ఫ్యాషన్‌తో వెన్నునొప్పి వస్తుందా!
ఫ్యాషన్‌తో వెన్నునొప్పి వస్తుందా!
చిరోప్రాక్టిక్ మెడిసిన్ అని ఒక తరహా వైద్యం ఉంది. వెన్నుపూస మీద కలిగే ఒత్తిడి కారణంగానే శరీరంలో అనేక సమస్యలు ఏర్పడతాయన్నది వీరి వాదన. ఆధునిక వైద్యం వీరి చికిత్సా విధానాన్ని అంతగా అంగీకరించనప్పటికీ... చిరోప్రాక్టిక్ చికిత్సకి పాశ్చాత్య దేశాలలో మంచి ఆదరణ ఉంది. ఆ చికిత్సని అందించే అధికారిక సంస్థలూ ఉన్నాయి. వాటిలో ఒకటి British Chiropractic Association (BCA). ఈ సంస్థ కొన్ని వందల మందిని పరిశీలించిన మీదట ఈమధ్యనే ఒక నివేదికను వెల్లడి చేసింది. ఆధునిక మహిళల వస్త్రధారణ వల్ల నానారకాల సమస్యలు ఏర్పడతాయన్నది ఇందులోని సారాంశం. మరి వారి వాదనలేంటో వినండి...
బిగుతైన జీన్స్:- బాగా బిగుతుగా ఉండే జీన్స్ వంటి దుస్తులను ధరించడం వల్ల కాళ్లలోని సహజమైన కదలికలు తగ్గిపోతాయట. దానివల్ల నడిచేటప్పుడు పూర్తి బరువంతా మన కీళ్ల మీదే పడుతుందని హెచ్చరిస్తున్నారు.
బరువైన హ్యాండ్‌బ్యాగ్స్:- ఇప్పటి మహిళలు మోస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ చాలా బరువుగా ఉంటున్నాయని వాపోతోంది BCA సంస్థ. పైగా వీటిని భుజానికి కాకుండా, మోచేతులకి తగిలించుకోవడం వల్ల... ఒకవైపు భుజాన్ని కిందకి లాగివేసే పరిస్థితి ఏర్పడుతోందట. దీనివల్ల వెన్నునొప్పి ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు.
బరువైన కోట్లు:- మన దగ్గరైతే తక్కువ కానీ... పాశ్చాత్య దేశాలలో ఇంతింత బరువుండే ఉన్ని దుస్తులను వేసుకుంటారు. తల మీద బరువుంచే ఇలాంటి దుస్తుల వల్ల మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయట.
హైహిల్స్:- హైహీల్ చెప్పుల గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పుకోనవసరం లేదేమో! కానీ ఇలాంటి చెప్పుల వల్ల వెన్నుపూస మీద లేనిపోని ఒత్తిడి ఏర్పడుతుందని మరోసారి హెచ్చరిస్తోంది BCA.
పట్టీలేని చెప్పులు – చెప్పులైనా, షూస్ అయినా పాదం వెనక భాగం నుంచి పట్టు అందించేలా ఉండాలి. కానీ ఇప్పుడు ధరించే పాదరక్షలు ఫ్యాషన్ కోసం కేవలం కాలి వేళ్ల మీదే ఆధారపడి ఉంటున్నాయి. దీని వల్ల పాదాలు, నడుములలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
బరువైన ఆభరణాలు:- సందర్భాన్ని బట్టి మెడలో బరువైన ఆభరణాలను వేసుకోవడం ఇప్పుడ తరచూ కనిపించేదే! దీని వల్ల మెడలో ఉండే ఎముకల మీద లేనిపోని ఒత్తిడి కలగడమే కాకుండా, శరీర భంగిమలో కూడా తేడా వస్తుందట.
ఒక్కముక్కలో చెప్పాలంటే మన సహజమైన కదలికలను ప్రభావితం చేసే ఎలాంటి దుస్తులైనా, అలంకరణలైనా... ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. BCA నివేదిక ప్రకారం 73 శాతం మంది ఏదో ఒక తరహా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే వారలో మూడోవంతు మందికి తమ నొప్పికి కారణం అసహజమైన వస్త్రధారణ అని తెలియనే తెలియదు! అయితే ఈ వాదనను ఇంగ్లీషు వైద్యులు కొట్టిపారేస్తున్నారు. మన వెన్ను మరీ అంత సున్నితమైనదేమీ కాదనీ.. చిన్నా చితకా బరువులని నిర్భయంగా మోయగలదని చెబుతున్నారు. కొద్దిపాటి ఒత్తిడిని ఆనాయాసంగా తట్టుకోగలదని హామీ ఇస్తున్నారు. అంటే ఎవరి మాట వినాలో ఇక మనమే నిర్ణయించుకోవాలన్నమాట!
- నిర్జర.