Read more!

హనుమంతుడి ద్వారా మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే!

 

హనుమంతుడి ద్వారా మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే!

భగవంతుడి చరణాలను ఆశ్రయించి, “అహం” అనే దాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆ పరమాత్మ అవ్యాజ కరుణకు పాత్రులమవడమే "ఆరాధన" అంటే. పరమేశ్వరుడి పాదాల పైనే మనస్సు నిలిపి, లౌకికమైన పనులన్నీ చెయ్యవచ్చు. భగవంతుడి చరణాలకు తనను తాను సమర్పించుకున్న వారిలో ముఖ్యుడిగా ఆంజనేయ స్వామిని చెప్పవచ్చు, ఆయన జీవితం అందరికీ చక్కని ఉదాహరణగా నిలచింది.

శతయోజనాల విస్తీర్ణం గల మహాసముద్రపు ఒడ్డుకు చేరి, దానిని దాటాలి అనుకున్న వానరుల మనసులలో వివిధ రకాలైన ఆలోచనలు తలలెత్తాయి. జాంబవంతుడు వృద్ధాప్యం వలన "తాను అశక్తుణ్ణి" అన్నాడు. అంగదుడు “సముద్రం దాటి వెళ్ళగలను కానీ వెనక్కి తిరిగి రాలేను" అన్నాడు. ఇలా ఏ ఒక్కరూ సాహసించి ముందుకు రాలేక పోయారు. చివరికి దూరంగా, ఒక్కడూ కూర్చుని జరుగుతున్నదంతా మౌనంగా గమనిస్తున్న ఆంజనేయ స్వామి వద్దకు చేరారు. అందరూ శ్రీరాముడు అనుగ్రహించి, తనకు శక్తినిస్తే తాను సముద్రాన్ని దాటుతాను అన్నారు ఆంజనేయస్వామి. శ్రీరాముడి కృపా కటాక్షాలు ఉంటేనే అటువంటి మహత్కార్యాలు చెయ్యగలం. ఇక్కడ తన ప్రభువుకు పూర్తిగా విధేయుడై ఆరాధించిన ఆంజనేయస్వామిని చూస్తాం మనం. భక్తికి నిర్దిష్టమైన రూపమిస్తే అది ఆంజనేయస్వామి.

లంకాయానంలో ఆంజనేయులవారికి మూడు విధాలైన అడ్డంకులు ఎదురయ్యాయి. తన సునిశితబుద్ధి వల్ల ఆ అడ్డంకులను అధిగమించి ముందుకు పయనమయ్యారు. మనకు కూడా పరమార్థ లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎలా పరిష్కరించాలంటే..

సముద్రాన్ని దాటేటప్పుడు మొదటి అడ్డంకి సురస. ఆంజనేయుణ్ణి మింగాలని నోరు తెరిచింది. ఆంజనేయ స్వామి సూక్ష్మరూపం ధరించి, ఆమె నోట ప్రవేశించి, తెరచిన నోరు మూసేలోపు వెలుపలకు వచ్చారు. ఆధ్యాత్మిక సాధనా పథంలో ముందుకు సాగాలనుకునే సాధకునికి ప్రారంభంలోనే ఎదురయ్యే అడ్డంకి “అహం”. ఆంజనేయులవారిని సురస మింగాలని చూసినట్లే అహంకారం మన వ్యక్తిత్వాన్నే మింగేసేటంతటి దవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి “అంతా భగవంతుడే చేస్తున్నాడు, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి" అని అనుకోవాలి.

ఇంకాస్త దూరం వెళ్ళాక ఆంజనేయ స్వామికి తన వేగం తగ్గుతోందన్పించింది. ఎవరో తన ఛాయను పట్టుకుని తాను మున్ముందుకి సాగలేకుండా అడ్డుపడుతున్నారని గ్రహించారు. అలా చేస్తున్నది ఛాయాగ్రహి అయిన సింహిక అని తెలుసుకుని, వెంటనే ఆమెని సంహరించారు. దీనిని తామసికమైన అడ్డంకి అంటారు.

ఆంజనేయులవారి మార్గంలో సింహిక అడ్డంగా నిలచినట్లే ఈర్ష్య, అసూయలు మనల్ని మన మార్గంలో ముందుకు సాగనీయవు. కాబట్టి ఆంజనేయుల వారిలా వాటిని తక్షణం అణచివేయాలి.

సింహికను సంహరించి లంకానగరం చేరారు ఆంజనేయస్వామి. లంకలోకి ప్రవేశిస్తున్న ఆయనికి లంకానగరానికి కావలిగా ఉండే లంఖిణి ఎదురై, లోనికి ప్రవేశించనీయకుండా అడ్డుపడింది. ఆంజనేయస్వామి ఒక్క దెబ్బతో ఆమెని పడగొట్టి లంకలోకి ప్రవేశించారు. లంఖిణి రాజసికమైన అడ్డంకిని సూచిస్తుంది. మనం దీని దిశను మార్చి భగవత్ సాక్షాత్కారం అనే దిశలోకి మళ్ళించాలి.

                                 ◆నిశ్శబ్ద.