గుడి స్తంభాల మీద ఓ రహస్య జంతువు
గుడి స్తంభాల మీద ఓ రహస్య జంతువు
మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎన్ని విశేషాలను చెప్పుకొన్నా తనివితీరదు. అన్వేషించే కొద్దీ ఎదురుపడే వింతలకు ఇక్కడ లోటు లేదు. అలాంటి ఓ చిత్రమే ‘యాళి’.
ప్రాచీన దేవాలయాలలో
వందల సంవత్సరాలనాటి ప్రాచీన దేవాలయాలలో అడుగుపెట్టినప్పుడు అక్కడి స్తంభాలను ఎప్పుడైనా గమనించారా? అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడే ఆ స్తంభాల మీద తప్పకుండా సింహాన్ని పోలిన జంతువులు కనిపిస్తాయి. మధురై, తిరుపతి, హంపి... ఇలా దక్షిణాదిన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ ఈ జీవి దర్శనమిస్తుంది. ఈ ఆకృతి పేరే యాళి.
మూలాలు అస్పష్టం
యాళి అన్న జీవికి ఒక ప్రత్యేకమైన కథ అంటూ ఏమీ లేదు. కాకపోతే పురాణాలలో అక్కడక్కడా ఇలాంటి జీవుల ప్రస్తావన కనిపిస్తుంది. ఉదాహరణకు మత్స్య పురాణంలో శివగణాలను వర్ణిస్తూ చిత్రవిచిత్రమైన జీవులను పేర్కొటారు. సహజంగానే పురాణాలలో అక్కడక్కడా ప్రస్తావనకు వచ్చే ఈ జీవులకు ఒక రూపునివ్వాలని ప్రాచీన శిల్పులు ఉత్సాహపడటంలో ఆశ్చర్యం ఏముంది! దీని వలన అటు సంస్కృతిని ప్రతిబింబినట్లూ అవుతుంది, దేవాలయంలోని స్తంభాలను సైతం శిల్పాలుగా మార్చినట్లుంటుంది.
రకరకాలు
దేవాలయాలను మోస్తున్నట్లుగా, దేవునికి కాపలాగా ఉన్నట్లుగా కనిపించే ఈ యాళి ఒకే తీరున ఉండవు. చాలా సందర్భాలలో వీటికి సింహపు శరీరం ఉన్నప్పటికీ తల మాత్రం వేరే జంతువుది ఉంటుంది. భువండదేవుడు అనే శాస్త్రకారుడు తన ‘అపరాజితపృచ్ఛ’ అనే గ్రంథంలో 16 రకాల యాళిలను పేర్కొన్నాడు. వీటిలో సింహము (సింహ యాళి), ఏనుగు (గజ యాళి), గుర్రం (అశ్వ యాళి) తల ఉన్న యాళిలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లి, ఎలుక, నెమలి, కోతి, మనిషి తలలు ఉన్న యాళిలు అరుదుగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో రెక్కలు జోడించిన యాళి శిల్పాలు కూడా దర్శనమిస్తాయి.
జానపదుల నమ్మకం
ఇంతకీ యాళి అనే జంతువు కేవలం మన ఊహేనా లేకపోతే ఇలాంటి జంతువులు ఒకప్పుడు ఉండేవా అన్న అనుమానం కలుగక మానదు. ఎందుకంటే జానపదుల సాహిత్యంలో కూడా యాళి గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. యాళి అన్నింటికంటే బలమైన జంతువనీ... ఇది ఏనుగు, సింహాలను సైతం సంహరించగలదనీ జానపదులు నమ్మేవారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో కూడా యాళి అనే అతిపరాక్రమ జీవి అడవులలో తిరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు.
జీవ పరిణామక్రమంలో యాళివంటి జీవులు ఉండేవా లేవా అన్నది చెప్పడం కష్టం. కానీ మన ప్రాచీన శిల్ప సంస్కృతిలో భాగంగా మాత్రం యాళి నిలిచిపోయింది. కేవలం స్తంభాల మీద శిల్పంగానే కాకుండా ‘యాళి వాహనం’ పేరుతో యాళి ఆకృతిలో ఉండే వాహనం మీద దేవుడిని ఊరేగించే సంప్రదాయాన్ని కూడా గమనించవచ్చు.
- నిర్జర.