గోదావరి పుష్కరాల సందర్భంగా జైనాథ్ ఆలయం విశేషాలు
జైనాథ్ ఆలయం
జైనాథ్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణా స్టేట్
జైనాథ్ టెంపుల్ తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో వుంది. ఉత్తర తెలంగాణాలో అదిలాబాద్ లో ఉన్నఈ ఆలయం పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టు పక్కల దర్శనీయ స్థలాలు చాలా వున్నాయి. వాటిలో ఈ ఆలయం ఒకటి.
ఆలయ ముఖద్వారం ఆలయంలోపలి స్తంభాలపై శిల్పాలు: జైనాధ్ ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాధ్ గ్రామంలో వుంది. హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరం లో వుంది . ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. చాలా మహిమాన్విత ఆలయం ఇది. భక్తులకు ఆ నారాయణుడు తన కృపావీక్షణాలతో అలరారుతుంటాడు. అక్కడ ఉన్న శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ ఆలయం పల్లవ రాజులచే కట్టబడింది అని ఆలయ చరిత్ర చేబుతోంది. క్రీ.శ.4 నుండి 9వ శతాబ్దం నాటి వరకు పల్లవ సామ్రాజ్యం అని చెప్పచ్చు. పల్లవులు దక్షిణ భారతావనిని దాదాపు 500 ఏళ్ళు పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాదు వారిలో ఉన్న కళానైపుణ్యం కూడా గొప్పది, హస్త కళలలో, శిల్పకళలలోను సిద్ధహస్తులు. రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళ లో ప్రసిద్ధులు. వారి కాలంలో అనేక ఆలయాలు చెక్కబడి అందమైన శిల్పసౌందర్యంతో అలరారే అధ్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ఈ జైనాధం ఆలయం ఒకటి. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో అలరారుతుండేదని ఆలయ శిల్ప కళని బట్టి తెలుస్తుంది. అందుకే ఆలయానికి జైనథ్ అని పేరు వచ్చిందని కూడా చెప్పచ్చు. ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. చాలా పురాతనమైన ఆలయం ఇది.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు: స్వామివారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు జరుగుతుంటాయి ప్రత్యేక పూజలు, జాతరలు కార్తీక మాసంలో జరుగుతుంటాయి. ఆలయం భక్తుల రాకతో, యాత్రికులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చాల ప్రసిద్ధి చెందింది.
రవి కిరణాలు సోకే నారాయణుడి పాదాలు: ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు, మాసాలలోనూ దసరా అనంతరం వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత లక్ష్మీనారాయణుని పాదాలు ఉదయ కిరణాలు తాకుతుంటాయి. ఈ అధ్భుతదృశ్యం చూడటాని కి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఆలయ విశిష్ఠత : సంతాన సాఫల్యత, కోరిన కోర్కలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. అంతే కాదు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ నారాయణ స్వామి అని, నారయణ మూర్తి అని, శ్రీ, లక్ష్మి ఇలాటి పేర్లతో పిలవబడుతుంటారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది ఈ గ్రామం చిన్నది. జైనాధ్ మండల పరిధిలో 52 గ్రామాలున్నాయి. వాటిల్లో 29 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపు స్త్రీ, పురుషులు సమానంగా ఉన్న ఈ గ్రామాల మండల జనాభా దాదాపు 50,000 లోపే వున్నారు. జైనధ్ గ్రామంలో మాత్రం జనాభా 5,000 లోపే (2001) నాటి లెక్కల ప్రకారం. ప్రభుత్వాలు పూనుకుని ఈ ఆలయంకి రాకపోకలు పెంచి, రహదారి, ఆలయం పరిసరాలు, వసతి గృహాలు ఇత్యాది వన్నీ సమకూర్చితే ఇంకా అభివృద్ధి చెందుతుంది. . అందరికీ ఈ ఆలయం గురించి తెలుస్తుంది. జైనధ్ ఆలయం పర్యాటక కేంద్రంగా మారి చరిత్రలో అద్భుతమైన ఆలయంగా మారుతుంది.
- మణినాథ్ కోపల్లె