గంగావతరణ
ఒకప్పుడు వర్షాల్లేక నీటి కరవు వచ్చింది. గుక్కెడు నీళ్ళు లేక ప్రజలు అల్లాడిపోయారు. మానవులే కాదు ఇతర జంతుజాలమూ నీటి కరవుతో చావుకు సిద్ధమయ్యాయి.
ఆ పరిస్థితిలో రుషులందరూ బ్రహ్మ వద్దకు వెళ్లి విషయం వివరించి బాధపడ్డారు. ఋషుల మొర విన్న బ్రహ్మ కమండలం లోంచి ఒక నీటి చుక్కను నేలమీదికి విదిలించాడు.
ఆ ఒక్క నీటిబిందువే వాగు, చెరువు, నదిగా మారి ప్రవహించింది. రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు, చెట్టులు, పుట్టలు దాటి ఒకసారి నెమ్మదిగా, ఇంకోసారి వేగంగా ప్రవహిస్తూ వచ్చింది.
చివరికి ఎంత ఉధ్రుతంగా మారిందంటే చెట్లు, పుట్టలను తనలో విలీనం చేసుకునే స్థితికి వెళ్ళింది. నిన్నటివరకూ నీటి ఎద్దడితో బాధపడితే, ఇప్పుడు ఇదేమిటి ఇలా పోటెత్తుతోంది అని విలపించారు ప్రజలు.
నీటికోసం బ్రహ్మను వేడుకున్నట్టే ఈ ముప్పు నుండి కాపాడమని ఈసారి మహాశివుని ప్రార్ధించారు. తపోదీక్షలో ఉన్న మహాశివుని ఈ ప్రార్థన కలవరపెట్టింది. కన్ను తెరిచాడు. గంగ ఉధృతిని చూశాడు. లోకాన్ని కబళించేట్టుగా ఉందని అర్ధమయింది.
అంతే, శివుడు ప్రళయ రుద్రుడే అయ్యాడు. తన శిరోజాల జటలలో కొన్ని పాయల్నికిందికి పంపాడు. ఆ జటాజూటాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగను ఇట్టే బంధించాయి. ఆవిధంగా పరమేశ్వరుడు లోకాన్ని జలప్రళయం నుంచి కాపాడాడు.