గణపతియే పరబ్రహం -అతడే సర్వోత్తముడు
గణపతియే పరబ్రహం -అతడే సర్వోత్తముడు అనే తత్వాన్ని ప్రతిపాదించే రెండు ఉప పురాణాలేగాక గణపతి పుట్టుక , మహిమ అతని పుజానుష్టాన విధి విధాన నిరూపించే అంశాలను కనీసం పది పురాణాలలో లభిస్తుంది .వాటిలో కొన్నియిచట యివ్వబడ్డాయి. స్కాంద పురాణ మందలి నాగర ఖండంలో హటకేశ్వర క్షేత్ర మహిమను వర్ణిస్తూ సూత పౌరాణికుడు ఈ క్షేత్రమున స్వర్గ , మర్త్య లోకాల నిచ్చువారూ, నరకం నుండి నివారించువారూ , సకల విఘ్నపరిహారకులూ , సురాసురులచే పూజింపబడువారును, సకలాభిష్టముల నిచ్చువారు, విద్యను కీర్తిని పెంపో౦దిచువారూ అగు ముగ్గురు గణపతులున్నారు....... పూర్వం ఒకానొకప్పుడు మానవులు భోగకాంక్షా పరులై తీవ్ర తపస్సు చేసి స్వేచ్చగా స్వర్గానికి వెళ్ళారు.
దేవలోకం మానవులతో నిండి , వారు దేవతలపై తమ ప్రభావం ప్రసరింప చేశారు . భయకంపితుడై దేవంద్రుడు కైలసానికి వెళ్ళి గౌరీ సమేతుడగు పరమ శివుని ప్రార్ధిస్తూ మర్త్యలోకం నుండి మానవులు దేవలోకానికి ఆసంఖ్యాకంగా వచ్చి తమను బాధపెట్టకుండా చేసే మార్గాన్ని సూచింప వేడినాడు. అప్పుడు శివుడు గౌరీదేవి ముఖము చూడగా ఆమె తన శరీరాన్ని ప్రయత్నపూర్వకముగా మర్దించి మురికిని తీసి దానితో ఏనుగు ముఖం నాలుగు చేతులు , పెద్ద శరీరం బొజ్జ కడుపూ గల్గి దేవతలందరికీ ఆశ్చర్యం కలిగించే వానిని నిర్మించింది. ఆ గజాననుడే వినయంతో ముకుళిత హస్తాలతో గౌరీదేవికి నమస్కరించి తన సృష్టికి కారణమేమని అడ్డగా గౌరీదేవి- ''నీవు భూలోకంలో - స్వర్గ -మోక్ష కాంక్ష గల మానవుల శుభకర్మలకు విఘ్న౦ కలిగించు .నీకు యీ కృషిలో నందీ, మహాకాలుని అధీనంలో ఉండే అన్ని గణాలు తోడ్పడతాయి.నీవే వారికి నాయకుడవు ''అని పలికి తీర్ధ , ఔషధాదులతో సంభ్రమంతో అతనికి తనే అభిషేకం చేయించింది .
అప్పుడు ముప్పది మూడుకోట్ల దేవతలూ అతనికి మంగళాశంసలు తెలిపారు .మహేశ్వరుడు అతనికి వాడియైన గొడ్డలినియిచ్చినాడు. పార్వతీ మోదక పాత్ర నిచ్చింది. కార్తికేయుడు వాహనంగా ఎలుకను యిచ్చినాడు .బ్రహ్మ సంతోషంతో అతనికి త్రికాల జ్ఞానశక్తిని ప్రసాదించినాడు.విష్ణువు బుద్దిని, ఇంద్రుడు సౌభాగ్యమును, కుబేరుడు ఐశ్వర్యాన్ని, సూర్యుడు ప్రతాపాన్ని, చంద్రుడు కాంతిని యిచ్చారు. ఈ రీతిగా వారాలు పొందిన గణపతి స్వర్గ మోక్షల నాశించు భూలోక వాసుల పుణ్యకర్మలకు విఘ్నం కలిగించ సాగాడు .అందువల్ల సత్పలాపేక్షగల మానవులు సర్వ శుభకార్యములకు విఘ్నరాజును పూజింపసాగారు.
స్కాంద పురాణ మండలి యిదే ఖండంలో గణపతి పుట్టుకకు సంబంధించిన మరొక కథ వుంది.దానిలో గౌరీదేవి తన శరీరాన్ని రుద్దుకొనాగ వచ్చిన మురికి నుండి క్రీడా విలాసంగా పురుషాకారములో ఏనుగు తల, నాలుగుచేతులు, లావుపాటి తొడలు గల బొమ్మను నిర్మించి 'ప్రభు యితనికి ప్రాణమిమ్ము 'అని ప్రార్ధించి౦ది. శివుడు సృష్టి సుక్తంతో అతనిని స్పృశించి జివ సూక్తంతో సృష్టి౦పబడిన యీ నీ కుమారుడు సకల గణాలకు అధ్యక్షుడగుగాక.చతుర్ధినాడు యితనికి పుజించువారి విఘ్నాలన్నీ పరిహరమగుగాక అని వరమిచ్చినాడు. ఈ రీతిగా గౌరీ పుత్రుడైన గజాననుడు గణపతి, విఘ్నేశ్వరుడు అయినాడు.