అన్నీ ఆయన ఇచ్చినవే

 

 

అన్నీ ఆయన ఇచ్చినవే

 

 

ఒకసారి ఒక పెద్ద 10 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది . కిందవున్న ఓ కూలీని ఆ భవనం ఆరో అంతస్తులో వున్న యజమాని పిలుస్తాడు. ఆ కూలీకి వినిపించదు. ఎప్పటిలాగే తలవంచుకుని రాళ్లు కొడుతుంటాడు. ఓ రెండు మూడుసార్లు గట్టిగా పిలిచినా వినిపించుకోకపోవడంతో తన జేబులోంచి ఓ పది రూపాయల నోటు తీసి కిందకి విసురుతాడు యజమాని. ఆ నోటు ఆ కూలీ ఎదురుగా పడుతుంది. ఆ కూలీ దానిని తీసుకుని జేబులో పెట్టుకుని మళ్ళీ రాళ్లు కొట్టే పనిలో పడతాడు. యజమాని ఈసారి 20 రూపాయల నోటు వేస్తాడు. దానిని తీసుకుని దాచుకుంటాడు కూలీ. 50,100 కూడా వేసినా తల తిప్పి పైకి చూడడు... నోట్లయితే తీసి దాచుకుంటాడు. దాంతో ఎలా అయినా కూలీని పిలవాలనుకుని యజమాని ఈసారి ఓ రాయి తీసుకుని ఆ కూలీ మీదకి విసురుతాడు. చిన్న రాయి తగలగానే వెంటనే తల ఎత్తి పైకి చూస్తాడు ఆ కూలీ.

కథ అక్కడితో అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఆలోచించాలి. భగవంతుడు కూడా మనకి ఆ యజమానిలానే చిన్న చిన్న విజయాలు,పెద్ద పెద్ద లాభాలు అందిస్తాడు. తనని చుస్తామేమో, తలుస్తామేమో అని ఆశిస్తాడు. కానీ మనం అవి ఎవరు ఇచ్చారన్న ధ్యాస లేకుండా అదేదో మన ప్రతిభే అన్నట్టు సంతోషాల్లో మునిగి తేలుతాం. ఒక్కసారన్నా తన ఉనికిని మనం గుర్తించాలని మనల్ని పలకరించటానికి మరో దారి లేక... మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తాడా దేవుడు. అప్పుడు ఎందుకిలా? నాకే ఎందుకిలా? అని మనం ఆ భగవంతుడిని ప్రశ్నించటం మొదలెడతాం.

మన ఉనికికి ఆధారం, మన గమ్యానికి చిరునామా అయిన ఆ భగవంతుడిని ఎల్లప్పుడూ స్మరిస్తూ.. సుఖాలు, కష్టాలు ఏవి అయినా ఆయన ప్రసాదాలుగా స్వీకరించ గలిగితే జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది.

-రమ ఇరగవరపు