ఏనుగు బొమ్మ అదృష్టాన్ని తీసుకువస్తుందా

 

ఏనుగు బొమ్మ అదృష్టాన్ని తీసుకువస్తుందా..?

 

 

ఏనుగు బొమ్మ ఏమిటి అదృష్టం తీసుకురావటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా. కొన్ని కొన్ని విషయాలు వినటానికి కొత్తగా ఆశ్చర్యంగా ఉన్నా అవి తెచ్చిపెట్టే ఫలితాల విషయంలో మాత్రం ఎలాంటి సందేహం ఉండదు. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి అంటే, ఫలానా వాళ్ళు కనిపెట్టారు అని చెప్పలేం గాని, మన పూర్వీకుల నుండి మనకి సంక్రమించాయి అని మాత్రం చెప్పచ్చు. వాళ్ళు ఎన్నో విధాలుగా పరిశీలించి, పరిశోధించి మనకి ఇలాంటి విషయాలన్నిటిని చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి వాటిలోదే ఈ ఏనుగు బొమ్మని పెడితే అదృష్టం కలిసి రావటం అనే విషయం కూడా.

 

ఏనుగులు పోరాట శక్తికి, సంతానోత్పత్తికి, శుభాలకి ప్రతీకలు. ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది. మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలి ప్రవేశించలేవట. అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలకి రానీయవు. అలాగే బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుంది.

 

చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే ఏనుగు బొమ్మని వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెడితే వాళ్లకి విజ్ఞానం పెరిగి మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుందని చాలా మంది నమ్మకం. అలాగే కొంతమంది ఇళ్ళల్లో పిల్లలు పెద్దయ్యాకా వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఎదురై పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లితండ్రులకి మనోవేదనను మిగులుస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో తల్లికి పిల్లలకి మధ్య సత్సబంధాలు పెరగాలంటే ఒక పెద్దఏనుగు దాన్ని పిల్ల గున్న ఏనుగుతో కలిసి ఉన్న బొమ్మను గాని, ఫోటో ని గాని పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చి స్థిరపడాలంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చుని ఉన్న బొమ్మ గాని ఫోటో గాని ఇంట్లో పెట్టుకోవాలిట. ఇలా చెయ్యటం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్దిని చూడగలరు. అలాగే వ్యాపారస్తులు తమ షాప్స్ లో కౌంటర్ దగ్గర ఏనుగు బొమ్మను ఉంచినట్టయితే అది కస్టమర్స్ ని ఆకర్షించి వ్యాపారంలో లాభాలను తీసుకువస్తుంది.

 

ఇలా తొండం పైకి ఎత్తి ఉంచిన ఏనుగు బొమ్మలు, విగ్రహాలు అవి ఉండాల్సిన స్థానాల్లో ఉంచితే మనకు మంచి ఫలితం కలుగుతుంది అనటంలో సందేహం లేదు. అయితే ఇంట్లో పెట్టే బొమ్మలు ఇంటి లోపలి వైపు చూస్తునట్టు పెట్టాలి గాని అవి బైటకి చూస్తునట్టు, తొండం బైట వైపు చూపిస్తునట్టు ఉండకూడదు. ఇంకేముంది మీకు కావల్సిన ప్లేస్ లో ఈ ఏనుగు బొమ్మను పెట్టి  అదృష్టం మీ తలుపు తట్టేలా చూసుకోండి.

- కళ్యాణి