వినాయకుని ఎనిమిది అవతారాలు - 2

 

వినాయకుని ఎనిమిది అవతారాలు - 2

 


వేర్వేరు సందర్భాలలో భక్తులను రక్షించేందుకు విఘ్నేశ్వరుడు ఎనిమిది అవతారాలు దాల్చినట్లు ముద్గల పురాణం చెబుతోంది. అందులో మాత్సర్యాసురుడు, మదాసురుడు, మోహాసురుడు, లోభాసురుడు అనే రాక్షసులని జయించేందుకు వక్రతుండుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు అనే అవతారాలను ఆ వినాయకుడు ధరించినట్లు తెలుసుకున్నాము. ఇక మిగతా నాలుగు అవతారాల కథలు ఇవీ…

 

లంబోదరుడు – దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు, విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజరూపంలోకి వచ్చాడో... శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జనించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు, ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన (ప్రీతి) దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం.

 

వికటుడు – పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది.

 

విఘ్నరాజు – కామ, క్రోధ, మోహ, లోబ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి.

 

ధూమ్రవర్ణుడు – అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం.    

 - నిర్జర.