సెలబ్రెటీలను చూసి మోసపోవద్దు

 

సెలబ్రెటీలను చూసి మోసపోవద్దు

 

 

స్త్రీ జీవితంలో మాతృత్వం ఒక అందమైన మలుపు. ఒక మర్చిపోలేని అనుభవం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి అనుభవం ఒక విషాదంగా మారిపోతోందంటున్నారు విశ్లేషకులు. కారణం ఏమిటంటే....

సెలబ్రెటీల ఫొటోలు

ఈ మధ్యకాలంలో పెళ్లైన సెలబ్రెటీలు తమ వైవాహిక జీవితం గురించి కూడా, తరచూ ఫొటోలను జనాలతో పంచుకుంటున్నారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం వంటి మాధ్యమాలలో ఎప్పటికప్పుడు వీరి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. తాము గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డను కనేవరకూ ప్రతి అధ్యాయాన్నీ రకరకాల ఫొటోల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు మన దేశంలో కూడా కనిపిస్తోంది.

అయితే ఏంటట!

సెలబ్రెటీల ఫొటోలు అంటే ఆషామాషీగా ఉండవు కదా! కావల్సినంత డబ్బులు ఖర్చుపెట్టి ఫొటోషూట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఒకటికి వంద ఫొటోలు తీసి చూసుకుంటారు. ఆపైన అవసరం అయితే ఫొటోషాప్‌ వంటి సాంకేతిక సాయంతో తాము మరింత అందంగా కనిపించేలా శ్రద్ధ తీసుకుంటారు. ‘బిడ్డ పుట్టిన తరువాత కూడా ఈ అమ్మాయి ఎంత నాజూకుగా ఉందో కదా!’ అన్న భావన కలిగేలా అన్ని చర్యలూ తీసుకుంటారు. ఈ ఫొటోల ప్రభావం అప్పుడే తల్లిగా మారిన స్త్రీల మీద పడుతోందంటున్నారు. ‘తాము అలా ఎందుకు ఉండలేకపోతున్నాము! అలా ఉండాలంటే వ్యాయామాలు ఏమన్నా చేయాలేమో!’ అన్న సందిగ్ధత సాధారణ ప్రజలలో కలగడం సహజమే కదా! అది ఒకోసారి ఆత్మన్యూనతకు కూడా దారితీస్తోంది.

మార్పు సహజం

బిడ్డ పుట్టిన తరువాత ఎవరి శరీరంలోనైనా కొంత మార్పు చోటు చేసుకోవడం సహజం. నెలల తరబడి నిదానంగా ఏర్పడిన ఈ మార్పు... మళ్లీ నెలల తరబడి జాగ్రత్తలు తీసుకుంటే కానీ తగ్గేది కాదు. ఇందుకోసం ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు తగిన శారీరిక శ్రమ లేదా వ్యాయామాలను చేయాలి. అలా కాకుండా ఒక్కసారిగా తాము మునుపటి శరీరాకృతిని పొందాలనే తపనలో లేనిపోని మందులు, కఠినమైన వ్యాయామాల జోలికి వెళ్తే ఆరోగ్యం మీద అవి తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆ జీవితాలు వేరు

బిడ్డల్ని కన్న సెలబ్రెటీలను చూసి తాము కూడా అలా నాజూకుగా మారిపోవాలన్న ఈ తపన పాశ్చాత్య దేశాలలో విపరీత ధోరణులకు కారణం అవుతోందట. అందుకనే ఈ వారం లండన్‌లో జరగనున్న ఒక సమావేశంలో ఈ సమస్య గురించి మహిళలను హెచ్చరించేందుకు నిర్వాహకులు సిద్ధపడుతున్నారు. పైగా సెలబ్రెటీల జీవన విధానం వేరుగా ఉంటుంది. వారు మొదటి నుంచి వ్యాయామం చేసేందుకు అలవాటుపడి ఉంటారు. ఆహారం విషయంలోనూ రాజీపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వారిని అనుకరించే దిశలో లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.