ఆత్మశుద్ధి అంటే ఏమిటి? (Atmashuddhi)
ఆత్మశుద్ధి అంటే ఏమిటి?
(Atmashuddhi)
ఆత్మశుద్ధి అనే పదాన్ని తరచూ వింటుంటాం. కానీ దీనికి సరైన అర్ధం ఏమిటో మనకు అంతగా తెలీదు. బ్రహ్మ స్నానానంతరం ఆత్మశుద్ధి చేసుకోవాలి. అదెలా చేయాలంటే - ఒక ఉద్ధరిణి నీటిని అరచేతిలో వేసుకుని
''సూర్యశ్చేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః ప్రకృతి
శ్చందః సూర్య మన్యు మన్యుపతాయో రాత్రిర్దేవతాః
జలాభి మంత్రణే వినియోగః సూర్యశ్చ మామన్యుశ్చ
మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షన్తాం
యద్రాత్రియా పాప మకార్షంమనసా వాచా
హస్తాభ్యాం పద్మ్యాం ఉదారేణ శిశ్నా రాత్రి స్తదవ లుంపతు
యత్కించితు ఉరితం మయి ఇదామహం మమ
మ్రుతయోనౌ సూర్యేజ్యోతిషి జుహోమిస్వాహా ''
- అనే మంత్రాన్ని స్మరించి ఆ నీటిని తాగాలి.
ఈ మంత్రానికి అర్ధం ఏమిటంటే ''మనం సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకూ ఏమైనా పాపాలు చేసివుంటే అవన్నీ నాశనమైపోయి, మంచి జరగాలని'' కోరుకుంటూ, సూర్యకిరణాలను చూస్తూ ప్రార్ధించడం అన్నమాట.
రాత్రి చేసిన కూడని పనులు అనడంలో ఉద్దేశం పగలు ఎటూ సూర్యుడు మనల్ని రక్షిస్తాడు. సూర్యుని శక్తి అపారం, అనంతం. మనం పీల్చే గాలి, తాగే నీళ్ళు, తినే ఆహారం - ఇలా ప్రతిదాంట్లో అసంఖ్యాకమైన సూక్ష్మక్రిములు ఉంటాయి. వాతావరణంలో ఉన్న కనిపించే, కనపడని క్రిములు మనకు ఎన్నో విధాలుగా హాని చేస్తాయి. వాటిని రవి తేజస్సు ఎప్పటికప్పుడు నాశనం చేస్తుంటుంది. ఆవిధంగా సూర్యుడు మనల్ని కాపాడుతున్నాడు. అనేక జబ్బుల బారిన పడకుండా, రవి తేజస్సుద్వారా రక్షణ పొందుతున్నాం.
మరి రాత్రివేళ సూర్యుడు ఉండడు కదా.. కనుక అనేక రూపాల్లో, అనేక విధాలుగా మన శరీరంలో చేరి, హాని కలిగించే సూక్ష్మక్రిములు నాశనం కాకుండా యదేఛ్చగా విహరిస్తాయి. దాంతో మనకు పగటికంటే రాత్రిపూటే జబ్బులు కలిగే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి అనారోగ్యాలను అనుభవించడమే పాపం. పాపం అంటే తప్పు మాత్రమే కాదు, రోగం అని కూడా అర్ధం. ఇంకోరకంగా చూస్తే, ఏదో రూపంలో సూక్ష్మక్రిములను సేవిస్తాం కనుక వాటిని హత్య చేస్తున్నాం. అవి మనకు హాని చేసే మాట నిజమే అయినప్పటికీ వాటిని మనం హతమారుస్తున్నాం కనుక అది పాపం.
మనం తెలిసీ తెలీక చేసే తప్పుల నుండి, అనారోగ్యాల నుండి రక్షించమని కోరుకుంటూ సూర్యుని ప్రార్ధించడమే ఆత్మశుద్ధి. సూర్య నమస్కారాలు చేయడంలో ఉన్న పరమోద్దేశం కూడా ఇదే. ఏ రకంగా చూసినా సూర్యుని తేజస్సు మనకు మేలు చేస్తుంది. పైగా పొద్దున్నే వచ్చే ఉదయభానుని కిరణాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అది కాన్సర్ లాంటి భయానక రోగాలను సైతం తరిమికొడుతుందని డాక్టర్లు చెప్తున్నారు.
కనుక దేహాన్ని శుభ్రపరచుకోవడంతోబాటు ఆత్మశుద్ధి కూడా చాలా ముఖ్యం.