. ఆనాటి రాజస్థాన్లోని రాజులంతా ఆమె పట్ల విధేయంగా ఉండేవారు. ఆమె ఆశీస్సులు లభిస్తే ఎలాంటి ఆటంకం అయినా తొలగిపోతుందని నమ్మేవారు. ఆమె అనుగ్రహం చూపితే ఎంతటి యుద్ధంలో అయిన విజయం సాధిస్తామని భావించేవారు. అందుకే ఆమెను కొలిచేందుకు ఎక్కడెక్కడినుంచో రాజులు సైతం తరలివచ్చేవారు.
కర్నీమాతతో తమ కోటకి శంకుస్థాపన చేయిస్తే ఆ రాజ్యానికి ఇక తిరుగుండదని ఆనాటి రాజుల నమ్మకం. దాంతో ఆమెచేత బికనీర్, జోధ్పూర్ వంటి కోటలకి శంకుస్థాపన చేయించారు. ఇప్పటికీ ఆ కోటలు చెక్కుచెదరకుండా ఉండటానికి కారణం, ఆమె మహత్యమే అంటారు. కర్నీదేవి 150 ఏళ్ల నిండు జీవితాన్ని జీవించారు. ఆ తర్వాత గడియాలా అనే గ్రామం వద్ద అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. కర్నీమాత జీవించి ఉండగానే ఆమె కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఆమె దేహాన్ని చాలించిన తర్వాత రాజస్థాన్ అంతటా చాలా ఆలయాలే నిర్మించారు. వాటిలో ఉదయ్పూర్, ఆల్వార్ వంటి ప్రాంతాల్లో ఉన్న కర్నీమాత ఆలయాలు ప్రముఖమైనవి. ఇక మొదట్లో చెప్పుకొన్న దేశ్కోనేలోని కర్నీమాత ఆలయం గురించి చెప్పనే అక్కర్లేదు. అదంతా మరో కథ!
దేశ్లోనేలోని కర్నీమాత ఆలయం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు కనిపిస్తాయి. ఒక కథ ప్రకారం కర్నీమాత జన్మించిన చరణ్ అనే తెగలో చనిపోయినవారంతా ఇక్కడి ఆలయంలో ఎలుకలుగా జన్మిస్తారు. మరో కథ ప్రకారం కర్నీమాత వారసుడైన లక్ష్మణ్ అనే వ్యక్తి ఓసారి చెరువులో పడి చనిపోయాడు. తన భక్తుడు, వారసుడు అయిన లక్ష్మణుడిని బతికించుకునేందుకు కర్నీమాత సాక్షాత్తు ఆ యముడితోనే పోట్లాడిందట. కర్నీమాత మాటను కాదనలేని యముడు.. లక్ష్మణ్ అతని వారసులు అంతా కూడా ఎలుకల రూపంలో చిరకాలం ఉంటారని దీవించాడట. మరో గాథ ప్రకారం యుద్ధం నుంచి పారిపోయి వచ్చిన 20 వేల మంది సైనికులని, కర్నీమాత ఎలుకల రూపంలో ఉండమని శపించిందట.
కథ ఏదైతేనేం! ఇక్కడి ఆలయంలో తిరిగే ఎలుకలని దేవతాస్వరూపాలుగా భావించడం సహజం. అందుకే అటు భక్తులు ఇటు పూజారులు వాటికి పాలు, ప్రసాదాలని అందిస్తూ ఉంటారు. ఇక వాటిలో అరుదుగా కనిపించే తెల్ల ఎలుకలు మరింత మహిమాన్వితం అని నమ్ముతారు. అలాంటి తెల్ల ఎలుక ఎవరి కాలి మీద నుంచైనా పరిగెత్తితే... దానిని శుభశూచకంగా భావిస్తారు. అక్కడి ఎలుకలు వదిలేసిన ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరించేవారూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఎవరి కాలి కిందైనా పడి ఏదన్నా ఎలుక చనిపోతే, దాని స్థానంలో ఒక వెండి ఎలుకను ఆలయానికి అర్పించాలని చెబుతారు.
ఎటుచూసినా పాలరాతి చెక్కడాలు, పెద్దపెద్ద వెండి తలుపులు, ఆలయం నలుమూలలా బిలబిలలాడుతూ కనిపించే ఎలుకలు, వాటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు.... ఇలా కర్నీమాత ఆలయం మంచి సందడిగా ఉంటుంది. చైత్ర మాసంలోనూ, ఆశ్వయుజమాసంలోనూ జరిగే నవరాత్రుల సమయంలో అయితే వేలాదిమంది భక్తులతో కర్నీమాత ఆలయం ఉన్న గ్రామం యావత్తు భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది.
- నిర్జర.