భక్త కంటేశ్వరస్వామి – బత్తినయ్య కోన (Bhakta Kanteswara Swamy – Battinayya Kona)

 

భక్త కంటేశ్వరస్వామి – బత్తినయ్య కోన

(Bhakta Kanteswara Swamy – Battinayya Kona)

 

శ్రీకాళహస్తి తాలూకా తొండమనాడు గ్రామానికి సమీపంలో బత్తినయ్యకోన అనే పుణ్యక్షేత్రం ఉంది.

స్థలపురాణం

పూర్వమెన్నడో బత్తినయ్య అని ఒక మహాపురుషుడు ధనికొండపై తపమాచరించాడు. శ్రీకాళహస్తిని దర్శించాలని తలచాడాయన. తిరుమలలో శ్రీనివాసుని సేవించి, శ్రీకాళహస్తి వెడుతూ సమీపంలోని అగస్త్యేశ్వర పర్వతాలలో తపస్సు చేసుకొనేందుకు అక్కడి గుహను మూడు అంగలలో చేరాడట. అందుకు నిదర్శనంగా ముసలిపేడు అనే గ్రామం చెరువు గట్టున ఒక పాదం, మొనగాడి గుంట అనే ప్రదేశంలో మరో పాదం, కొండ గుహ వద్ద మరోపాదం గుర్తులు నేటికీ ఉన్నాయి. ఈ పాదాల గుర్తులను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బత్తినయ్య కొండగుహలో తపస్సులో లీనమై పోగా, యుగాలు గడిచిపోయాయి. స్వామి తపస్సు నుంచి లేవలేదు అతడి చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. మహర్షి కానరావడం లేదు. పుట్టపైన చుట్టూ చెట్లు, తీగలు పెరిగాయి. పుట్ట పక్కనే సన్నటి సెలయేరు పారుతూ వుంది.

ఒకనాడు సమీప గ్రామంలోని యానాది దంపతులు తేనె, ఎల్లగడ్డలు సేకరించుకోవడానికి అడవికి వెళ్ళారు. దారితప్పి బత్తినయ్య తపస్సు చేసుకొంటున్న గుహ వద్దకు వెళ్ళారు. అక్కడ వారికి ఆహారమైన ఎల్లగడ్డలు కనిపించాయి. ఆ పరిసరాలు చూసిన ఆ దంపతులు కొంతకాలం ఆ గుహలోనే ఉండి, ఆ చుట్టు ప్రక్కల లభ్యమయ్యే వస్తువులను సేకరించడానికి నిశ్చయించుకొన్నారు. కొంతకాలమైన తరువాత ఒకరోజు వర్షం బాగా కురవడంతో, వెలుపలికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి వీలుపడలేదు. దీనితో యానాది దంపతులు ఆ గుహలోనే పుట్టపై పెరిగిన ఎల్లగడ్డలను పెకిలించేందుకు గడ్డ పారతో తవ్వనారంభించారు. పారదెబ్బ పడిన చోటు నుంచి రక్తం పైకి చిమ్మింది. పార బత్తినయ్య తలకు తగలడం చేత రక్తం స్రవించింది. పారదెబ్బ కొట్టిన యానాదికి కళ్ళు పోయాయి.

అమాయకులైన యానాదులు తమకు జరిగిన అన్యాయానికి గోడు గోడున విలపించగా, పుట్ట నుంచి ‘ఓం నమశ్శివాయ’ అనే నాదం వినబడింది. యానాదులు అచటి పుట్టలో ఎవరో మహానుభావుడు వున్నాడని భావించి ‘స్వామి మేము తెలియక తప్పు చేశాము. మన్నించండి’అని వేడుకున్నారు. స్వామి వారిని కరుణించి యానాదికి చూపును ప్రసాదించి వారితో “నన్ను బత్తినయ్య లేక భక్త కంటేశ్వరుడు అంటారు. నేను కలియుగంలో భక్తుల కోర్కెలు తీర్చేందుకు ఇక్కడ లింగరూపంలో వెలుస్తాను. ఈ విషయం మీరు కొండ దిగి వెళ్ళి గ్రామంలోని ప్రజలకు తెలియజేయండి’’ అని సెలవిచ్చాడు.

యానాదులు “స్వామీ! ఈ కీకారణ్యంలో నుంచి ఒక మారు కొండ దిగి మళ్ళీ ఈ కొండ చేరడం ఎవరితరమూ కాదు’’ అనగా స్వామి, “భక్తులు కొండ దిగువ వరకు బండ్లలో వచ్చి అక్కడ ఎద్దులను వదిలిపెడితే అవి నేరుగా నా వద్దకే వస్తాయి. వాటి వెంటే భక్తులు రావచ్చు’’ అని సెలవిచ్చాడు. స్వామి సెలవిచ్చినట్లే యానాదులు గ్రామ గ్రామానికి వెళ్ళి స్వామివారి మహిమను వివరించగా ప్రజలు తండోపతండాలుగా స్వామిని దర్శించడానికి బయలుదేరి కొందరు ఎద్దుబళ్ళను , మరికొందరు ఎద్దులను మాత్రం తీసుకొని కొండ దిగువకు వెళ్ళి ఎద్దులను వదిలి పెట్టారు. ఆ ఎద్దులు నేరుగా స్వామివారి గుహ చెంతకు వెళ్ళాయి. భక్తుల ఎద్దుల వెంట స్వామి సన్నిధి చేరి భక్తి ప్రవర్తులతో స్వామిని పూజించారు. యానాది దంపతులు జీవితాంతం స్వామిని కొలుస్తూ ఆయనలో లీనమై పోగా, ఆనాటి నుంచి తన దర్శనమై వచ్చే భక్తులతో మొదట యానాది దంపతులను పూజించి, ఆ తరువాత తనను పూజించమన్నారట! అందుచేతే స్వామి చెంత ఈనాడు యానాది దంపతుల శిలాప్రతిమలు పూజలందుకుంటున్నాయి. ప్రతి సోమవారం ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి స్వామిని పూజిస్తారు.