గణపయ్య దంతం ఎలా విరిగింది?
ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని పూజిస్తాం. లేకుంటే ఆ పని సక్రమంగా పూర్తికాదని, మన కోరిక నెరవేరదని నమ్ముతాం. వినాయకునికి నమస్కరించినట్లయితే ఎలాంటి ఆటంకాలూ ఎదురవకుండా పనులు జరుగుతాయి.
అందుకే గణేశుని విఘ్నాధిపతి అంటారు. ఇతర దేవుళ్ళను ఆరాధించేవారు కూడా వినాయకుని విగ్రహాన్ని పూజా మందిరంలో తప్పకుండా ఉంచుతారు. అందరూ ఇంత భక్తిశ్రద్ధలతో పూజించే గణపయ్యకు ఒక దంతం సగం విరిగి ఉంటుంది. ఎందువల్ల? అసలు గణపతిని విఘ్నాధిపతి అని ఎందుకంటున్నారు? అలా ఎందుకయ్యాడు? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? గణపతి దంతం విరిగి ఉండటానికి, విఘ్నాధిపతిగా పూజించడానికి సంబంధించి ఒక పురాణ కధనం ఉంది.
షణ్ముఖుడు స్త్రీ పురుష లక్షణాలను చాటిచెప్పే గ్రంధం ప్రారంభించాడట. అందులో ప్రస్తావించిన పురుష లక్షణాలు ఏవీ తనలో లేవు అనిపించిందట గణపయ్యకి. దాంతో కోపమొచ్చి ఆ గ్రంధం పూర్తవకుండా విఘ్నం కలిగించాడట. షణ్ముఖుడేం సామాన్యుడా? కోపోద్రిక్తుడై గణపతి దంతాన్ని విరగ్గొట్టాడట. అదీ సంగతి, గణపయ్య దంతం సగమే ఉండటానికి కారణం షణ్ముఖుడన్నమాట. మొత్తానికి అప్పటినుంచీ ఎదైనా పని మొదలుపెట్టేముందు, అది మధ్యలో ఆగిపోకుండా గణపయ్యను ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగా మారింది.