పర్ణశాల రామాలయం (Parnasala, shoka Ramalaya)
పర్ణశాల రామాలయం
(Parnasala, shoka Ramalaya)
భద్రాచల కోదండ రామాలయం జగత్ ప్రసిద్ధం. ఆ ఆలయ రీత్యా భద్రాచలాన్ని, మొత్తం ఖమ్మం జిల్లానీ పరమ పవిత్రంగా భావిస్తారు. అలాగే పర్ణశాల రామాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
పర్ణశాల రామాలయం ఖమ్మం జిల్లా, భద్రాచలానికి కొద్ది దూరంలో పర్ణశాలలో ఉంది. శ్రీరాముడు, వనవాస కాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకుని నివాసమున్నట్లు వాల్మీకి రామాయణం, ఇంకా అనేక పురాణ కథలు వివరిస్తున్నాయి.. సీతమ్మ మాయలేడిని చూసి వ్యామోహపడటం, రావణాసురుడు, సీతమ్మను ఎత్తుకుపోయిన ప్రదేశమూ ఇదే. రావణాసురుని రథ చక్రాల గుర్తు ఉన్న గుట్ట కూడా ఇక్కడుంది. దాన్ని రావణ గుట్ట అంటారు. ఇలాంటి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ సీతారాముల నివాసాన్ని ధృవీకరిస్తూ ఇప్పటికీ కనిపిస్తాయి. శ్రీరాముడు పర్ణశాల వేసుకుని నివాసమున్న ప్రదేశం కనుక ఈ ఊరికి పర్ణశాల అనే పేరు వచ్చింది.
పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగా ఉంటుంది.ఒకవైపు నది, ఇంకోవైపు కొండలతో ఈ ఊరు సౌందర్యానికి ప్రతీకలా ఉంటుంది. ప్రకృతి కాంత పరవశిస్తూ ఇక్కడ ఒదిగిపోయినట్లుగా ఉంటుంది.
పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరంలో సీతమ్మ వాగు పేరుతో ఒక కొండవాగు ఉంది. ఆ వాగులో సీతమ్మ స్నానం చేసేదని, అందుకే దానికి సీతమ్మ వాగు అనే పేరు వచ్చిందని అంటారు. వాగు పక్కనే ఉన్న కొండ చరియలు అనేక రంగులతో కళాత్మకంగా ఉంటాయి. సీతమ్మవారు అక్కడ పసుపు కుంకుమల కోసం కొన్ని రాళ్ళను వాడేదని, అందుకే ఆ రంగు రంగుల కొండ రాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. సీతమ్మ, రామయ్యలు తిరిగిన ఈ ప్రదేశాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు విస్తారంగా వస్తుంటారు.
సీతమ్మ దుస్తులు ఆరబెట్టుకున్న చోటు, నగలు ఉంచిన ప్రదేశం, పసుపు కుంకుమలకు ఉపయోగించిన రాళ్ళు అంటూ ఒక్కో రాయినీ, ప్రదేశాన్నీ స్థానికులు చూపిస్తుంటే భక్తుల సంతోషానికి అవధులు ఉండవు.