తిరస్కారానికి పురస్కారం... నమస్కారం
తిరస్కారాని కి పురస్కారం. .. నమస్కారం!
ఓషో చెప్పిన జెన్ కథలలో ఇదొకటి....
ఆమె ఒక జెన్ సన్యాసిని.
ఆమె తన ప్రయాణంలో ఒకసారి ఒక గ్రామంలో ఉండవలసి వచ్చింది. అయితే ఆ గ్రామంలో ఏ ఒక్కరికీ జెన్ తత్త్వం గానీ జెన్ గురువులుగానీ ఇష్టం లేదు. జెన్ అనే మాట వారికి గిట్టదు. ఆమెకు ఆ విషయం తెలియక ప్రతి ఇంటికి వెళ్లి ఒక్క రాత్రి తాను బస చేసేందుకు కాస్తంత చోటు ఇవ్వాలని కోరుతారు. కానీ ఏ ఒక్కరూ జాగా ఇవ్వరు. పైపెచ్చు ఆమె మాట విని ఆమె మొహం మీదే తలుపులు వేసేస్తారు. దానితో ఆమె ఊరు చివర ఉన్న ఒక పళ్ళ చెట్టు కింద విశ్రమించవలసి వస్తుంది. చలి విపరీతంగా ఉంది. పక్కనున్న అడవి నుంచి క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. కానీ ఏం చెయ్యడం....అప్పటికే బాగా నీరసించిపోవడంతో ఆదమరచి నిద్రపోతారు ఆమె. అయితే ఎముకలు కోరికే చలితో అర్ధరాత్రి ఆమెకు మెలకువ వస్తుంది. కళ్ళు తెరచి చూడగా ఆకాశంలో నిండు చంద్రుడు కనిపిస్తాడు. అది పున్నెమ రాత్రి కావడంతో నిండు వెలుగు. నక్షత్రాలు మెరుస్తున్నాయి. చెట్టు నుంచి కొన్ని పువ్వులు రాలుతున్నాయి. చుట్టూ పరిమళం. పక్కనున్న తోటలో గాలికి చెట్లు అందంగా ఊగుతున్నాయి. ఆ మనోహర దృశ్యాన్ని చూసి ఆమె మనసు పరవశించింది. మరుసటి రోజు ఉదయం ఆమె ప్రతి ఇంటికి వెళ్లి తనకు ముందు రోజు రాత్రి నిద్ర పోవడానికి జాగా ఇవ్వనందుకు కృతజ్ఞతలు చెప్తారు. గ్రామ ప్రజలకు ఆమె ఎందుకు అలా చెప్తున్నారో అర్ధం కాలేదు. వాళ్ళు తెల్లబోయి ఆమె వంక చూస్తారు. అప్పుడు ఆమె ఇలా అంటారు.... "మీలో ఎవరైనా నాకు జాగా ఇచ్చి ఉంటే నిన్న రాత్రి నేను ప్రకృతి సౌందర్యాన్ని ఆణువణువూ చూసి ఉండేదానిని కాను. ఆ అందచందాలు నేను చూసి పరవశించిపోయాను. ఆ ఆనందానికి కారణం మీరు మీ ఇంట్లో నేను విశ్రమించడానికి జాగా ఇవ్వకపోవడమే. నేను నిన్న రాత్రి బంగారు వెన్నెల చూసాను. పూల పరిమళాన్ని ఆస్వాదించాను. పూల వర్షంలో తడిసాను. చెట్లు గాలికి స్పందించి చేసిన నృత్యాలు చూసాను. తెల్లవారుజామున పచ్చికను ముద్దాడిన మంచు ముత్యాల ఆనందాన్ని చదవగలిగాను. ఇవన్నీ చూడనిచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్పడం నా కనీస ధర్మం" అని. ఏ స్థితినైనా ఎదుర్కొని ఆనందాన్ని చవిచూసే మానసిక పరిపక్వత ఎంతో అవసరం అని జెన్ గురువులు అంటూ ఉంటారు.
- యామిజాల జగదీశ్