తిరుమలగిరి వేంకటేశ్వర ఆలయం (Tirumalagiri Venkateswara Temple)
తిరుమలగిరి వేంకటేశ్వర ఆలయం
(Tirumalagiri Venkateswara Temple)
జగ్గయ్యపేట నేషనల్ హై వే మీద చిల్లకుంట సెంటర్ నుండి వాయువ్య దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ఊరుంది. ఇక్కడి వేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది.
శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని చుట్టుపక్కల భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుండో వచ్చి దర్శించుకుంటారు.
గ్రామానికి ఉత్తరంగా తిరుమలగిరి పర్వతం ఉంది. అంటే పవిత్రమైన కొండ అని అర్ధం. పేరుకు తగ్గట్టే ఈ కొండపై దేవుని దర్శించుకుంటే అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని స్థానికులు చెప్తుంటారు.
ఈ దేవాలయ మహత్యం తెలియజెప్పే స్థల పురాణం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి దక్షిణ హిందూ దేశం వెళ్ళిన సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో ఉన్న కొండమీద ఆశ్రమం నిర్మించుకుని కఠోర తపస్సు చేశాడు. మహర్షి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై "ఏం కావాలో కోరుకో" అన్నాడు.
అందుకు బదులుగా భరద్వాజ మహర్షి "పరమేశ్వరా, ప్రజలు తమ కష్టనష్టాలు చెప్పుకుని సేద తీరడానికి ఇక్కడో ఆలయం కావాలి. అప్పుడే వారు సేదతీరగల్గుతారు, సంతోషించగల్గుతారు. అందుగ్గానూ నీ అంశను వేల్పుగా ప్రసాదించు. ప్రజలను సంరక్షించడానికి ఈ పవిత్ర పర్వతంమీద నిలుపు. ఇక్కడ దగ్గరలో నదీ ప్రవాహం ఏమీ లేనందున నిర్మల జల తరంగిణి కూడా ఏర్పాటు చేయి" అని కోరాడు భరద్వాజ మహర్షి.
పరమేశ్వరుడు అలాగేనని తల పంకించి, అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు.
మర్నాడు తెల్లవారుఝామున తిరుమలగిరి కొండపై మహా తేజస్సుతో, అఖండ శిలారూపంలో వేంకటేశ్వర స్వామి స్వయంభువుగా అవతరించాడు. చిత్రంగా వేంకటేశ్వరుని వెనుకభాగంలో పెద్ద శిలా వల్మీకం కూడా వెలసింది. ఆ పెద్ద రాతి పుట్ట, వేంకటేశ్వరుడు కలిసి ఉండటం విశేషం. అంతకంటే గమ్మత్తయిన విషయం ఏమంటే వేంకటేశ్వరునికి తూర్పున స్వామివారి ఎడమకాలిపద ఘట్టనతో కోనేరు ఏర్పడింది. ఏకశిలలో పాదం ఆకృతిలో కోనేరు వెలసింది.
ఈ గ్రామం పేరు తిరుమల తిరుపతిని పోలి "తిరుమల"గా ఉంది. తిరుపతి, అలివేలు మంగాపురం లాగే, ఈ గ్రామానికి జంటగా మంగొల్లు ఉంది.
తిరుమలగిరికి కొద్ది దూరంలో ఉన్న మంగొల్లును మొదట మంగప్రోలు అనేవారు. క్రమంగా మంగవోలు అయి, చివరికి మంగొల్లుగా స్థిరపడింది. ఇక్కడ అలివేలుమంగమ్మ నివసించేదని, అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు.