మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి

 

 

మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి ?

 



మట్టిలోంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక కారణమైనా..మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల, అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యివేసి, చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది. చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది. ఇదీ ఓ కారణమైనా..అసలు కారణం మరొకటి ఉంది. అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కదా. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకునే పూజించాలి. అప్పుడే...భక్తి..ముక్తి..శక్తి. అలాగే మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుడిని పూజించాలి. వినాయకచవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి వుంటుంది. వినాయకచవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈమధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విష పదార్ధంతోనే సమానం. మనకు అన్నీ ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విష పదార్ధాన్ని పూజించడం ఎంతవరకు సమంజసం? అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే నీళ్ళు పూర్తిగా కలుషితమైపోతాయి. మట్టి వినయాకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే వుండదు. అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకీ మంచిది, పర్యావరణానికీ మంచిది. పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసేవారినే ఇష్టపడతాడు.