Read more!

వారంలో ఏ రోజు ఏం చేస్తే ఫలితం వస్తుంది..

 

వారంలో ఏ రోజు ఏం చేస్తే ఫలితం వస్తుంది.. 

 

 

జ్యోతిషం ప్రకారం వారంలో ఒకో రోజుకీ ఒకో గ్రహం అధిపతి. ఆ అధిపతులు ప్రభావం ఆ రోజు మీద తప్పకుండా ఉంటుంది. అందుకే ఏ రోజు ఎలాంటి పని చేస్తే, ఉపయోగం ఉంటుందో... ఎలాంటి పని చేస్తే నష్టం వస్తుందో అనుభవం మీద చెబుతున్నారు పెద్దలు. అవేంటో చూద్దామా!

సోమవారం: ఈ రోజుకి చంద్రుడు అధిపతి. చంద్రుడు మన మనసుని అదుపు చేస్తాడని జ్యోతిషం చెబుతోంది. కాబట్టి ఎలాంటి తడబాటూ లేకుండా చటుక్కున పూర్తయిపోయే పనుల కోసం ఈ రోజుని ఎంచుకోవాలి. షాపింగ్ చేయడం, ఇల్లు సర్దుకోవడం, పార్టీ చేసుకోవడం లాంటి పనులు ఈ రోజు చేస్తే చాలా ఉపయోగమట. వ్యాపారం, ఉద్యోగం లాంటి దీర్ఘకాల పనులకు సోమవారం అంత మంచిది కాదని చెబుతున్నారు.

మంగళవారం: ఈ రోజుకి అధిపతి కుజుడు. కుజుడు కోపస్వభావం కలిగిన గ్రహం. అందుకని ఈ రోజు కోర్టు, వ్యాపార లావాదేవీల జోలికి పోకూడదు. లేనిపోని గొడవల్లో తలదూర్చడం, వాదనకి దిగడం లాంటి పనులు చేయకూడదు. అయితే యంత్రాలు, మెడిసిన్ వంటి విషయాల మీద కుజుడి అనుకూల ప్రభావం చాలా అవసరం. అందుకని మంగళవారం మెడికల్‌ చెక్‌ అప్స్‌, సర్జరీలకి అనువైన రోజుగా భావిస్తారు. యంత్రాలు కొనేందుకు, repairs  చేసుకునేందుకు కూడా మంగళవారం ఉపయోగపడుతుంది.

బుధవారం: బుధుడు ఈ వారానికి అధిపతి. ఈ గ్రహం తెలివితేటలని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఏదన్నా కోర్సులో చేరాలన్నా, పని నేర్చుకోవాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా ఈ రోజు మంచిది. బుధుడు క్రియేటివిటీని కూడా ప్రభావితం చేస్తాడు. అందుకని సరదాగా ఏదన్నా కళని నేర్చుకోవాలన్నా, సినిమాలు షికార్లతో ఎంజాయ్‌ చేయాలన్నా ఈ రోజు మంచిదే!

గురువారం: దేవతల గురువు బృహస్పతి ఈ రోజుకి అధిపతి. ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుందని నమ్మకం. చదువు, వ్యాపారం, పెట్టుబడి లాంటి పనులు మొదలుపెట్టాలన్నా; పెళ్లి పనులు ప్రారంభించాలన్నా; ఆభరణాలు, ఆస్తులు కొనాలన్నా... ఈ రోజు మంచిది. కోర్టు పనులు, వ్యాపార లావాదేవీలకు కూడా ఇది అనువైన రోజు.

శుక్రవారం: ఈ వారానికి శుక్రుడు అధిపతి. శుక్రడు అందాన్నీ, సుఖాన్నీ అందిస్తాడు. ప్రేమ వ్యవహారాలకీ, కుటుంబంతో కలిసి కాలక్షేపం చేయడానికీ ఈ రోజు అనువుగా ఉంటుంది. స్నేహితులని కలవడానికీ, కాలక్షేపం చేయడానికీ, డ్యాన్స్‌లాంటివి నేర్చుకోవడానికీ, సినిమా ఫీల్డ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిండానికీ ఈ రోజు బాగుంటుంది.

శనివారం: చాలాకాలం ఉండాలి అనుకునే పనులను ఈ రోజు మొదలుపెట్టవచ్చు. అంటే ఇల్లు, ఉద్యోగంలాంటివన్నమాట. శని మన పాపపుణ్యాలను గమనిస్తుంటాడు. అందుకని దానాలు చేయడం, గుళ్లకి వెళ్లడంలాంటి పనులు ఈ రోజు చేస్తే మంచిది. మాంసం తినడం, బలులు ఇవ్వడం, మద్యం సేవించడం లాంటి పనులు ఈ రోజు చేయకూడదు.

ఆదివారం: ఈ రోజుకి అధిపతి సూర్యడు. సూర్యడు కోపంగా ఉండే దేవతే అయినా మంచి ఫలాతాలనే ఇస్తాడు. సూర్యడు ఆరోగ్యాన్నీ, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, పదవులనీ అందిస్తాడు. అందుకని ఏదన్నా నేర్చుకోవాలన్నా, వైద్యులని consult చేయాలన్నా, రాజకీయాల్లో ప్రవేశించాలన్నా, ప్రమోషన్‌ కోసం ప్రయత్నించాలన్నా... ఈ రోజు మొదలుపెడితే మంచిది.