కన్యా వరణం
కన్యా వరణం
వివాహ సంస్కారంలో కన్యా వరణం ప్రధానమైనది. కన్యా వరణ మంటే మంచి లక్షణాలున్న కన్యని నిర్ణయించుకోవటం. దీనిని వరాగమనము అని కూడా అంటారు. వరుడు అలంకరించుకొని మంగళ గీతాలతో, వేద మంత్రాలతో మంచి వాహనాన్ని అధిరోహించి ఆడ పెండ్లి వారింటికి వెడతాడు.
పూర్వ కాలం వరుడు యోగ్యులైన మిత్రులని తన కోసం మంచి కన్యని వెదికి పెట్టమని తాంబూలం ఇచ్చి అడిగే వాడట. వారు బాగా విచారించి వరునికి అనురూపమైన మంచి లక్షణాలున్న కన్యని నిశ్చయించే వారు. ఈ నాడది కన్య పక్షం వారు వరుని వెదకటంగా అన్వయించుకో వచ్చును. లక్షణాలకన్నా ముందు శకునాలు సరి అయినవి ఉండాలని తలచే వారు. అమ్మాయిని చూడటానికి వరుడు కాని, వరుడి బంధువులు కాని వచ్చినప్పుడు ఆ కన్య నిద్ర పోతున్నా, ఇంట్లో లేక పోయినా, ఏ కారణంగానైనా దుఃఖిస్తూ ఉన్నా ఆ సంబంధం కుదుర్చుకోకూడదనే నమ్మకం ఉండేది. గుప్త, ఋషభ, శరభ, వినత, వికట, మండూషిక, ముండ, సాంకరిక, రత, పాలి, మిత్ర,, వర్షకరి, నక్షత్ర నామ, నదీనామ, వృక్ష నామ, రేఫము గాని ల కారము గాని పేరులో ఉపధ (చివరి దానికి ముందు) గా ఉన్న కన్య వర్జింప దగిన వారుగా చెప్పబడింది.
ఉత్తమ వంశంలో జన్మించింది, సంప్రదాయం శీలం ఉన్నది, శుభ లక్షణాలు కలిగినది, ఆరోగ్య వంతురాలు అయిన కన్యను ఇటువంటి లక్షణాలే ఉన్న వరుడికి ఎంతో నేర్పరితనంతో ఎంపిక చేయాలి. ఆనాటి వారు ఈ ఎంపికకి వధూవరుల పరస్పర నయనోల్లాసం, మనస్తృప్తి ప్రధానమైన ప్రమాణంగా గ్రహించే వారు. ఇంకా కన్య లక్షణాలను మన శాస్త్రాలు మరి కొన్ని చెప్పాయి. ఆమె సాముద్రికాది లక్షణాలు ఉన్నది, దేహ పుష్టి ఉన్నది, అన్న దమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నది, అన్న దమ్ముల వరుస ఉన్న పురుషుల కుటుంబాలలో పుట్టనిది, సగోత్రము కానిది, సోదరి, తల్లి, కూతురు వరుస కానిది, ........ పది సంవత్సరాలు నిండనిది అయిన కన్యను ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వ్యవహారం ఈ తీరులో జరగటం లేదు. నిజానికి అవసరం లేదేమో! ఆ కాలంలో కూడా ఇది అనవసరం అని హరదత్తుడనే ముని అభిప్రాయ పడ్డాడు. బ్రాహ్మ దైవ వివాహాలలో ఈ కన్యా వరణ పద్దతి అక్కర లేదని ఆర్ష, ఆసుర వివాహాలలో కావాలని హరదత్త మహర్షి అభిప్రాయం.
కన్యను నిశ్చయించుకొన్న తరువాత వరుడు బంధు మిత్రులతో కలిసి ఆడ పెండ్లి వారింటికి తరలి వెడతాడు.
- Dr Anantha Lakshmi