జిల్లేడుపై వెలసిన గణపతి

 

సామాన్యంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా అరుదుగా కొన్ని స్వయంగా వెలసినవి ఉంటాయి. అలాంటి స్వయంభూ దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ఖాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర్లో శ్వేతార్క గణపతి దేవాలయం ఒకటి.

ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పీ చేక్కలేదు. తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వెలసిన శ్వేతార్క గణపతి. శిల్పి రూపొందించిన విగ్రహం కంటే స్వయంగా వెలసినప్పుడు దాన్ని ఇంకా పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. చిత్రమేమిటంటే, కొన్ని స్వయంభూ దేవాలయాల్లా ఈ శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు. ఖాజీపేట గణపతి తల, కళ్ళు, తుండము, ఒకటి పొడుగ్గా, మరొకటి విరిగినట్టుగా ఉండే రెండు దంతాలు, చేతులు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం... ఇలా ప్రతిదీ స్పష్టంగా విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది.

ఈ శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నవారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆరోగ్య సమస్యలు, కాపురంలో కలతలు - ఇలా అనేక సమస్యలతో ఈ గుడికి వచ్చే భక్తులు, తమకు వెంటనే సత్ఫలితాలు చేకూరినట్లు చెప్తారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ శ్వేతార్క గణపతి దేవాలయం మంగళ వారాల్లో మరీ కిక్కిరిసి ఉంటుంది. మంగళవారం నాడు గరిక పూజలు, గణపతి హోమం జరుపుతారు. ఖాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్ లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం, పద్మావతీ వేంకటేశ్వరాలయం, అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సాయిబాబా గుడి కూడా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లో అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.